సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు. మనిషి సంతోషంగా ఉండటంవల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సానుకూల దృక్పథం పెరిగి, సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలం. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం- ఆనందంగా ఉన్నప్పుడు శారీరక వ్యాయామాల పట్ల శ్రద్ధ, ఆటల మీద ఆసక్తి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసమూ అధిక స్థాయిలో ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. మనిషిలో సంతోషానికి సూచిక చిరునవ్వు. ఆధునిక యుగంలో జీవనపోరాటంలో అలసిపోతున్న మనిషి ఒత్తిళ్లకు లోనై చిరునవ్వును మరచిపోతున్నాడు.
సంతోషం ప్రాధాన్యాన్ని గుర్తించిన భూటాన్- సంతోష సూచీయే నిజమైన ఆరోగ్య సూచీ అని ప్రపంచానికి చాటింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2013 నుంచి ఐక్యరాజ్య సమితి సంతోషం ప్రాముఖ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ- ప్రజల జీవన విధానంలో మార్పు తేవడానికి ఏటా మార్చి 20వ తేదీన అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పరమార్థం సైతం మానవుడు సంతోష, శ్రేయస్సులతో బతకడమే. పేదరికం అంతం చేయడం, మనుషుల మధ్య అంతరాలను తగ్గించడం, భూగోళాన్ని రక్షించడమనే మూడు సార్వత్రిక లక్ష్యాలను అది ప్రపంచ దేశాల ముందుంచింది. సంవత్సరం నుంచి కరోనా విపత్తు ప్రజల ఆనందాన్ని దూరం చేసిన సంగతి విదితమే. ఈ తరుణంలో సంతోషం కోసం సానుకూల మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. వ్యాధుల పట్ల అవగాహనతో పాటు ఇతరుల పట్ల దయ కలిగి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఈ దినోత్సవం నొక్కి చెబుతోంది.
ఫిన్లాండ్ అగ్రస్థానం
సంవత్సర కాలంగా కొవిడ్ పట్ల భయాందోళనలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కరవయ్యాయి. వ్యాధి బారిన పడినవారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. మరోవైపు పిల్లలు చదువుకు దూరం కావడంతో, బడుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన బాల్యం కష్టాల్లో కూరుకుపోయింది. ఎందరో మహిళలు గృహహింసను ఎదుర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధితో పాటు అనేక ఇతర అంశాలు సైతం ప్రజల సంతోషంపై ప్రభావం చూపుతాయని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో 'ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సొల్యూషన్ నెట్‌వర్క్' ఆధ్వర్యంలో 'స్థూల జాతీయ ఆనందం' ఆధారంగా ప్రపంచ సంతోష సూచీని గణిస్తారు. దీనిలో ఆదాయం, ప్రజల ఆరోగ్య జీవనం, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, నమ్మకం, ఔదార్యం తదితర అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల సంతోష సూచీని విడుదల చేశారు. అందులో ఫిన్లాండ్ అగ్రస్థానం ఆక్రమించగా భారతదేశం 144వ స్థానంలో ఉంది. మన చుట్టూ ఉన్న నేపాల్ (92), పాకిస్థాన్(66), బంగ్లాదేశ్(107), శ్రీలంక(130) కన్నా మనం దీనస్థితిలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. సంతోషానికి దూరమైన ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావాలు అధికంగా ఉంటాయి. ఆ స్థితి మానవ వనరుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.