అభివృద్ధి పేరిట మానవాళి సాగిస్తున్న విధ్వంసం ప్రకృతి వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. సున్నితమైన అటవీ, భూగర్భ, తీర వనరుల విధ్వంసంవల్ల వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. తుపానులు, వరదలు, సునామీలు, భూకంపాల వంటి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. వీటికి సమాంతరంగా మానవాళి తన అవసరాల కోసం ఆహార ఉత్పత్తులు, వినియోగంలో అనుసరిస్తున్న విధానాలు- వన్యప్రాణులు, పశు సంపదపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో పుట్టుకొస్తున్న అంతుపట్టని కొత్త రకాల సాంక్రామిక వ్యాధుల కారణంగా మానవాళికి భవిష్యత్తులో మరింత ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.
పొంచిఉన్న కొత్త సవాళ్లు
కొన్ని దశాబ్దాలుగా విస్తృతంగా పుట్టుకొస్తున్న సాంక్రామిక వ్యాధులు ప్రపంచదేశాలను తీవ్రంగా వణికిస్తున్నాయి. భవిష్యత్తులో సాంక్రామిక వ్యాధులు పెచ్చరిల్లడాన్ని నిరోధించాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ), అంతర్జాతీయ పశు పరిశోధన సంస్థ (ఐఎల్‌ఆర్‌ఐ) సంయుక్తంగా గత వారం విడుదల చేసిన అధ్యయన నివేదిక అనేక సవాళ్లను ప్రపంచం ముందు ఆవిష్కరించింది. మానవ జనాభాకు సోకుతున్న అంటువ్యాధుల్లో వాటి కారకాలను గుర్తించిన వ్యాధులు 60 శాతమే. వాటిలో 75 శాతం అంటువ్యాధులు పశుపక్ష్యాదులు, వన్యప్రాణుల ద్వారా ప్రజలకు సోకుతున్న సాంక్రామిక వ్యాధులుగా గుర్తించారంటే ఈ తరహా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్ఛు ప్రపంచ దేశాలను వణికిస్తూ మానవ జనాభాపై అధిక నష్ట ప్రభావం చూపిన హెచ్‌ఐవీ-ఎయిడ్స్, ఎబోలా, లైమ్ డిసీజ్, మలేరియా, రాబిస్, వెస్ట్ నైలు జ్వరంతో సహా ప్రస్తుత కొవిడ్ వరకూ ఇలాంటి సాంక్రామిక వ్యాధులే కావడం గమనార్హం. సాంక్రామిక వ్యాధులు జంతువులవల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్ష సంబంధాల ద్వారా బ్యాక్టీరియా, వైరల్ లేదా పరాన్నజీవుల వంటివాటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వైద్య, ఆరోగ్య రంగంలో విస్తృతమైన విజ్ఞానం, సాంకేతిక సదుపాయాలు పెరిగిన నేటి కాలంలో అంటువ్యాధి వ్యాప్తి నియంత్రణ, వ్యాక్సిన్ కనుగొనడం వంటి విషయాల్లో ప్రపంచదేశాల ముందు కొవిడ్ ఒక పెద్ద సవాలుగా నిలిచింది. నిరుడు నవంబరులో చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 6.30 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1.54 కోట్లకు పైగా ప్రజలు వైరస్ బారినపడ్డారు. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమై కోట్ల మంది జీవనోపాధి కోల్పోయారు. ప్రపంచ ప్రజల ఆహార, జీవన భద్రత ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో సాంక్రామిక వ్యాధుల వ్యాప్తికిగల ప్రధాన కారణాలు, భవిష్యత్తులో వాటి స్వరూప స్వభావాల వల్ల ఏర్పడే సవాళ్లను ఐరాస తాజా నివేదిక చర్చకు పెట్టింది. ప్రకృతి పరంగా కొనసాగుతున్న విధ్వంసంతో పాటు పశు, వన్యప్రాణుల పట్ల మానవాళి వ్యవహరిస్తున్న తీరు సాంక్రామిక వ్యాధులను చేజేతులా కొనితెచ్చుకోవడానికి కారణమవుతోంది. ప్రకృతి వనరుల విధ్వంసంతో అడవులు క్షీణించడం మూలంగా జంతువులు, వన్యప్రాణులకు ఆహార కొరత ఏర్పడే దుస్థితి నెలకొంది. మానవ అవసరాల కోసం వ్యవసాయం విస్తృతమై ఎరువులు, క్రిమి సంహారకాల వినియోగం మితిమీరింది. ఇది జంతు సంపదపై దుష్ప్రభావం చూపుతోంది. మానవాళి ప్రొటీన్ల కోసం ఆహార వనరుల్లో ముఖ్యంగా జంతు సంపదపై ఆధారపడటం అధికమైంది. దీంతో పశుపక్ష్యాదులు ఆధారంగా లభ్యమయ్యే మాంసం, పాల ఉత్పత్తుల వినియోగం విపరీతంగా పెరిగింది. 1961లో ప్రపంచవ్యాప్తంగా మాంసం ఉత్పత్తి ఏటా రెండు కోట్ల టన్నులు. ఇప్పుడది ఎనిమిది కోట్ల టన్నులకు చేరింది. గిరాకీకి తగ్గట్లుగా అధిక ఉత్పాదకత, వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉన్న జంతు జాతుల పెంపకం వల్ల అనేక దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. తక్కువ స్థలంలో ఎక్కువ పశు పక్షు జాతుల పెంపకం, వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరగడంలేదు. వ్యాధినిరోధక మందుల అతి వినియోగం కారణంగానూ కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు కొత్త వ్యాధుల నియంత్రణకు ఔషధాలు కనుగొనడం కష్టతరంగా మారుతోంది. ఒకవైపు సాధారణ వ్యవసాయ అవసరాల కోసం, మరోవైపు పామాయిల్, సోయా పంటల కోసం అడవులను విపరీతంగా నరికివేస్తున్నారు. సోయా ఉత్పత్తులను అధికంగా పశువులకు ఆహారంగా వాడుతున్నారు.