కశ్మీర్ లోయలో ముష్కర మూకలు స్వైరవిహారం చేస్తున్నాయి. సాధారణ పౌరులను సులభ లక్ష్యాలుగా ఎంచుకుంటూ హేయదాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల ఆరు రోజుల్లోనే ఏడుగురు అమాయకులను అవి పొట్టన పెట్టుకున్నాయి. ప్రకోపిస్తున్న ఉగ్రవాద తండాల పైశాచికత్వం- అల్పసంఖ్యాక వర్గాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కంటి మీద కునుకు కరవైన కశ్మీరీ పండిత సమూహం పిల్లాపాపలతో జమ్మూకు తరలిపోతోంది. లోయలోని పండిత కుటుంబాల్లో దాదాపు 70శాతం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని వలసపోతున్నట్లుగా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్‌ఎఫ్) ముసుగులో బుసలు కొడుతున్న ముష్కర మిన్నాగులతో- కశ్మీర్ చరిత్రలో నెత్తుటి పుటలుగా మిగిలిన మూడు దశాబ్దాల నాటి అరాచక పరిస్థితులు మళ్ళీ కోరచాస్తున్నాయి! రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం తొలగించిన తొమ్మిది నెలలకు లష్కరే తొయిబాకు నూతన నకలుగా టీఆర్‌ఎఫ్ పుట్టుకొచ్చింది. భద్రతాదళాల చారచక్షువులకు చిక్కని స్థానిక యువతను నరహంతక ముఠాలుగా నియోగిస్తూ, లోయలో నెత్తుటేళ్లు పారించడంలో అప్పుడే అది రాటుతేలిపోయింది. శరీరాలకు కెమెరాలను బిగించుకుని భద్రతా దళాలపై దాడులకు దిగుతూ, ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శిస్తూ కొత్త క్యాడర్‌ను ఆకర్షించడం, మిగిలిన ముష్కరులతో పోలిస్తే చాలా రహస్యంగా మసలడం- టీఆర్‌ఎఫ్ నయా ఉగ్రమార్గం! దాని కీలక కమాండర్ అబ్బాస్ షేక్‌ను బలగాలు ఇటీవల మట్టుపెట్టిన వారాల వ్యవధిలోనే బలం పుంజుకుని అది పేట్రేగిపోతున్న తీరే ఆందోళనకరం! టీఆర్‌ఎఫ్ తాచుపాములను పుట్టల్లోంచి వెలికి తీయడానికి శ్రమిస్తున్న బలగాలు- తొమ్మిది వందలకు పైగా నిద్రాణ ఉగ్రశక్తులను తాజాగా నిర్బంధించాయి. దాయాది దేశం దన్నుతో సుందర కశ్మీరంలో నెత్తుటి నెగళ్లను రాజేస్తున్న ఉగ్రవాద వ్యాఘ్రాల పీచమణచే సమర్థ విధానాలకు ప్రభుత్వం పదునుపెట్టాలి. భయవిహ్వల వాతావరణంలో బిక్కుబిక్కుమంటున్న అల్పసంఖ్యాక జనసమూహానికి భరోసా కల్పించడంలో- 'కశ్మీరియత్' స్ఫూర్తిగా స్థానిక నాయకత్వం, పౌరసమాజం క్రియాశీల పాత్ర పోషించాలి!
కశ్మీర్లో చేదుగతం.. పునరావృతం.. - undefined
సాధారణ పౌరులను సులభ లక్ష్యాలుగా ఎంచుకుంటూ హేయదాడులకు ముష్కర మూకలు తెగబడుతున్నాయి. ఇటీవల ఆరు రోజుల్లోనే ఏడుగురు అమాయకులను అవి పొట్టన పెట్టుకున్నాయి. ప్రకోపిస్తున్న ఉగ్రవాద తండాల పైశాచికత్వం- అల్పసంఖ్యాక వర్గాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కంటి మీద కునుకు కరవైన కశ్మీరీ పండిత సమూహం పిల్లాపాపలతో జమ్మూకు తరలిపోతోంది. లోయలోని పండిత కుటుంబాల్లో దాదాపు 70శాతం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని వలసపోతున్నట్లుగా కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
ఉగ్రవాద తండాల ఊచకోతల మూలంగా 1990 తరవాత 44 వేలకు పైగా కశ్మీరీ పండిత కుటుంబాలు వలసపోయినట్లు ఆరు నెలల క్రితం కేంద్రం పార్లమెంటుకు నివేదించింది. స్వదేశంలోనే కాందిశీకులైన పండితులందరినీ 2022 నాటికి కశ్మీర్ లోయకు తిరిగి తీసుకొస్తామని హోంమంత్రి అమిత్ షా లోగడ ప్రకటించారు. అందుకుగానూ పాతిక వేల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టిస్తామని ఉద్ఘాటించారు. బాధిత కుటుంబాలకు చెందిన 3841 మంది యువత సర్కారీ కొలువులు స్వీకరించి కశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లో స్థిరపడినట్లు, మరో రెండు వేల మంది వరకు ఉద్యోగాలకు ఎంపికైనట్లుగా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కశ్మీర్ పండితుల పునారావాస ప్రణాళికలకు ఇటీవలి హింసాత్మక ఘటనలు తూట్లు పొడుస్తున్నాయి. '370 అధికరణ రద్దు వంటి కేంద్ర ప్రభుత్వ విధానాల వైఫల్యాల ఫలితమే ప్రస్తుత పరిస్థితి' అని గుప్కార్ కూటమి (స్థానిక రాజకీయపక్షాల ఉమ్మడి వేదిక) విమర్శిస్తోంది. యువతలో రాజుకొంటున్న అసంతృప్తులను రెచ్చగొడుతూ ప్రతీపశక్తులు పబ్బం గడుపుకొంటున్న దృష్ట్యా- రాష్ట్ర హోదా పునరుద్ధరణ దిశగా రాజకీయ పక్షాలతో చర్చలు, ఎన్నికల నిర్వహణపై కేంద్రం దృష్టిసారించాలి. అభివృద్ధిని ఉపాధి కల్పనను కొత్త పుంతలు తొక్కించి నవ్య కశ్మీరాన్ని నిర్మిస్తామన్న హామీని సాకారం చేసే ప్రణాళికలతో ముందడుగు వేయాలి. మూడు నెలలుగా పెచ్చరిల్లుతున్న చొరబాట్లను సత్వరం కట్టడిచేసేలా సరిహద్దుల్లో నిఘాను పటిష్ఠీకరించాలి. ప్రగతి కోసం శాంతి, శాంతి కోసం భద్రత అత్యావశ్యకమన్న పూర్వ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ సందేశమే దారిదీపంగా సర్కారీ వ్యూహాలు చురుకు తేలాలిప్పుడు!
ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్ షోపియాన్‌లో ఎన్కౌంటర్