మానవజాతికి ప్రకృతి ప్రసాదించిన అరుదైన, అత్యంత విలువైన సంపద- మడ అడవులు. నదీజలాలు సముద్రంలో సంగమించేచోట చిత్తడి నేలల్లో ఈ మడ అడవులు పెరుగుతాయి. లక్షా యాభైవేల చదరపు కిలోమీటర్ల మేర 123 దేశాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. దక్షిణాసియాలో ఉన్నవాటిలో 45.8 శాతం భారత్‌లోనే ఉన్నాయి. మనదేశంలో గంగా, యమున, మహానది, కృష్ణా, గోదావరి, కావేరి నదీ పరీవాహక ప్రాంతాల్లో, అండమాన్ నికోబర్ దీవుల్లోనూ విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 404 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మడ అడవుల్లో అతిపెద్దది కాకినాడ సమీపంలోని కోరంగి మడ అడవుల ప్రాంతం.
పశ్చిమ్ బంగలోని సుందర్‌బన్, ఒడిశాలోని బితర్‌కానిక తరవాత కోరంగి మడ అడవులు విస్తీర్ణంలో మూడోస్థానం ఆక్రమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మడ అడవులు, తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తక్కువగా విస్తరించి ఉన్నాయి.
మానవాళికి పెన్నిధి
మడ అడవులు కోస్తా తీరప్రాంత సమాజాలకు పలు రకాలుగా ఉపయోగపడటమే కాకుండా పర్యావరణ సమతౌల్యం కాపాడటంలోనూ తోడ్పడుతున్నాయి. అనేకచోట్ల మత్స్యకారుల జీవనాధారం మడఅడవులే. కలప, పశుగ్రాసం, వంటచెరకు, తేనె, పడవల తయారీకి ఉపయోగించే కలప మడ అడవుల నుంచి లభిస్తాయి. ఇవి తీరప్రాంతాలను తుపానులు, సునామీలు, హరికేన్‌లనుంచి కాపాడుతుంటాయి. సముద్ర అలలనుంచి తీరప్రాంతాలు కోతకు గురికాకుండా అడ్డుకుంటాయి. ఉదాహరణకు 2004 చివరిలో వచ్చిన సునామీ వల్ల దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో 2.30 లక్షలమంది ప్రాణాలు కోల్పోగా- అనేక తీరప్రాంత గ్రామాలు, పట్టణాలు నామరూపాలు లేకుండా పోయాయి. మడ అడవులు ఉన్న ప్రాంతాలు వినాశనం నుంచి తప్పించుకున్నాయి.
దాదాపు 120 రకాల వలస పక్షులకు ఇవి తాత్కాలిక విడిది ప్రాంతాలు. విలువైన రొయ్యలు, చేపలు, పీతలు, చేపలకు 'నర్సరీ గ్రౌండ్స్'గా ఉపయోగపడతాయి. ఈ ప్రాంత జలాలు సముద్రపు నాచు, శిలీంధ్ర సమూహాలతోపాటు అత్యధిక పోషక పదార్థాలు కలిగి ఉన్నందువల్ల, ఇవి అనేక రకాల సముద్ర జీవుల ఆహార కేంద్రాలుగా ఉంటాయి. అనేక రకాల క్షీరదాలు, సరీసృపాలు, ఉభయచరాలు, పక్షులకు మడ అడవులు ఆవాసాలు. 87 రకాల చేపలకు, మొసళ్ళు, సముద్ర తాబేళ్ళు, రాయల్ బెంగాల్ పులులకు సుందర్‌బన్ సంరక్షక కేంద్రాలు. నదీజలాలు, తీరప్రాంత జలాలనుంచి వచ్చే కాలుష్య కారకాలను శుద్ధిచేసే 'బయోలాజికల్ ఫిల్టర్స్'గా నిలుస్తాయి.
ఆరోగ్యవంతమైన వాతావరణం..
పెద్దయెత్తున కార్బన్‌ను పీల్చుకుని ఆరోగ్యవంతమైన వాతావరణం అందిస్తున్నాయి మడ అడవులు. వైద్యపరంగానూ వీటి పాత్ర ఎనలేనిది. మలేరియా, అతిసారం, అల్సర్, చర్మవ్యాధులు, ఆస్తమా, చక్కెర వ్యాధి, మూర్చ వ్యాధి, నొప్పులు, కామెర్ల వంటి వ్యాధుల నివారణకు, పాము కాటుకు మడచెట్ల ఆకులు, వేళ్లు, బెరడును ఉపయోగిస్తారు. అనేక ప్రాంతాల్లో మడ అడవులను పర్యాటక ఆహ్లాదకర కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు. ఇటీవలికాలంలో మడ అడవుల పరిసర ప్రాంతాలను ధాన్యం, రబ్బరు సాగు కేంద్రాలుగా, చేపలు, రొయ్యల ఉత్పత్తికి ఉపయోగిస్తూ విశేష లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక హెక్టారు మడ అడవులనుంచి 9,990 డాలర్ల వార్షిక ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇది థాయ్‌లాండ్ వంటిదేశాల్లో 37,921 డాలర్లుగా ఉంది.
పట్టణీకరణ పేరుతో..
పరిమితికి మించి వినియోగించుకోవడం వల్ల మడ అడవులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పట్టణీకరణ, పారిశ్రామీకరణ వంటి కార్యకలాపాలవల్ల విధ్వంసానికి గురవుతున్నాయి. రొయ్యల పెంపకం, పామాయిల్ సాగు, కలప కోసం వీటిని విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030నాటికి 60 శాతం మడ అడవులు కనుమరుగవుతాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. మొదట్లో మడ అడవులను నిరర్థక భూములుగా, డపింగ్‌యార్డులుగా పరిగణించేవారు. శాస్త్రీయంగా ప్రపంచంలోనే తొలిసారిగా వీటి పరిరక్షణ కార్యక్రమాన్ని 1892 సుందర్‌బన్‌లో అమలుచేశారు.
అందరి బాధ్యత
మడ అడవుల సమగ్రాభివృద్ధికి స్థానిక ప్రజల సహకారంతో యునెస్కో కూడా పలు కార్యక్రమాలు చేపట్టింది. ప్రపంచంలోని పలు మడ అడవులను బయోస్ఫియర్‌గా, ప్రపంచ వారసత్వ సంపదగా, గ్లోబల్ జియోపార్క్‌లుగా ప్రకటించి అభివృద్ధి చేస్తుంది. 2001లో పశ్చిమ్ బంగలోని సుందర్‌బన్ మడ అడవులను 'బయోస్ఫియర్ రిజర్వ్'గా ప్రకటించిన యునెస్కో, అనంతరం దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. పశ్చిమ్ బంగ, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలు స్థానిక ప్రజల సహకారంతో మడ అడవుల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టాయి.
శాస్త్రీయంగా వినియోగించుకుంటే ఫలితం..
మడ అడవులను శాస్త్రీయంగా వినియోగించుకుని అద్భుత ఫలితాలు సాధించవచ్చని థాయ్‌లాండ్, ఇండోనేసియాలు నిరూపిస్తున్నాయి. నానాటికి తరిగిపోతున్న ఈ హరిత సంపదను సంరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోనట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. సమాజపరంగానే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న ఈ విలువైన ప్రకృతి సంపదను పరిరక్షించి భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలతోపాటు ప్రజలపైనా ఉంది!
- డాక్టర్ ఎన్.వి.ప్రసాద్ (రచయిత- డర్బన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్)