తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆదివాసులపై మహమ్మారి పంజా!

దేశంలో కొవిడ్ వ్యాప్తి గిరిజనులనూ వణికిస్తోంది. కొద్ది నెలల క్రితం అండమాన్‌ దీవుల్లోని 'గ్రేట్‌ అండమానీస్‌' వాసుల్లో (వీరి జనాభా 50-60 లోపేనని అంచనా!) పది మంది కొవిడ్‌ బారినపడటం అందరినీ కలవరపరుస్తోంది. గత నెల చివరి పది రోజుల్లోనే ఒడిశాలోని కంధమాల్‌ అటవీ ప్రాంతంలో నివాసం ఉండే 'దొంగరియా కొంధ్‌'లలో 80కి పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో పాటు.. పోషకాహార లోపం, క్షయ, రక్తహీనత, తట్టు తదితర అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయి.

tribals
ఆదివాసులు, గిరిజనులు

By

Published : Jun 5, 2021, 7:04 AM IST

భారతదేశంలో 705 విభిన్న తెగలకు చెందిన 10.45 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. వీరిలో కొంత మంది ఇప్పటికీ అటవీ ఆధారిత జీవనశైలినే కొనసాగిస్తున్నారు. క్షీణిస్తున్న జనాభా, అత్యంత తక్కువ అక్షరాస్యత, వెనకబాటుతనంతో కనీసం రవాణా సౌకర్యం లేని భౌగోళిక క్షేత్రాల్లో నివసిస్తున్నారు. ఇటువంటి 75 తెగలను ఆదిమ గిరిజన సమూహాలు లేదా అంతరించే స్థితిలో ఉన్న గిరిజన సమూహాలు(పీవీటీజీ)గా వర్గీకరించారు. వీటిలో 19 తెగలు వెయ్యిలోపు జనాభాతో- అంతర్ధానమయ్యే ముప్పును అధికంగా ఎదుర్కొంటున్నాయి. ఈ సమూహాలతో పాటు అయిదు నుంచి యాభై వేల జనాభా కలిగిన మరో 47 తెగల వారు ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.

ఆవాస ప్రాంతాలు క్షీణించడం, ఆధునిక సమాజ సంపర్కంతో కొత్త వ్యాధులు సంక్రమిస్తూ ఉండటంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోషకాహార లోపంతో పాటు క్షయ, రక్తహీనత, తట్టు తదితర అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెగల్లో కొవిడ్‌ విజృంభణ మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

గడిచిన రెండు నెలల్లోనే..
కొద్ది నెలల క్రితం అండమాన్‌ దీవుల్లోని 'గ్రేట్‌ అండమానీస్‌' వాసుల్లో (వీరి జనాభా 50-60 లోపేనని అంచనా!) పది మంది కొవిడ్‌ బారినపడటం అందరినీ కలవరపరుస్తోంది. గత నెల చివరి పది రోజుల్లోనే ఒడిశాలోని కంధమాల్‌ అటవీ ప్రాంతంలో నివాసం ఉండే 'దొంగరియా కొంధ్‌'లలో 80కి పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. కొంధులు మొదట్లో పరీక్షలకు ససేమిరా అన్నా, రాయగఢ జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకుని వారిని ఒప్పించింది.

అలాగే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని చర్లలో 89 మందిని పరీక్షించగా 39 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితుల్లో కొండరెడ్లు ఉండటం గమనార్హం. కేరళలో మే 31 నాటికి 17,401 మంది ఆదివాసులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. 146 మంది మరణించారు. ఈ కేసుల్లో 80శాతం గడచిన రెండు నెలల్లో నమోదైనవే. ఎన్నికల వల్ల గిరిజనేతరుల రాకపోకలు పెరగడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇలా కరోనా వైరస్‌ చాప కింద నీరులా దేశవ్యాప్తంగా అన్ని ఆదివాసీ తెగల్లోకీ వ్యాపిస్తోంది.

ఆరోగ్య కేంద్రాలూ లేక..

గిరిజనుల ప్రత్యేక ఆచార వ్యవహారాల కారణంగా సామాజిక దూరం, క్వారంటైన్‌ వంటివి పాటించడం చాలా కష్టం. మాస్కులు, శానిటైజర్ల వంటివి అందుబాటులో ఉండటమూ అంతంత మాత్రమే! ఆదివాసీ ప్రాంతాల్లో తగినన్ని ఆరోగ్య కేంద్రాలు లేకపోవడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగితే జరగబోయే ఉపద్రవాన్ని ఊహించడమే సాధ్యం కాదు! అందువల్ల కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం స్పందించి ఆదివాసులను రక్షించాలని సామాజిక ఉద్యమకారులు, రచయితలు ఇటీవల విజ్ఞప్తిచేశారు.
ఆదివాసీ ప్రాంతాల్లోని ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన సామగ్రిని గిరిజన మంత్రిత్వ శాఖ ఇప్పటికే పంపిణీ చేసింది. ఈ సంక్షోభ సమయంలో ఆదివాసులకు ఆర్థికంగా అండదండలు అందించడానికి అటవీ ఉత్పత్తుల కనీస ధరను పెంచడంతో పాటు 23 కొత్త ఉత్పత్తులను జాబితాలో చేర్చింది. 1,126 'వన్‌ వికాస్‌' కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాలూ కల్పిస్తోంది. జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ సైతం ఇందుకు సహాయ సహకారాలు అందిస్తోంది. బయటివారిని చూస్తే భయపడే ఆదివాసులు ప్రభుత్వ సాయాన్ని అందిపుచ్చుకోలేక పోతున్నారు.

పోషకాహారం లోపించడంతో వీరిలో వైరస్‌ను ఎదుర్కోవడానికి తగిన రోగనిరోధక శక్తి ఉండదు. మహమ్మారి కారణంగా ఆదివాసుల జనాభా మరింత క్షీణించకుండా ఉండాలంటే- సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ముందుకు వచ్చి గిరిజన గూడేలు, పల్లెలన్నింటికీ ఆరోగ్య కార్యకర్తల బృందాలను పంపించాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి, బాధితులకు తగిన వైద్యసాయం అందించాలి. అలాగే, ఆదివాసీ జనావాసాలకు దగ్గరలో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలను ఆధునికీకరించాలి. ఆదివాసీ ప్రాంతాల్లోకి గిరిజనేతరుల రాకపోకలనూ కట్టడి చేయాలి. కేరళ తరహాలో- 18 ఏళ్లకు పైబడిన ఆదివాసులందరికీ సత్వరం టీకాలు వేయాలి. ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టకపోతే జారవా, సెంటినెలీస్‌, ఒంగె, బోండా, చోళనాయకన్‌, అబూజ్‌ మారియా, బిర్‌హార్‌ వంటి తెగలకు తీరని నష్టం వాటిల్లనుంది!

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌(మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ గిరిజన వర్సిటీ సహాయ ఆచార్యులు).

ఇదీ చదవండి:ఆకాశంలో మరో అరుదైన ఘట్టం

ABOUT THE AUTHOR

...view details