ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నేడు పరస్పర అనుసంధానంగా, పరస్పరాశ్రితంగా పనిచేస్తోంది. ఈనాటి స్థితిగతుల్లో భారత్ వంటి వర్ధమాన దేశాలు భారీ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సాగించి, ఆ వస్తువులను ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేయడం ద్వారా మాత్రమే ప్రగతి పథంలో దూసుకువెళ్ళగలుగుతాయి. ప్రస్తుతం ప్రపంచం వినియోగిస్తున్న ఎయిర్ కండిషనర్లలో 80శాతం, మొబైల్ ఫోన్లలో 70శాతం, పాదరక్షల్లో 60శాతం, సౌర బ్యాటరీల్లో 74శాతం, లగ్జరీ బ్రాండ్ల వస్తువుల్లో 60శాతం- చైనా నుంచి చవక ధరలకు ఎగుమతి అవుతున్నవే. చైనాకన్నా సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయడమే లక్ష్యంగా భారతదేశం తగు విధానాలను రూపొందించి అమలు చేయాలి. మొదట భారీ స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. అది సాధ్యపడాలంటే మన కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరచాలి. పరిశ్రమలకు తక్కువ ధరలపై నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి. విస్తృతంగా రహదారులు, రేవులు, విమానాశ్రయాలను నిర్మించి సరకుల రవాణా ఖర్చులను తగ్గించాలి. మరీ ముఖ్యంగా పురాతన కార్మిక చట్టాల్లో మార్పులుచేర్పులు చేయాలి. ఈ చైతన్యంతోనే కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
ఉద్యోగులు, యజమానులపై ప్రభావం
ఇంతవరకు ఉద్యోగుల జీతంలో కొంత శాతాన్ని భవిష్య నిధి (పీఎఫ్), గ్రాట్యుటీ, ఈఎస్‌ఐ చెల్లింపులకు కేటాయిస్తున్నారు. వేతన సంహిత మూలంగా ఈ పద్ధతిలో మార్పులు రానున్నాయి. ఉద్యోగమిచ్చేటప్పుడే కొత్త నిబంధనలను ఉల్లేఖిస్తారు. నాలుగు కార్మికకోడ్‌లు అన్ని రంగాల్లో ఒప్పంద కార్మికులు, పూర్తికాల ఉద్యోగులతోపాటు ఒప్పంద కార్మికులు, డిజిటల్ వేదికలపై పనిచేసే ఉద్యోగులు అందరికీ వర్తిస్తాయి. ఒక ఉద్యోగి రాజీనామా చేసినా లేదా అతడిని తొలగించినా, బర్త్‌రఫ్ చేసినా రెండు రోజుల్లోనే పూర్తి వేతనాలను చెల్లించాలని వేతన సంహిత నిర్దేశిస్తోంది.
ఇదీ చదవండి:పెను సంక్షోభంలో లఘు పరిశ్రమలు
ఇదీ చదవండి:ఉన్నత ఆదర్శానికి సాంకేతిక దన్ను
కీలకమైన నాలుగు 'కోడ్'లు
కేంద్ర ప్రభుత్వం 44 పాత కార్మిక చట్టాలను నాలుగు 'కోడ్'లు లేదా 'సంహితలు'గా వర్గీకరించింది. వీటిలో మొదటిదైన వేతన సంహిత (2019) సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఒకే విధమైన పని చేసే శ్రామికులకు ఒకే విధమైన వేతనాలు, బోనస్ లు చెల్లించాలని నిర్దేశిస్తోంది. ఇది అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలకు వర్తిస్తుంది. రెండోది- కార్యస్థానాల్లో వృత్తి ఉద్యోగపరమైన భద్రత, ఆరోగ్య రక్ష, పని పరిస్థితులకు సంబంధించినది. దీన్ని 2020లో రూపొందించారు. అదే సంవత్సరం సామాజిక భద్రత, ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించిన తొమ్మిది పాత చట్టాలను సామాజిక భద్రతా సంహిత కింద సంఘటితపరచారు. అది మూడో కార్మిక కోడ్. తరవాత 1947నాటి పారిశ్రామిక వివాదాల చట్టం, 1926 నాటి కార్మిక సంఘాల చట్టం, 1946నాటి పారిశ్రామిక ఉపాధి చట్టాలను పారిశ్రామిక సంబంధాల సంహిత (2020) కింద సంఘటితం చేశారు. ఇది దేశంలో వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించింది. ఈ నాలుగు కార్మిక సంహిత(కోడ్)లు పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం పొందాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో నాలుగు కోడ్‌లను ఒకే దఫాలో అమలులోకి తీసుకురావాలని కేంద్రం లక్షిస్తోంది. దీంతో కార్మిక సంస్కరణలు ఒక కొలిక్కి వస్తాయి. కార్మిక చట్టాలు రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలోనివి కాబట్టి, ఈ కోడ్‌లకు తోడుగా రాష్ట్రాలు తమ సొంత నిబంధనలను రూపొందించి అమలు చేసుకోవచ్చు.