తెలంగాణ

telangana

ETV Bharat / opinion

జాతీయ నియామక సంస్థపై నిరుద్యోగుల ఆశలు - నిరుద్యోగులు తంతాలు

రైల్వే నియామక సంస్థ (ఆర్‌ఆర్‌బీ) సాంకేతికేతర ముఖ్య విభాగాల్లో (నాన్‌టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీల్లో) ఖాళీగా ఉన్న 35,208 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి దేశ వ్యాప్తంగా కోటిన్నర మంది దరఖాస్తులు చేసుకున్నారు. కానీ కరోనా రావటం వల్ల ఇప్పుడు నియామక పరీక్షల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేంద్రం పరిధిలోని అన్ని ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ప్రక్రియను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం జాతీయ నియామక సంస్థ ఏర్పాటుకు పూనుకోవడం సానుకూల పరిణామం.

Mars for step-by-step competitive exams
అడుగడుగు పోటీ పరీక్షలకు మంగళం

By

Published : Aug 22, 2020, 6:58 AM IST

కరోనాకు ముందు రైల్వే నియామక సంస్థ (ఆర్‌ఆర్‌బీ) సాంకేతికేతర ముఖ్య విభాగాల్లో (నాన్‌టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీల్లో) ఖాళీగా ఉన్న 35,208 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా దేశవ్యాప్తంగా కోటిన్నర దరఖాస్తులు వచ్చాయి. కరోనా భయం ఉన్నా దరఖాస్తులకు వెనకాడలేదు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) తదితర ఉద్యోగ నియామకాలకు కోట్ల సంఖ్యలోనే అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతకిది అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేంద్రం పరిధిలోని అన్ని ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ప్రక్రియను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం జాతీయ నియామక సంస్థ ఏర్పాటుకు పూనుకోవడం సానుకూల పరిణామం. కేంద్ర ప్రభుత్వ నాన్‌గెజిటెడ్‌, బ్యాంకుల్లో గ్రూపు-బి, గ్రూపు-సి ఉద్యోగాలకు బహుళ పరీక్షల విధానానికి స్వస్తిపలికి ఉమ్మడి అర్హత పరీక్ష (సీఈటీ) జరపడం, దేశంలోని అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు, ఆకాంక్షిత జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ, ప్రాంతీయ భాషల్లో రాసే వెసులుబాటు వంటివి అభ్యర్థుల వ్యయప్రయాసలను తగ్గిస్తాయి. ఇవి ఏ మేరకు సఫలీకృతం అవుతాయన్నది కేంద్ర ప్రభుత్వ కార్యాచరణపై ఆధారపడి ఉంది.

పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం

కులవృత్తుల హననం, కరవు కాటకాలు, ప్రైవేటు ఉద్యోగాల తొలగింపుల వంటివీ నిరుద్యోగిత విస్తృతికి కొన్ని కారణాలు. దేశంలోని 997 ప్రభుత్వ ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదైన నిరుద్యోగుల సంఖ్య 6.1 కోట్లు. వాటి పరిధిలో లేనివారి సంఖ్య మరో ఏడు కోట్లకు పైగా ఉంటుందని జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) చెబుతోంది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో 18 లక్షలు భర్తీ కావాలి. ఏటా రెండున్నర లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. రాష్ట్రాల్లోనూ ఖాళీల సంఖ్య భారీగానే ఉంది. 2019 వరకు వివిధ శాఖల్లో ఈ ఖాళీలు 22 లక్షలున్నాయి. ఉద్యోగాల భర్తీని ఆర్థిక స్థితిగతులకు అనుసంధానం చేయడంతో నియామకాలకు విత్త మంత్రిత్వ శాఖ అనుమతులివ్వడం లేదు. పొదుపు చర్యలంటూ పోస్టులను కుదిస్తున్నారు. కేంద్రం ఖాళీల భర్తీని అడపాదడపా చేపడుతోంది. పాలన సంస్కరణల్లో భాగంగా బ్యాంకుల విలీనం, ప్రభుత్వరంగ సంస్థల మూసివేత, ప్రైవేటీకరణల వల్ల వాటిలో నియామకాలు ఇకపై సాగేది అనుమానమే!

ఏళ్ల తరబడి కుస్తీలు

ప్రభుత్వ ఉద్యోగం వస్తే దశ తిరుగుతుందని చాలామంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి కుస్తీలు పడుతుంటారు. దిల్లీలోని కేంద్ర కేబినెట్‌ సచివాలయం, ఇతర శాఖల్లో సేవలు ఆలస్యం కావడానికి సరైన సంఖ్యలో ఉద్యోగులు లేకపోవడమే కారణం. రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. గంటలో పరిష్కారం కావాల్సిన దస్త్రానికి ఏళ్ల సమయం పడుతోంది. ఒక్కో ఉద్యోగి రెండు నుంచి నాలుగేసి బాధ్యతల్ని తలకెత్తుకోవాల్సి వస్తోంది. అందువల్లే పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు ప్రైవేటు రంగం తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. తాత్కాలిక నియామకాలు, వేతనాల పెంపు, పింఛన్‌ లేకపోవడం వల్ల నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగంపైనే మక్కువ చూపుతున్నారు. స్వయంఉపాధి మెరుగైన మార్గమైనా- బ్యాంకుల నిస్సహాయత వల్ల అది స్థిరపడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బదులు ప్రభుత్వాలు ఒప్పంద, పొరుగు సేవల పేరిట తాత్కాలిక సిబ్బందిని నియమిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులు లక్షలు, కోట్ల సంఖ్యలో వెల్లువెత్తుతున్నాయి. అటెండర్‌ పోస్టులకు సైతం పీజీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దరఖాస్తు ప్రక్రియా వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటోంది. అనేక ధ్రువపత్రాలు సమర్పించాలి. ఆపై పరీక్ష తేదీ కోసం నిరీక్షించాలి. ఆంగ్లం లేదా హిందీలో పరీక్ష రాసే విధానం వల్ల ప్రాంతీయ భాషలవారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పరీక్ష రాయడానికి నిరుద్యోగులు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

మహిళా అభ్యర్థుల ఇబ్బందులు మరింత బాధ కలిగిస్తాయి. ఫలితాలు వచ్చాక ఏ ప్రాతిపదికన అవకాశం వచ్చిందో, ఎందుకు రాలేదో అన్నదానిపై పారదర్శకత ఉండదు. ఎంపిక ప్రక్రియ అంతా మాయాజాలంగా ఉంటుంది. మౌఖిక పరీక్షలూ ప్రహసనప్రాయంగా ఉంటాయి. చేయబోయే ఉద్యోగానికి, అడిగే ప్రశ్నలకు పొంతన ఉండదు. రైల్వే శాఖలో ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలవారికే ఉద్యోగాలు అధికంగా ఎందుకు వస్తాయనే ప్రశ్నకు సమాధానం లేదు. దక్షిణమధ్య రైల్వే కేంద్రం తెలంగాణలో ఉండగా స్థానికులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లను అమలు చేయరు. ప్రశ్నపత్రాల లీకేజీలు మరోశాపం. దళారుల వసూళ్లు మరో కోణం. ఫలితాల్లోనూ అవకతవకలు ఉంటున్నాయి. ఉద్యోగ సాధనలో ఇన్ని అడ్డంకులు, క్లిష్టతలు ఉన్నందువల్లే ప్రధాని మోదీ తాజా ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది.

ఏకీకృత విధానంతో మేలు

కొత్త విధానంలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ పర్సెనల్‌(ఐబీపీఎస్‌) ఉద్యోగ నియామకాలకు ఆన్‌లైన్‌లో ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఆంగ్లం, హిందీ సహా 12 ప్రాంతీయ భాషల్లో వీటిని రాయవచ్ఛు ఒకసారి రాసే పరీక్ష మూడేళ్ల వరకు పనికి వస్తుంది. మార్కులను మెరుగుపరచుకోవడానికి మళ్లీ పరీక్షలు రాయవచ్ఛు దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు వల్ల గామీణ ప్రాంత అభ్యర్థులకు ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇవిగాక దేశంలోని 117 ఆకాంక్షిత జిల్లాల్లో పరీక్షలు నిర్వహించేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. నూతన నియామక సంస్థ పనితీరుకు లక్ష్యసాధనే ప్రామాణికం కావాలి. కొత్త నియామకాలను సత్వరం పెద్దసంఖ్యలో చేపట్టి నిరుద్యోగుల నమ్మకం పొందాలి. పారదర్శకత, నిష్పాక్షికత, వేగవంతమైన కార్యాచరణకు కృషి చేయాలి. కొన్ని కేడర్లకే కాకుండా అన్ని పోస్టులకూ దీన్ని విస్తరించాలి. కేంద్రం ఆధ్వర్యంలో ప్రస్తుతం 20కిపైగా నియామక సంస్థలు ఉండగా, ప్రస్తుతం మూడింటినే అర్హత పరీక్షల పరిధిలో చేర్చారు. ఇతర నియామక సంస్థలనూ త్వరగా దీని పరిధిలోకి తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అవలంబించేలా చొరవ చూపాలి. ప్రైవేటు రంగంలోని ఇతర సంస్థలూ దీన్ని ఉపయోగించుకోవాలి. సీఈటీ మార్కుల జాబితాను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు రంగానికి సంబంధించిన నియామక సంస్థలకు అందుబాటులోకి తేవాలి. సీఈటీ స్కోరుతోపాటు దేహదారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి నియామకాలు జరపాలి. ప్రస్తుత విధానంలో ఒకే అభ్యర్థి రెండు లేదా మూడు పోస్టులకు ఎంపికయ్యాక ఒకదాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో మిగిలిన రెండూ భర్తీకాకుండా ఉండిపోతున్నాయి. వాటిని ఆ పరీక్ష రాసిన ఇతర అభ్యర్థులకు కేటాయించకపోవడం పెద్దలోపం. మళ్లీ పరీక్షలు రాసే వరకు ఖాళీగానే ఉంటున్నాయి. జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ) పరీక్షల నిర్వహణకే పరిమితం కాకుండా అభ్యర్థులకు శిక్షణ అందజేసి, కాలానుగుణ సంస్కరణలు చేపట్టేందుకు చొరవ చూపాలి!

- ఆకారపు మల్లేశం

ABOUT THE AUTHOR

...view details