అయిదేళ్ల క్రితం ప్రధాని మోదీ భారత్‌లో తయారీ (మేకిన్ ఇండియా) విధానాన్ని ప్రకటించినప్పుడు, అదొక సమున్నత లక్ష్యం. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ (స్వావలంబన భారతావని) కోసం ఇటీవల ఇచ్చిన పిలుపు- సాకారం కావాల్సిన సురుచిర స్వప్నం. కుంగిన వృద్ధిరేట్లకు కొత్త చురుకు పుట్టించి స్వావలంబన దిశగా దేశాన్ని నడిపించేందుకు ఉత్పాదక వస్తువులు- యంత్రాలు, మొబైల్- ఎలెక్ట్రానిక్స్, జెమ్స్-జ్యుయలరీ, ఔషధాలు, జౌళి- వస్త్ర పరిశ్రమ వంటి పది కీలక రంగాల్ని కేంద్రం ఇప్పటికే గుర్తించింది. ఏసీలు, ఫర్నిచర్, పాదరక్షల దేశీయ తయారీని ప్రోత్సహించేలా లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనల్ని చురుగ్గా పరిశీలిస్తున్న కేంద్ర సర్కారు- ఎలెక్ట్రానిక్స్ రంగంలో చైనా ఆధిపత్యానికి 'చెక్'పెట్టేలా విస్తృత ప్రోత్సాహకాలతో ముందుకొచ్చింది. ఎలెక్ట్రానిక్ విడిభాగాలు, సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహం, మోడిఫైడ్ ఎలెక్ట్రానిక్స్ తయారీ సముదాయాలు, భారీయెత్తున తయారీకి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల నిమిత్తం రూ.50వేల కోట్ల పథకాన్ని పట్టాలకెక్కించింది. దీంతో అంతర్జాతీయ దిగ్గజ మొబైల్ సంస్థలకు ఇండియా కార్యక్షేత్రమవుతుందని, వచ్చే అయిదేళ్లలో ఎనిమిది లక్షల కోట్ల విలువైన మొబైల్స్ ఉత్పత్తికి రూ.5.89 లక్షల కోట్ల ఎగుమతులకు బాటలు పడతాయని, 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం ఆశిస్తోంది. 2012 నాటి జాతీయ ఎలెక్ట్రానిక్ విధానం వేసిన పునాదులపై దేశీయంగా మొబైల్స్ తయారీ పరిశ్రమ గొప్పగా ఎదిగి 2019 చివరికి రూ.2,14,000 కోట్ల విలువైన 33 కోట్ల చరవాణుల ఉత్పత్తి; రూ.26వేల కోట్ల విలువైన ఎగుమతులు సాధించింది. రూ.13 లక్షల కోట్ల విలువైన నూరుకోట్ల మొబైల్స్ తయారీ, ఏడు లక్షల కోట్ల విలువైన ఎగుమతులే లక్ష్యంగా నిరుడు సరికొత్త జాతీయ ఎలెక్ట్రానిక్స్ విధానం వెలుగు చూసింది. రక్షణ వంటి వ్యూహాత్మక రంగాల్లోనూ స్వావలంబనకు ఎలెక్ట్రానిక్స్ రంగం చోదకశక్తి కావాలి!
సాంకేతిక పరిజ్ఞానమే దన్నుగా