తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2021, 7:19 AM IST

ETV Bharat / opinion

శరణార్థులకు కొరవడిన రక్షణ

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు.. నిరాశ్రయులై, ఏ దేశ పౌరసత్వం, గుర్తింపునకూ నోచుకోవడం లేదు. నివాసం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, ఆహారం కొరతతో అనునిత్యం సంఘర్షణకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో.. శరణార్థులకు ఆపన్న హస్తం అందించడంలో అందరూ భాగస్వాములు కావాలి. అంతర్జాతీయంగా సమగ్ర అవగాహనతో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు, పౌర సమాజం కృషి చేయాలి.

refugees
శరణార్థులు

ప్రపంచంలో అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, జాతుల మధ్య ఘర్షణలు, హింస, సైనిక పోరాటాలతో ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారు. అలాంటి అభాగ్యులు ఆశ్రయం కోసం సొంత దేశాన్ని విడిచి పరాయి దేశంలో 'శరణార్థులు'గా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరాశ్రయులై, ఏ దేశ పౌరసత్వం, గుర్తింపునకూ నోచుకోవడం లేదు. నివాసం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, ఆహారం కొరతతో అనునిత్యం సంఘర్షణకు గురవుతున్నారు. వివిధ దేశాల్లో ఇలా శరణార్థులైన వారి సంరక్షణ, భద్రత కోసం ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) సంస్థ 1950 డిసెంబర్‌ 14న ఏర్పాటైంది. 1967లో రూపొందించిన ప్రొటోకాల్‌ ప్రకారం, శరణార్థులకు ఎలాంటి భౌగోళిక పరిమితులు ఉండవని, ఏ దేశం నుంచి మరే దేశానికి వచ్చినా ఆశ్రయం ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ఈ ప్రొటోకాల్‌పై 146 దేశాలు సంతకం చేయగా, భారత్‌ చేయలేదు. 2001 నుంచి జూన్‌ 20వ తేదీని ఐరాస 'ప్రపంచ శరణార్థుల దినం'గా నిర్వహిస్తోంది. 'సంఘటితంగా ఊరడిల్లుదాం, నేర్చుకుందాం, ప్రకాశిద్దాం' అనే నినాదంతో ఈ ఏడాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కట్టుదిట్టమైన విధానాలు

మొదట్లో యుద్ధాలు, సైనిక ఘర్షణల నిర్వాసితులనే శరణార్థులుగా వ్యవహరించేవారు. నేడు ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, మతకలహాలు, ఆహారం కొరత, ప్రతికూల వాతావరణం తదితర కారణాలతో నిర్వాసితులైనవారు, వలసదారులు శరణార్థులుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 24 మంది తమ దేశాన్ని వీడి, వివిధ కారణాలతో ఇతర దేశాలకు తరలి పోవాల్సిన పరిస్థితి ఉంది. శరణార్థుల సమస్య ప్రపంచంలోని చాలా దేశాలకు సవాలుగా మారింది. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ప్రపంచ దేశాల్లోని శరణార్థుల్లో ప్రధానభాగం సిరియా, అఫ్గానిస్థాన్‌, దక్షిణ సూడాన్‌, పాలస్తీనా, ఇరాక్‌, ఉగాండా, సోమాలియా, మయన్మార్‌లలోనే ఉన్నారు. ఇప్పటికీ సిరియాను 'శరణార్థుల ఉత్పత్తి దేశం'గా పిలుస్తారు. ఇటీవల సామాజిక, ఆర్థిక సంక్షోభం కారణంగా సిరియా, అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, సోమాలియా దేశాల్లో శరణార్థుల సంఖ్య గతం కంటే సుమారు ఎనిమిది శాతం పెరిగింది.

ఆధునిక ప్రపంచంలో ప్రపంచీకరణ కారణంగా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, విదేశాంగ దౌత్య సంబంధాలు, భూభాగ సరిహద్దుల అంశాల్లో కట్టుదిట్టమైన విధానాలను అవలంబిస్తున్నారు. కొన్ని దేశాల్లో సరిహద్దు భూభాగంలో ఇనుప కంచెల ఏర్పాటు, గట్టి భద్రత, పౌరసత్వ గుర్తింపు తనిఖీ, నియంత్రణ కోసం గస్తీ బలగాలను పెద్దయెత్తున మోహరిస్తున్నారు. ప్రధాన రహదారులనూ మూసివేస్తూ, శరణార్థులు చొరబడకుండా జాగ్రత్త పడుతున్నారు. మూడో ప్రపంచ దేశాల నుంచి ఐరోపా, అమెరికాలకు వలసలు అధికమయ్యాయి. మెక్సికో, వియత్నాం, క్యూబా, సిరియా వంటి దేశాల శరణార్థులపై అమెరికా ఇటీవల అనేక ఆంక్షలు విధించింది. ఇటీవల ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య జరిగిన పోరులో అనేకమంది నిరాశ్రయులై గాజా నుంచి శరణార్థులుగా వేరే దేశాలకు తరలి వెళ్లారు. ఐరాస చొరవతో ప్రపంచంలోని అన్ని దేశాలతో చర్చలు జరిపి, ఆయా దేశాల నుంచి శరణార్థులుగా వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించే యత్నాలు జరుగుతున్నాయి. బాధితులకు ప్రాణరక్షణ, పునరావాసం, విద్య వైద్యం, ఆహారం, మందులు, ఉద్యోగ, ఉపాధి వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించి, జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సమష్టి బాధ్యత

భారత్‌కు విజ్ఞాన, విదేశీ యాత్రలు, వ్యాపారం పేరిట పర్షియన్‌, అరబ్‌, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌ వంటి వివిధ దేశాల నుంచి వలస వచ్చి మనల్ని పాలించారు. 1947లో స్వాతంత్య్రం తరవాత దేశ విభజనలో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. 1959 నుంచి టిబెట్‌ బౌద్ధులు, పార్సీలు, 1963 నుంచి అఫ్గాన్‌, శ్రీలంక, 1971 నుంచి బంగ్లాదేశ్‌, 1980 నుంచి మయన్మార్‌ల నుంచి వలసల తాకిడి ఎక్కువైంది. మయన్మార్లో 2012లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి రోహింగ్యాల వలసలు మొదలయ్యాయి. భారత్‌లో ఇప్పటికే 40 వేల మంది వరకు రోహింగ్యాలు కశ్మీర్‌, హైదరాబాద్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో శరణార్థులుగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ అక్రమ వలసదారుల కారణంగా పశ్చిమ్‌బంగ, అసోమ్‌ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. శరణార్థులకు ఆపన్న హస్తం అందించడంలో అందరూ భాగస్వాములు కావడంతో పాటు, అంతర్జాతీయంగా సమగ్ర అవగాహనతో సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు కృషి చేయాలి. తమ దేశాల నుంచి శరణార్థులుగా వెళ్లినవారిని వెనక్కి తెచ్చుకోవాలి. వారికి పునరావాసం కల్పించి, విద్య వైద్యం ఉపాధి, ఉద్యోగ భద్రత ప్రాణ రక్షణ కల్పించాలి. ఈ తరహా ప్రక్రియతో ప్రపంచశాంతిని కాపాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉంది. ప్రపంచ దేశాలు, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు శరణార్థుల మానవ హక్కులను కాపాడుతూ వారు జనజీవన స్రవంతిలో కలిసి జీవించేలా తోడ్పడాలి.

- డాక్టర్‌ రావుల కృష్ణ

(రచయిత-హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యావిభాగంలో సహ ఆచార్యులు)

ABOUT THE AUTHOR

...view details