మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు చేపట్టి, ఆరునెలల నుంచి దేశాన్ని అగ్నిగుండంగా మార్చిన సైనికాధిపతి మిన్ ఆంగ్ లెయింగ్ తాను ప్రధానిగా వ్యవహరించనున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చిన ఆయన ఇటీవల తనను తానే ప్రధానిగా ప్రకటించుకున్నారు. 2023లో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తానని ఆయన చేసిన ప్రకటన వాస్తవరూపం దాల్చదని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సైనిక పాలన(జుంటా)కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజాస్వామ్యవాదుల ఆందోళనలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం, అనేకమందిని కారాగారాలకు తరలించడంతో పరిస్థితులు చేజారుతున్నాయి. రాజకీయ అస్థిరత పెచ్చరిల్లడంతో పాటు కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. 2020లో జరిగిన ఎన్నికల్లో అనేక అవకతవకలు చోటుచేసుకొన్నట్లు సైన్యం ఆరోపిస్తోంది. గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీ సారథ్యంలోని ఎన్‌ఎల్‌డీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఆ విజయమే సైన్యానికి కంటగింపుగా మారిందన్నది బహిరంగ రహస్యం. ప్రత్యర్థి పక్షమైన యూనియన్ సాలిడారిటీకి సైన్యం అన్ని రకాలుగా సాయం అందించినా 33 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ ఓటమిని జీర్ణించుకోలేకే సైన్యం తిరుగుబాటు చేయడం, ఆరునెలల దరిమిలా మిన్ ఆంగ్ లెయింగ్ ప్రధాని బాధ్యతలు చేపట్టడం వెనక దీర్ఘకాలిక వ్యూహమే ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మయన్మార్‌లో 1958లో అప్పటి సైనిక జనరల్ నెవిన్ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం మయన్మార్ సుదీర్ఘకాలం సైనికపాలనలో మగ్గింది. ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని అప్పటి సైనికపాలకులు అనుసరించిన వ్యూహాన్నే లెయింగ్ అనుసరిస్తున్నారని ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఏదో ఒక కారణంతో రద్దు చేయడం, సైనిక పాలన ప్రారంభించడం సైన్యానికి ఆనవాయితీగా మారింది. 2023లో ఎన్నికలు నిర్వహిస్తామన్న సైనికనేత హామీ బూటకమేనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా, ఆసియాన్ దేశాల కూటమి నుంచి భారీయెత్తున ఒత్తిడి వస్తే తప్ప దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ సాధ్యపడదని వారు విశ్వసిస్తున్నారు. ఇండొనేసియా నేతృత్వంలో 'ఆసియాన్' పలు దఫాలుగా మయన్మార్‌లోని జుంటాతో చర్చలు నిర్వహించింది. ఏప్రిల్‌లో రెండు బృందాల మధ్య అయిదు సూత్రాల ప్రాతిపదికన ఒప్పందం కుదిరింది.
సైనిక జుంటా ఎత్తుగడే