వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు అప్పుడే సమాయత్తం అవుతున్నట్లు ప్రస్తుత రాజకీయ వాతావరణం సూచిస్తోంది. పశ్చిమ్‌బంగ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్త రాజకీయాల్లో గణనీయ మార్పును తీసుకొచ్చాయి. కాంగ్రెస్‌తోపాటు, దాని నాయకత్వం శతాధిక వర్ష వయోభార ప్రభావానికి లోనవడంతో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను నడిపించే నేత కోసం వెతుకులాట ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో విపక్షంలోని నాయకత్వ శూన్యతను ఆసరాగా చేసుకొని దిల్లీ పీఠాన్ని అధిరోహించాలన్న కలను నెరవేర్చుకోవడానికి బంగాల్ సీఎం మమతాబెనర్జీ పావులు కదుపుతున్నారు. మోదీకి వ్యతిరేకంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఆమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టడమే ఇందుకు ఉదాహరణ. అందివచ్చే ఏ అవకాశాన్నీ చేజార్చుకోకూడదని మమత వ్యూహాత్మక అడుగులు మొదలుపెట్టారు. అందులో భాగంగా తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటులో కూర్చోబెట్టడం ద్వారా తాను రాష్ట్ర రాజకీయాలు వీడితే తన వారసుడు అతనే అనే సంకేతాలు ఇచ్చారు.
ఇదే అదను..
'టీఎంసీని జాతీయ పార్టీగా మలిచేందుకు చేసే ప్రయత్నాలు ఈసారి భిన్నంగా ఉంటాయి. కేవలం ఒకటి రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికో, ఓట్ల వాటా పెంచుకోవడానికో పరిమితం కాబోము. భాజపా మీద యుద్ధం చేసి, ఎన్నికలు గెలవడమే మా లక్ష్యం' అన్న అభిషేక్ వ్యాఖ్యలు మమత అంతరంగాన్ని చాటుతున్నాయి. 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించి నాయకత్వ పటిమను చాటుకున్న మమత... 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించి ప్రత్యర్థులను సమర్థంగా నిలువరించారు. ప్రతిసారీ హోరాహోరీ పోరులో గెలుస్తూ మరింత రాటుతేలుతున్నారు. మోదీ ధాటికి బలహీనపడిన విపక్ష శిబిరానికి ఇప్పుడు మమత తరహా దూకుడు అవసరం ఉంది. 66 ఏళ్ల మమతాబెనర్జీ ప్రస్తుత అవకాశాన్ని అందుకోలేకపోతే 2026 వరకు ముఖ్యమంత్రిగానే ఉండిపోతారు. అప్పటికి ఆమె వయస్సు 70 ఏళ్లు దాటుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ రాజకీయాలకు రాలేకపోతే 2029 వరకు వేచిచూడాల్సి వస్తుంది. అప్పటికి దాదాపు 75 ఏళ్లు నిండిపోతాయి. అప్పటికి ఇతర యువ నేతలు జాతీయ స్థాయికి ఎదిగితే మమతకు అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు.
ఇదీ చదవండి:బంగాల్లో అసలు ఆట ఇప్పుడే మొదలైందా?
ఇదీ చదవండి:పోరాటాలే మమత విజయానికి బాటలు
మమతకే ఛాన్సులు అధికం..!
విపక్ష నేతల్లో మమతతోపాటు, మాయావతి, శరద్‌పవార్, నీతీశ్‌కుమార్, నవీన్ పట్నాయక్, కేసీఆర్ వంటి నేతలూ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఇదివరకు జాతీయ రాజకీయాలకు ప్రత్యామ్నాయ నేతగా కనిపించిన బీఎస్పీ అగ్రనేత మాయావతి వ్యక్తిగత సమస్యలతో ఇటీవలి కాలంలో మౌనముద్ర దాల్చారు. శరద్ పవార్‌కు వయోభారం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. నీతీశ్‌కుమార్‌కు రాజకీయ అనుభవం ఉన్నా, ప్రస్తుతం ఎన్డీయేలో కొనసాగుతున్నారు. ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌కు ఇప్పటికే 75 ఏళ్లు పైబడటానికి తోడు, ఆయన ఏనాడూ జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనబరచలేదు. లాలూప్రసాద్, ములాయంసింగ్‌లు వారసులైన అఖిలేష్, తేజస్వీయాదవ్‌ల భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది నేతల్లో కేసీఆర్ తప్ప మిగిలిన వారెవ్వరూ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టిసారించే పరిస్థితి లేదు. వయోభారం దృష్ట్యా సోనియాగాంధీ క్రియాశీలకంగా కాంగ్రెస్‌ను నడిపించలేక పోతుండగా, రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టడంపై ఊగిసలాడుతుండటంతో, ఆయన నాయకత్వంపై ప్రతిపక్షాలకూ నమ్మకం కుదిరేలా కనిపించడం లేదు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో అరవింద్ కేజ్రీవాల్ ఆశలు చిగురింపజేసినా, ఆమ్‌ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ముందడుగు వేయలేకపోవడంతో ఆయన ప్రాభవం అక్కడికే పరిమితమైంది.