తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'బలహీన భారతం' నుంచి గట్టెక్కేదెలా?

దేశంలోని చాలా మంది బాల్యం దుర్భర వేదనల పాలవుతుందని 'ప్రపంచ క్షుద్బాధ సూచీ' వెల్లడిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 19కోట్ల మంది జనావళి పోషకాహర లోపంతో బాధపడుతున్నారు. జాతీయ పౌష్టికాహార మిషన్‌ 'పోషణ్‌ అభియాన్‌' ద్వారా 2022 నాటికి.. భారత్​ సాధించాల్సిన లక్ష్యాలను అందుకోలేదని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో పోషకాహార పంపిణీ వ్యవస్థను పరిపుష్టీకరించడానికి ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలి.

MANY PEOPLE IN INDIA SUFFERING CHILDHOOD MISERY: WORLD TRAUMA INDEX
బలహీన భారతం

By

Published : Nov 26, 2020, 9:50 AM IST

Updated : Nov 26, 2020, 10:05 AM IST

ఏడు దశాబ్దాల గణతంత్ర భారతాన పొత్తిళ్లలోనే బాల్యం దుర్భర వేదనల పాలవుతున్నదని ప్రపంచ క్షుద్బాధా సూచీ చాటుతోంది. వివిధ అధ్యయనాల క్రోడీకరణ ప్రకారం, దేశంలో సుమారు 19 కోట్ల జనావళిని పోషకాహార లోపాలు పట్టి పీడిస్తున్నాయి. జాతీయ పౌష్టికాహార మిషన్‌ 'పోషణ్‌ అభియాన్‌' ద్వారా 2022 సంవత్సరం నాటికి సాధించదలచిన లక్ష్యాల సాధనలో భారత్‌ కృతకృత్యం కాలేకపోవచ్చునని ఇటీవల 'లాన్సెట్‌'లో ప్రచురితమైన అధ్యయనం అభిప్రాయపడింది. ఇప్పుడు 'నీతి ఆయోగ్‌' నివేదికాంశాలూ చెబుతున్నదదే! దేశంలోని అయిదేళ్లలోపు పిల్లల్లో మూడోవంతుకు పైగా సరైన ఎదుగుదల కొరవడి గిడసబారిపోతున్నారు. 1-4 సంవత్సరాల పిల్లల్లో 40 శాతందాకా, గర్భిణులూ ఇతర మహిళల్లో 50 శాతానికి పైబడి రక్తహీనతతో కృశించిపోతున్నారు.

'పోషణ్‌ అభియాన్‌' ధ్యేయమదే..

2022 నాటికి ఆరు శాతం మేర ఎదుగుదల లోపాలను, బాలలు కౌమార బాలికలు బాలింతలు చూలింతల్లో తొమ్మిది శాతం వరకు రక్తహీనతను నియంత్రించాలన్నది 'పోషణ్‌ అభియాన్‌' మౌలిక ధ్యేయం. అందుకోసం ఉద్దేశించిన ప్రత్యేక కార్యాచరణకు అదనపు జవసత్వాలు సమకూర్చాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సు- కొవిడ్‌ ప్రజ్వలనానికి ముందే చేసినది. ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోయిన కారణంగా ప్రస్తుత సంవత్సరాంతానికి దేశదేశాల్లో కొత్తగా పౌష్టికాహార సంక్షోభంలో కూరుకుపోయేవారి సంఖ్య కోట్లలో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే మదింపు వేసింది. ఒక్క భారత్‌లోనే అత్యంత పేదరికంలోకి జారిపోయే మహిళల సంఖ్య 10కోట్లకు చేరుతుందన్నది యూఎన్‌డీపీ (ఐరాస అభివృద్ధి కార్యక్రమం) అంచనా. అందుకు తగ్గట్లు 'పోషణ్‌ అభియాన్‌' అమలును ఉరకలెత్తించడంతోపాటు- పంపిణీ, పర్యవేక్షణల పరంగా కంతల్ని చురుగ్గా పూడ్చటం ప్రజాప్రభుత్వాల దక్షతకు గట్టి పరీక్ష!

కొరవడిన కండర పుష్టి

ఇంకో పదేళ్లలో (2030 సంవత్సరం నాటికి) ఆకలి బాధలకు తావన్నదే లేని సౌభాగ్య ప్రపంచ అవతరణ, ఐక్యరాజ్యసమితి నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కీలకమైంది. దేశంలోనే దానికెన్ని తూట్లు పడుతున్నాయో వేరే చెప్పేదేముంది? ఇక్కడి ప్రజానీకం తినే 84శాతం శాకాహార వంటకాల్లో తగినన్ని మాంసకృత్తులు ఉండటం లేదు. సమతులాహారంపై సరైన జనచేతన లేక 70శాతం భారతీయుల్లో కండర పుష్టి కొరవడుతోంది. పట్టణ ప్రాంతాల్లోని చిన్నారులు, కౌమార ప్రాయంలోని వారిపై యునిసెఫ్‌, ఎన్‌ఐయూఏ (జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ)ల సంయుక్త అధ్యయనం- శిశుమరణాలు, రక్తహీనత, పౌష్టికాహార లోపాల తీవ్రతను ప్రస్ఫుటీకరించింది. కొవిడ్‌ మహా సంక్షోభం దేశవ్యాప్తంగా తొమ్మిదిన్నర కోట్లమంది దాకా విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని దూరం చేసింది. పర్యవసానంగా కాలే కడుపులతో మలమల మాడిపోతూ గత్యంతరం లేక బాలకార్మికులుగా మారి నలిగిపోయే అభాగ్యుల సంఖ్య ఏ మేరకు పోటెత్తిందో ఊహకందడం లేదు.

తల్లిపాల పోషణతోనే..

తల్లిపాల పోషణ సక్రమంగా సమకూరితే 60శాతందాకా పిల్లల ఎదుగుదల లోపాల్ని తేలిగ్గా చక్కదిద్దగల వీలుందని నీతి ఆయోగ్‌ చెబుతోంది. తల్లులు రక్తహీనతతో అలమటిస్తుంటే, వారి పిల్లలకు సహజ పోషకాహారం ఒనగూడేదెలా? అయిదేళ్లలోపే అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్న బాలల్లో 68 శాతం మరణాలకు పౌష్టికాహార లేమి పుణ్యం కట్టుకుంటోంది. ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌, మేఘాలయ, యూపీలతోపాటు మొత్తం 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆకలిని, పౌష్టికాహారలేమిని దీటుగా ఎదుర్కోవడంలో విఫలమవుతున్నట్లు ఈ ఏడాది మొదట్లోనే 'నీతి ఆయోగ్‌' వెల్లడించింది. క్షుద్బాధా పీడితుల పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్లున్న తరుణంలో- అంగన్‌వాడీ కేంద్రాలకు జవాబుదారీతనం మప్పి, ఇంటిదొంగల భరతం పట్టే క్షాళన చర్యలు చేపట్టి, పోషకాహార పంపిణీ వ్యవస్థను పరిపుష్టీకరించడానికి ప్రభుత్వాలు సత్వరం కదలాలి!

ఇదీ చదవండి:తండ్రి స్ఫూర్తితో.. 22మంది పేద బాలికలకు జీవితం

Last Updated : Nov 26, 2020, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details