రెండోసారి ప్రధానిగా పీఠమెక్కిన రెండేళ్ల తరవాత మొదటిసారి మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన మోదీ- సరికొత్త ప్రమాణాలతో కొత్త బృందం కూర్పును పూర్తిచేశారు. వెనకబడిన వర్గాలకు, కొత్తనీటికి విశేష ప్రాధాన్యమిస్తూనే మహిళాశక్తికి సముచిత స్థానం కల్పించి రాష్ట్ర రాజకీయాల్లో భిన్న రంగాల్లో రాటుతేలిన అనుభవజ్ఞులను కేంద్ర కేబినెట్‌లోకి ఆహ్వానించారు. 'కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన' విధానంపై గతంలో మక్కువ చాటిన ప్రధాని ఈ దఫా 77 మంది మంత్రులతో భారీ మంత్రిమండలిని కొలువుతీర్చారు! రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆచితూచి నూతన దళపతులను ఎంచుకోవడం సహా ఇన్నేళ్లుగా ప్రభుత్వానికి ఆవల ఉండిపోయిన ఎన్డీయే పక్షాలకూ ఎర్రతివాచీ పరిచారు.
బలోపేతం దిశగా..
దశాబ్దాల చరిత్రకు మౌనసాక్షి అయిన రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో నిన్న ప్రమాణస్వీకారం చేసిన 43 మంది మంత్రుల్లో ఏడుగురికి పదోన్నతి లభించగా, ముప్ఫై ఆరుగురు కొత్తవారు. మెరుగైన పనితీరుతో ప్రధాని మెప్పు పొందిన సప్త సహాయ సచివుల్లో జి.కిషన్‌రెడ్డి ఒకరు కావడం తెలుగువారికి తీపివార్తే అయినా- బంతి భోజనంలో ఆంధ్రప్రదేశ్‌కు ఈసారీ ఖాళీ విస్తరే దక్కింది! కీలక రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారం చెయ్యిదాటిపోకుండా భాజపా అధిష్ఠానం చేసిన కసరత్తు మంత్రివర్గ కూర్పులో ప్రస్ఫుటమైంది. బంగాల్ ముఖ్యమంత్రి మమతను నిలువరించి అక్కడ పార్టీని పైమెట్టుకు చేర్చే బాధ్యతను ముగ్గురు కొత్త సచివులకు అప్పగించింది. ఇవ్వజూపిన పదవులపై కినుక వహించి క్రితం సారి మంత్రివర్గానికి దూరంగా ఉండిపోయిన నితీశ్ జేడీయూ- ఈ తడవ రెండు పదవులతో సర్దుకుంది. గుజరాత్, కర్ణాటకల్లో భాజపా పునాదులను బలోపేతం చేసుకోవడం సహా ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల్లో కాషాయధ్వజాన్ని రెపరెపలాడించాలనుకుంటున్న మోదీ-షా ద్వయం ఆలోచనలకు మంత్రిమండలి అద్దంపడుతోంది.
పునర్ వ్యవస్థీకరణ దరిమిలా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లభించింది. విజయ శిఖరాల అధిరోహణకు బృందస్ఫూర్తే తారకమంత్రమని తరచూ చాటే ప్రధాని- కొత్త బృందం సమష్టి భాగస్వామ్యంతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపించాలన్నదే జాతిజనుల ఆకాంక్ష!