భవిష్యత్తును తీర్చిదిద్దుకొనే హక్కు మగవాళ్లకెంత ఉందో మహిళలకూ అంతే ఉందన్నారు మహాత్మాగాంధీ. పురుషాధిక్య భావజాలం ప్రబలంగా ఊడలు దిగిన భారతీయ సమాజంలో అన్నింటా లింగ సమానత్వ భావనకు రాజ్యాంగమే పట్టం కట్టింది. సామాజికంగా వెనకబడిన వర్గాలకు తగు ప్రోత్సాహకాలందించే సదావకాశాన్ని ప్రభుత్వాలకు కట్టబెట్టింది. కులమత ప్రాంత వర్గ భేదాలతో నిమిత్తం లేకుండా తరాల తరబడి అబలలన్న ముద్రపడి ఇంటిపట్టుకే పరిమితమైన సగటు భారత నారి- సామాజిక వాతావరణంలో కొన్ని దశాబ్దాలుగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకొంటోంది. అవకాశం ఉన్నచోట అతివలెంతగా రాణించగలరో నాసా శాస్త్రవేత్త స్వాతి మోహన్, అగ్రరాజ్యం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ రుజువు చేసి స్ఫూర్తిదాతలవుతుంటే- చట్టబద్ధంగా దక్కాల్సిన వాటికోసమూ కోర్టుల్ని ఆశ్రయించాల్సిన ప్రారబ్ధం దేశీయంగా మహిళల్ని వెంటాడుతోంది. గౌరవప్రద జీవనం కోసం అహరహం శ్రమించి ఎదుగుతున్న మహిళలకూ లైంగిక వేధింపులు తప్పని పీడ- ప్రాణాంతక చీడగా దాపురించింది. దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలకు సిద్ధపడుతున్న జాతి మనది. జనావళిలో సగంగా ఉన్న మహిళల కన్నీటి నివేదనల్ని ఆలకించడం అందరి విధి!
రణరంగంలో శత్రువుల్ని చెండాడిన ఝాన్సీ లక్ష్మీబాయి వీరగాథను పాఠ్యాంశంగా పసి మెదళ్లకు నూరిపోసే ప్రభుత్వం- సైన్యంలో సమన్యాయానికి తలుపులు మూసేయడం ఏమిటి? ఇజ్రాయెల్‌లో మహిళా సైనికులు పాతికేళ్లకుపైగా పోరాట విధుల్లో పాల్గొంటుంటే- 2001 నుంచి జర్మనీ, 2013 నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, 2018 నుంచి బ్రిటన్ అందుకు అనుమతించాయి. పరిమిత కాల విధుల్లో (షార్ట్ సర్వీస్ కమిషన్)ని మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వాలంటూ 2010లో దిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. అప్పటిదాకా జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం- ఆ తీర్పుపై అప్పీలు చేస్తూ వినిపించిన వాదనలు, పాలకుల మెదళ్లలో బూజుపట్టిన భావజాలాన్ని కళ్లకు కట్టాయి. జవాన్లలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు కావడంతో కమాండ్ హోదాలో మహిళా అధికారుల్ని ఆమోదించేందుకు మానసికంగా వారింకా సంసిద్ధంగా లేరట!
స్త్రీసహజ ప్రకృతి ధర్మాలు, కుటుంబపర బాధ్యతల నిర్వహణ వంటి వాటివల్ల సైనిక విధుల్లోని సవాళ్లను వారు అధిగమించలేరట! ఆ వాదనలన్నీ పసలేనివిగా తీర్మానించిన సుప్రీంకోర్టు- కవాతుల్లో పురుష జవాన్లతో కూడిన దళాలను ముందుండి నడిపించిన లెఫ్ట్‌నెంట్ భావనా కస్తూరి, కెప్టెన్ తానియా షేర్‌గిల్ సామర్థ్యాన్ని, ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో భారత మహిళా అధికారుల పాత్రను ప్రస్తావించి నిరుడు ఫిబ్రవరిలో పర్మినెంట్ కమిషన్ ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాల్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై 86 మంది మహిళలు మళ్లీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యం- కీలక స్థానాల్లోనూ పురుషాధిక్య భావజాలం ఎంతగా బుసలు కొడుతోందో వెల్లడించింది. మగవారి కోసం, మగవారే పెట్టుకొన్న వ్యవస్థ మహిళలపట్ల ప్రదర్శిస్తున్న దుర్విచక్షణను న్యాయపాలిక మళ్ళీ ఉతికి ఆరేసింది. 'మహిళాధికారుల్ని ఎంపిక చేయడం కన్నా వారిని తిరస్కరించడానికే బోర్డు భేటీ అయినట్లుంది' అన్న సుప్రీం వ్యాఖ్య చాలు- లింగ విచక్షణకు అదే తిరుగులేని రుజువు. దుర్విచక్షణాపూరితమైన మదింపు విధానాన్ని మార్చాలంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరించినా రాత్రికిరాత్రే సంబంధిత పెద్దల ధోరణి మారుతుందా, అంటే- సందేహమే. మరోవంక పని ప్రదేశాల్లో స్త్రీలపట్ల అధికార మదాంధుల లైంగిక దారుణ దురాగతాలదీ- అంతులేని వ్యధే!
స్త్రీ సాధికారతను చిదిమేస్తున్నారు!