మానవులు అభివృద్ధి పేరిట జీవావరణ వ్యవస్థలో భాగమైన ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్నారు. ఫలితంగా విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. సంక్షోభం ఉరుముతున్న తరుణంలో పారిశ్రామిక, అభివృద్ధి మౌలిక వసతుల ప్రాజెక్టుల స్థాపనలో పర్యావరణ అనుమతుల మంజూరు ప్రక్రియను మరింత పటిష్ఠపరచడం తక్షణావసరం. కానీ, కేంద్రం ఇటీవల ప్రకటించిన పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) నోటిఫికేషన్ ముసాయిదాలోని పలు ప్రతిపాదనలు లోపభూయిష్ఠంగా ఉన్నాయి. ముందస్తు పర్యావరణ అనుమతులు పొందకుండానే పరిశ్రమలు, ప్రాజెక్టులు స్థాపించడానికి వీలు కల్పించేలా ఉండటం చర్చనీయాంశంగా మారింది. పారిశ్రామిక సంస్థలు, ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరును వేగిరపరచేందుకు ఉద్దేశించిన అత్యంత పారదర్శక ప్రక్రియగా కేంద్రం దీన్ని ప్రకటించింది.
ముందస్తుగా పర్యావరణ అనుమతులు పొందకుండా కార్యకలాపాలు నిర్వహించుకునే వీలు కల్పించే ప్రతిపాదనలు ముసాయిదాలో ఉండటం ప్రమాదకర పరిణామం. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు, పరిశ్రమలు అధికారిక పర్యావరణ అనుమతులు పొందకుండానే యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2020 మే 7న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగిన ఎల్‌జీ పాలిమర్స్ ఉదంతమే దీనికి ఉదాహరణ. స్టెరైన్ వాయువు లీకైన ప్రమాద ఘటనపై విచారణలో వెలుగుచూసిన కఠోర వాస్తవాలు నివ్వెరపరచేలా విధ్వంసానికా అనుమతులు?ఉన్నాయి. 20 ఏళ్లుగా ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ పర్యావరణ అనుమతి లేకుండానే ప్లాంటును నిర్వహిస్తుండటం దారుణం. మే 27న తూర్పు అసోమ్‌లోని టిన్‌సూకియా జిల్లాలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఖనిజ క్షేత్రంలో సహజవాయువు బ్లో-అవుట్ వల్ల మంటలు చెలరేగి, జీవవైవిధ్యానికి ప్రసిద్ధిగాంచిన ఆ ప్రాంత జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లింది.
అదే ప్రతికూలం..
ప్రభుత్వ రంగ సంస్థ అయినా 15 ఏళ్లకు పైబడి పర్యావరణ అనుమతులు లేకుండా సహజవాయు నిక్షేపాలను ఆ సంస్థ వెలికితీస్తున్నట్లు వెల్లడైంది. పర్యావరణ ప్రభావ మదింపు అనేది పర్యావరణ సంరక్షణ చట్టం(1986) ప్రకారం నిర్వహించే ప్రక్రియ. పలు పారిశ్రామిక సంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకున్నదే తడవుగా అనుమతులు మంజూరుచేయడాన్ని నిరోధించేందుకు ఉద్దేశించిన ఏర్పాటు ఇది. ఎప్పటికప్పుడు నిబంధనలు సవరిస్తూ, ఒక్కో రకమైన ప్రాజెక్టును పర్యావరణ మదింపు ప్రక్రియ దశ నుంచి మినహాయిస్తుండటం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పర్యావరణ ప్రభావ మదింపులో ప్రభుత్వానికి విచక్షణాయుత అధికారాలు, పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని పరిమితం చేయడం ముసాయిదాలో ప్రధాన ప్రతిపాదన. సాధారణంగా జాతీయ భద్రత, రక్షణకు సంబంధించిన ప్రాజెక్టులను ‘వ్యూహాత్మక’ విభాగం కింద పరిగణిస్తారు.