వ్యక్తి నిర్మాణానికి, మానవ వికాసానికి, సమాజ పురోగతికి విద్య కీలక సాధనంగా పనిచేస్తుంది. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా విద్యావ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత ఆవశ్యకం. దానివల్ల మానవ వనరుల నాణ్యత పెరుగుతుంది. దేశ ప్రగతిలో, పునర్నిర్మాణంలో ఆ వనరులు కీలక భూమిక పోషిస్తాయి. కానీ స్వతంత్ర భారతావనిలో ఆ దిశగా సరైన అడుగులు పడలేదు. సమాజ వికాసంలో, సుస్థిరాభివృద్ధిలో ముఖ్యప్రాత్ర పోషించాల్సిన విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందనేది వాస్తవం. 75 సంవత్సరాల సుదీర్ఘ స్వతంత్ర భారత దేశ చరిత్రలో విద్యా రంగాన గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా పెద్దగా సాధించిన పురోగతి అంతగా కనిపించడం లేదు. 1947 నుంచి నేటి వరకు విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చే దిశగా రాధాకృష్ణ కమిషన్, మొదలియార్ కమిటీ, కొఠారి కమిటీ, జాతీయ విద్యావిధానం-1968, నూతన విద్యా విధానం-1986, స్వర్ణ సింగ్ కమిటీ, రామ్మూర్తి కమిటీ, యశ్‌పాల్, జనార్దన్ కమిటీ తదితరాలెన్నో ఏర్పాటు చేసుకున్నాం. వాటి సిఫార్సులను మాత్రం అమలు పరచలేకపోయాం. 1951లో 18శాతంగా ఉన్న అక్షరాస్యత 75 సంవత్సరాల్లో 74శాతానికి పెరిగినా- నాణ్యమైన, గుణాత్మక విద్య నేటికీ అందడం లేదు. ఐక్యరాజ్య సమితి సూచించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ల్లో నాలుగోదైన '2030 నాటికి అందరికీ నాణ్యమైన విద్య' అందించే వైపు ఎటువంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. ఒక సర్వే ప్రకారం ప్రపంచంలోని నిరక్షరాస్యుల్లో 35శాతం మన దేశంలోనే ఉన్నారు.
నిధులు లేకుండా ప్రమాణాలా?
అక్షరాస్యత, నాణ్యమైన విద్య, మానవ వనరుల అభివృద్ధి తదితర విషయాల్లో స్వాతంత్య్రానంతరం అభివృద్ధి సాధించినా అనేక దేశాల కంటే ఇప్పటికీ ఇండియా వెనకబడే ఉంది. జీవన, విద్యా ప్రమాణాల వంటి ప్రాతిపదికల ఆధారంగా ఐరాస నిరుడు విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదికలో భారత్ 131వ స్థానంలో నిలిచింది. భారతీయ విద్యావ్యవస్థ ప్రపంచంలో అత్యంత పెద్దది, సంక్లిష్టమైనది. పురోగామి దేశాలు విద్యారంగంపై వెచ్చించే గణాంకాలను పరిశీలిద్దాం. దక్షిణ కొరియా తన జీడీపీలో ఎనిమిది శాతం, ఫిన్లాండ్ ఏడుశాతం, కెనడా 6.6శాతం, ఆస్ట్రేలియా ఆరు శాతం, జపాన్ అయిదు శాతం, రష్యా అయిదు శాతం, చైనా 7.28శాతం ఖర్చు చేస్తున్నాయి. భారతదేశంలో ఆరు శాతం నిధులు వెచ్చించాలని 1966లో కొఠారి కమిషన్ సూచించినా నేటికీ అందుకు మన్నన దక్కడం లేదు. ఏ ఒక్క సంవత్సరమూ నాలుగు శాతానికి మించి విద్యారంగానికి కేటాయింపులు జరగకపోవడం, భారతదేశంలో విద్యారంగ వెనకబాటుతనానికి ప్రధాన కారణం.
భారతదేశంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యారంగాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు బదలాయించారు. 45వ అధికరణలో అందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నా, నేటికీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేని దుస్థితి నెలకొంది. ప్రాథమిక విద్య కన్నా ముందు ప్రి-ప్రైమరీ విధానంలో విద్యను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమం’ కింద పనిచేస్తున్న అంగన్‌వాడీ వ్యవస్థ ఆశించినంత ప్రయోజనకరంగా లేదు. పాఠశాల విద్యావ్యవస్థలోనూ సర్కారు బడులు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కేంద్రీయ, మోడల్ విద్యాలయాల పేరిట మౌలిక వసతుల కల్పనలో అసమానతలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాఠ్యప్రణాళికల మధ్య విపరీతమైన అంతరాలు ఉన్నాయి. నూతన విద్యా విధానం-1986లో భాగంగా పాఠశాల స్థాయి విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు పెంపొందించేలా ఆనాటి మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాయి విద్యావ్యవస్థలో ప్రమాణాల మెరుగుదలకు ఆ వ్యవస్థ నాంది పలికింది. అదే స్థాయిలో ఇతర విద్యాసంస్థల్లో ప్రమాణాల పెంపు దిశగా చర్యలు కొనసాగలేదు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని కొఠారి కమిషన్ సూచించింది. నేటి మార్కెట్ పరిస్థితుల్లో మాతృ భాషలో బోధన పట్ల పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధుల నుంచి ఏటా 40శాతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసమే వెచ్చించేలా నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థల పట్ల దుర్విచక్షణ కొనసాగుతూనే ఉంది. ఉన్నత విద్య కోసం వెచ్చిస్తున్న నిధుల్లో అధిక మొత్తం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎం, ఐఐసీటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకే కేటాయిస్తూ రాష్ట్రీయ ఉన్నత విద్యాసంస్థలను చిన్నచూపు చూస్తున్నారు. సరైన ఆర్థిక వనరులు లేక బోధన, పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి అంశంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు- కేంద్ర వర్సిటీలతో పోటీ పడలేకపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులు అందజేస్తున్నా అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రణాళికల్లో తీవ్ర వ్యత్యాసం కారణంగా రాష్ట్ర విశ్వవిద్యాలయల్లాంటి సంస్థల విద్యార్థులు యూజీసీ, సీఎస్‌ఐఆర్ జాతీయస్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరచలేకపోతున్నారు.
నూతన విద్యా విధానం అమలు
గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని యువతలో తార్కిక శక్తిని, సామాజిక మానసిక దృఢత్వాన్ని, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించి, అత్యుత్తమ మానవ వనరులను తీర్చిదిద్దేలా 'నూతన విద్యా విధానం-2020' అమలు కావాలి. పోటీ ప్రపంచంలో పాఠశాల స్థాయి నుంచి శాస్త్ర, సాంకేతిక అంశాలను పటిష్ఠమైన, నాణ్యమైన బోధన, పర్యవేక్షణలను విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలు అందుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఉన్నత విద్యలో ఇప్పుడు ఉన్న వ్యవస్థల స్థానంలో 'భారతీయ ఉన్నత విద్యామండలి' ఏర్పాటు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. విద్యార్థి తనకు నచ్చిన అంశాలను చదువుకునేలా ఆర్ట్స్, మానవీయ శాస్త్రాలు, విజ్ఞానశాస్త్ర విభాగాల మేళవింపుతో 'బహుళ శాస్త్ర విధానం' రూపుదిద్దుకోవడం ద్వారా అన్ని రకాల సామర్థ్యాలు పెంపొందుతాయి. అది ఉపాధి అవకాశాలను విస్తృతపరుస్తుంది. ఉన్నత విద్యావ్యవస్థలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నత విద్యా సంస్థలు ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా ఈ విద్యావిధానం తోడ్పాటును అందజేస్తుంది. వీటన్నింటినీ అమలు పరచేందుకు వీలుగా స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతం నిధులను విద్యారంగంపై కేటాయిస్తే విద్యావ్యవస్థలో మెరుగుదలను ఆశించే అవకాశం ఉంటుంది. విద్యావ్యవస్థలో మార్పులవల్ల ప్రపంచ స్థాయి ఉన్నత విద్యాసంస్థలు భారత దేశంలో తమ శాఖలు ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడుతుంది. 75 వసంతాల భారత విద్యావ్యవస్థ గుణాత్మకమైన విద్యను విద్యార్థులకు అందించడంలో ఉన్న సమస్యలు ఏమిటో వాటిని అధిగమించడం ఎలాగో ఆత్మావలోకనం చేసుకోవాలి. విద్యావిధానం 1968, 1986 అనుకున్న లక్ష్యాలను సాధించి విద్యారంగం అభివృద్ధికి తోడ్పడలేకపోయాయి. 'నూతన విద్యా విధానం-2020' అయినా భారత విద్యారంగం కొత్తపుంతలు తొక్కేందుకు, మానవాభివృద్ధి, వికాసాలకు ఊతమివ్వగలదేమో చూడాలి!
'అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి ఉన్న ఏకైక ఆయుధం విద్య ఒక్కటే'