ముప్పును తగ్గించే వ్యూహాలు, ఫైర్‌వాల్స్ నిర్మాణం, రికవరీ వ్యవస్థ నెలకొల్పడం వంటి చర్యల ద్వారా చైనా సైబర్ దాడుల్ని ఎదుర్కోనున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తాజాగా ప్రకటించారు. సైబర్ దాడుల విషయంలో మనదేశమూ దూకుడుగా ముందుకెళ్లే అంశంపై కసరత్తు జరుగుతోందని, ఈ తరహా యుద్ధరంగంలో మనం చైనాకన్నా వెనకంజలో ఉన్నట్లు ఆయన ఉన్నమాట చెప్పారు. భారత్‌పై సైబర్ దాడులు జరిపే సామర్థ్యం చైనాకు ఉందన్న సంగతి తెలిసిందేనని, వాటిద్వారా అది మన వ్యవస్థలకు పెద్ద సంఖ్యలో అవాంతరాలు సృష్టించగల ముప్పు ఉందని అన్నారు. ఈ క్రమంలో భారత సైబర్ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం త్రివిధ దళాల సైబర్ భద్రత ఏజెన్సీని ఏర్పాటు చేశామని, ప్రతి విభాగానికీ వేర్వేరు సంస్థలు ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.
దేశాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్నప్పుడు, గొలుసుకట్టులా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో కొన్ని బాహ్య ప్రపంచానికి వెంటనే తెలుస్తాయి. మరికొన్ని ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. గత ఏడాది చైనా, భారత్‌ల మధ్య సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దరిమిలా- భారత మౌలిక సదుపాయాల వ్యవస్థలపై 'డ్రాగన్' నిశ్శబ్దంగా వరస దాడులకు తెగబడింది. ఇటీవల ఆ దాడుల వివరాలు ఒకదాని తరవాత మరొకటి బయటపడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సైబర్ దాడుల వెనక ఓ పదునైన వ్యూహం ఉంటుంది. రేపెప్పుడైనా రుజువైతే అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబడాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏ దేశమూ స్వయంగా వీటిని నిర్వహించదు. అందుకే చైనా సైబర్ దాడులు- 'రెడ్ ఎకో', ఏపీటీ41/బారియం', టోంటో టీమ్', 'స్టోన్ పాండా', 'ఎమిస్సరీ పాండా' వంటి హ్యాకింగ్ సమూహాల నుంచి జరుగుతాయి. ఆయా సమూహాలకు చైనా ప్రభుత్వ అండదండలు పుష్కలమనడంలో సందేహం లేదు.
మౌలిక సదుపాయాలపై గురి
విద్యుత్, రవాణా వంటి మౌలిక సదుపాయాలు ఏ దేశానికైనా వెన్నెముక లాంటివి. వాటిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఉత్పత్తి అయిన విద్యుత్తును అవసరానికి తగినట్లు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా పంపిణీ చెయ్యడంలో లోడ్ డిస్పాచ్ సెంటర్లు కీలకపాత్ర పోషిస్తాయి. దీన్ని గుర్తించిన 'రెడ్ ఎకో' అనే చైనా హ్యాకింగ్ గ్రూప్, 'షాడోప్యాడ్' అనే దొడ్డిదారిన సర్వర్‌లోకి చొరబడే వెసులుబాటు కలిగిన మాల్వేర్‌ను గత ఏడాది భారత ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రాలలోకి ప్రవేశపెట్టింది. ఈ దాడి తమ దృష్టికి వచ్చి, తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, ఎలాంటి కీలక సమాచారమూ ప్రమాదంలో పడలేదని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయినా- దాడి జరిగిన తీరు మన సైబర్ భద్రతపై అనుమానాలు పెంచుతోంది. బ్యాంకింగ్, బీమా, వైద్య, విద్య, రవాణా, విద్యుత్ వంటి కీలక రంగాల్లో సేవలందిస్తున్న భారీ సంస్థలు సైతం ఇప్పటికీ సరైన భద్రతాపరమైన మదింపు నిర్వహించడం లేదన్నది సుస్పష్టం. దీనివల్ల తలెత్తబోయే ముప్పు తీవ్రస్థాయిలో ఉంటుంది. వివిధ సంస్థలు తమ కార్యకలాపాల కోసం తయారు చేయించుకొనే సాఫ్ట్‌వేర్లు, ఫైర్‌వాల్స్‌లో ఉండే లోపాలు హ్యాకర్ల పనిని మరింత సులభతరం చేస్తున్నాయి. ఒక సర్వర్ ఐపీ చిరునామా తెలిస్తే చాలు- చైనాలోనో, ఇంకో దేశంలోనో కూర్చునే హ్యాకర్ ఆ సర్వర్‌లో వాడిన వివిధ అంశాల గురించి తెలుసుకుని, వాటిలోని భద్రత లోపాలను ఆసరాగా చేసుకుని అరక్షణంలో ఏ సర్వర్‌లోకైనా అడుగు పెట్టగలుగుతారు. చైనాకు చెందిన 'రెడ్ ఎకో' హ్యాకింగ్ గ్రూప్ భారత విద్యుత్ రంగంతోపాటు ఓ భారత ఓడరేవు నెట్‌వర్క్‌లోకీ చొరబడినట్లు ఈ ఏడాది మార్చి మొదటి వారంలో బయటపడింది.
భారత వినియోగదారుల సమాచారాన్ని చైనా అప్లికేషన్లు తమ దేశానికి చేరవేస్తున్నాయన్న కారణంతో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దఫాల వారీగా పలు యాప్‌లను నిషేధించడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. అవన్నీ సమసిపోయేలోపే, చైనా ముప్పేట దాడి మొదలుపెట్టింది. భారత్‌కు చెందిన మొత్తం పదివేల మంది ప్రముఖ రాజకీయ నాయకులు, పాత్రికేయులు, న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, క్రీడాకారుల డిజిటల్ ఆనవాళ్లను చైనాలోని షెంజన్‌కి చెందిన జెన్హువా డేటా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అనే సంస్థ సేకరించడం ఆందోళనకు గురిచేస్తోంది. అటు హార్డ్‌వేర్ ఉత్పత్తుల్లో ఫర్మ్‌వేర్ రూపంలో గూఢచర్యాన్ని ప్రేరేపించడంతోపాటు- ఇటు యాప్స్, డేటా మైనింగ్ తదితర అన్ని రూపాల్లో భారత్‌ను చైనా ఇబ్బంది పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. యావత్ ప్రపంచం కరోనాతో సతమతం అవుతున్న వేళ- 2020 ద్వితీయార్ధంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ, వ్యాక్సిన్ తయారీ సంస్థలపై భారీగా సైబర్ దాడులకు ప్రయత్నాలు జరిగాయి. ఇవన్నీ చైనా, రష్యాల నుంచే నిర్వహించడం విస్మయం కలిగిస్తుంది. మన దేశం విషయానికొస్తే- దేశీయ అవసరాలకు టీకాలను అందుబాటులోకి తెచ్చిన భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌ల ఐ.టి. వ్యవస్థలపై చైనాకు చెందిన 'స్టోన్ పాండా' అనే హ్యాకింగ్ గ్రూప్ పలుమార్లు దాడి యత్నాలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాలశాఖతో పాటు ఐఆర్‌సీటీసీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్, టాటా మోటార్స్ వంటి రవాణా రంగానికి చెందిన సంస్థలపైనా చైనా హ్యాకర్లు కన్నేశారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) ఈ విషయాన్ని గుర్తించి, ఆయా సంస్థలను అప్రమత్తం చేసింది. ఫిషింగ్, ప్రమాదకరమైన డౌన్‌లోడ్ లింకులను సంబంధిత సంస్థల ఉద్యోగులకు పంపించడం, ఇతర మార్గాల ద్వారా ఆయా నెట్‌వర్క్‌లలోకి ప్రవేశించే ప్రయత్నాల్ని హ్యాకర్లు చేశారు.