- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ
- 'ఇండియా' పేరుతో ఏకమైన ప్రత్యర్థులు
- 'బలమైన రాష్ట్ర నాయకత్వం ఏది?' అనే ప్రశ్నలు
ఇలాంటి సవాళ్ల మధ్య ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టింది బీజేపీ. అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సంచలన విజయం నమోదు చేసింది. బలమైన సంస్థాగత వ్యవస్థ, పదునైన వ్యూహాలు, అభివృద్ధి మంత్రం, మోదీ ప్రజాకర్షణ పెట్టుబడిగా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌దే అనుకున్న ఛత్తీస్‌గఢ్‌లో పాగా వేసి విశ్లేషకులే ముక్కున వేలేసుకునేలా చేసింది. మధ్యప్రదేశ్‌ను నిలబెట్టుకొని, రాజస్థాన్‌ను చేజిక్కించుకొని ప్రత్యర్థులకు పవర్ఫుల్ సందేశాన్ని పంపింది. గతంలో తగిలిన ఎదురుదెబ్బ ఎంత గట్టిదైనా- ప్రత్యర్థులు పుంజుకున్నారని చెప్పినా- రాష్ట్ర నాయకత్వంతో సమస్యలు ఉన్నా- ఇవేవీ కాషాయజెండా రెపరెపలను ఆపలేవని నిరూపించింది.
బలం ఉన్నచోటే మరింత బలంగా
Modi Election Strategy 2023 :'నీటిలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు' అన్నట్టుగా హిందీ హార్ట్‌ల్యాండ్‌లో బీజేపీ బలమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ను గుప్పిటపట్టి ఆ ప్రాంతాలపై తన మరింత పట్టు బిగించింది కమలదళం. 2024 ఎన్నికలకు తనకు ఎవరు సాటి అని విపక్షాలకు సవాల్ విసిరేలా వన్‌సైడ్ విక్టరీ సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో 65 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 61 స్థానాల్లో గెలుపొందింది. లోక్‌సభలో 12 శాతం సీట్లు ఇక్కడి నుంచే ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్రాల్లో గెలుపు బీజేపీకి ఫుల్ జోష్ ఇచ్చేదే.
రాష్ట్ర నాయకత్వం పటిష్ఠంగా లేకున్నా!
ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ కనిపిస్తుంది. గెలిచిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రాంతీయ నాయకత్వం ఆశించినంత బలంగా ఏమీ లేదు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నా- ఆయన్ను దూరం పెడుతున్నట్లు బీజేపీ అధిష్ఠానం నుంచే సంకేతాలు వచ్చాయి. రాజస్థాన్‌లో వసుంధర రాజెకు చెక్ పెట్టేందుకు ఎంపీ దియా కుమారి సహా కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం రమణ్ సింగ్‌ను సైతం పక్కనబెట్టింది.
అంతా మోదీ మహిమే!
రాష్ట్ర నాయకత్వం బలహీనంగా కనిపించినా ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోదీ సైతం ఈ రాష్ట్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. 'ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ' అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి అజెండాను చూసి కాషాయపార్టీకి ప్రజలు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.