Mizoram MLA Candidates Assets : దేశంలోని చిన్న రాష్ట్రాల్లో మిజోరం ఒకటి. అక్కడ 40 శాసనసభ స్థానాలు ఉండగా.. ఈసారి స్వతంత్రులు సహా అన్ని పార్టీల తరపున 174 మంది పోటీలో ఉన్నారు. అందులో ఏకంగా 112 మంది అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నారు. వారందరిలో ఆప్ మిజోరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఉత్తర ఐజ్వాల్-3 నుంచి పోటీ చేస్తున్న ఆండ్రూ లాల్రేంకిమా పచుఔ రూ.69 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా అగ్రస్థానంలో నిలిచారు.
నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన ప్రమాణపత్రాల ప్రకారం.. మిజోరం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 64.4శాతం మంది కోటి రూపాయలకుపైగా ఆస్తులు కలిగి ఉన్నారు. సెర్చిప్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆర్.వన్లాల్‌ట్లుంగా రూ.55.6 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. జోరం పీపుల్స్ మూవ్‌మెంటు తరఫున చంపాయ్ నుంచి పోటీ చేస్తున్న H.గింజాలాల రూ.36.9 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తులన్నీ వ్యాపారం ద్వారా సంపాదించినట్లు కోటీశ్వరులైన అభ్యర్థులు తమ ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు.
సెర్‌చిప్ స్థానం నుంచి స్వతంత్రునిగా పోటీ చేస్తున్న రామ్‌లున్-ఈడెన్ అత్యంత నిరుపేద అభ్యర్థిగా నిలిచారు. ఈయన కేవలం రూ.1500 విలువ చేసే చరాస్తులు మాత్రమే కలిగి ఉన్నట్లు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో MNF అభ్యర్థి లాల్‌రినేంగా సైలో వందకోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతునిగా నిలిచారు. తూర్పు ఐజ్వాల్-2 నుంచి పోటీ చేసిన ఆ పార్టీకే చెందిన రాబర్ట్ రొమావియా రూ.44కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఈసారి వారి ఆస్తులు తరిగిపోయాయి. సైలో ఆస్తులు వందకోట్ల నుంచి రూ.26.24 కోట్లకు, రాబర్ట్ సంపద రూ.32.24కోట్ల తగ్గింది.