కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రారంభించి నెలరోజులు దాటింది. దీని లక్ష్యం ఎవరి ఇళ్లలో వారు ఉండటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడం. అత్యవసరాలకు తప్ప దేనికీ బయటకు రాకూడదు. వచ్చినా నలుగురికి మించి ఒకచోట గుమికూడరాదు. ఇది అందరికీ వర్తిస్తుంది.
కానీ, వలస కార్మికుల విషయంలో ఇది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. చిన్న గదిలో పదుల సంఖ్యలో ఉండిపోయారు. ఒక్కో నిర్మాణ ప్రదేశంలో వందల సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వమో, ఎవరైనా దాతో సాయం చేయడానికి వస్తే ఆకలి నుంచి బయటపడటానికి ఎండను, పోలీసుల లాఠీ దెబ్బలను సైతం లెక్కచేయకుండా అధిక సంఖ్యలో గుమికూడుతున్నారు. ఇప్పటికీ ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఏ ఉద్దేశంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయో దాని ఉల్లంఘనకు కూడా ప్రభుత్వాలే కారణమయ్యాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం.
దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర జనాభా కంటే- ఇండియాలో వలస కార్మికుల సంఖ్య ఎక్కువ. ప్రపంచబ్యాంకు తాజా అధ్యయనం ప్రకారం పదికోట్ల మంది ఉన్నారు. వాస్తవానికి ఇంత కంటే ఎక్కువే. 2011 జనాభా లెక్కల ప్రకారమే 11.81 కోట్ల మంది ఉన్నారు. ఏటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. కొందరు అదే రాష్ట్రంలోనే ఇతర జిల్లాలకు వలస వెళ్తే, ఇంకొందరు ఇతర రాష్ట్రాలకు ఉపాధికోసం వెళ్లారు. ఇలా రాష్ట్రాలు దాటి వెళ్లినవారి సంఖ్య సుమారు అయిదు కోట్లకు పై మాటే.
రాష్ట్రం | వలసలు (లక్షల్లో) |
ఉత్తర్ప్రదేశ్ | 123.19 |
బిహార్ | 74.53 |
రాజస్థాన్ | 37.56 |
మహారాష్ట్ర | 30.68 |
మధ్యప్రదేశ్ | 29.79 |
బంగాల్ | 24.05 |
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ | 20.30 |
ఝార్ఖండ్ | 17.04 |
గుజరాత్ | 15.71 |
ఒడిశా | 12.71 |
ఇన్ని కోట్ల మందిని ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. ఎండననక, వాననక ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ, ఎవరు సాయం చేస్తారా అని ఎదురు చూస్తూ బతికే పరిస్థితి కల్పించాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొనే ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు.
వైరస్ వ్యాప్తికీ అవకాశం
అధిక సంఖ్యలో ఉన్న వలస కూలీలు కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశం లేకపోలేదని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల్లో ఉన్నా, తీర్థయాత్రలకు వెళ్లినా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించడానికి సహకరించిన కేంద్రం వలస కూలీలను మాత్రం ఎక్కడికక్కడ నిర్బంధించి ఉంచడానికి ప్రయత్నించింది.
చంకలో పిల్లలు, నెత్తిన మూటలతో కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో అల్లాడుతూనే వందల కిలోమీటర్లు నడిచి వెళ్లడానికి వలస కార్మికులు సిద్ధపడ్డారు. కొందరు అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఆకలితో అలమటించిన వారెందరో లెక్కలేదు. మళ్ళీ సాధారణ పరిస్థితి ఎప్పుడొస్తుందో తెలియదు. పేద వలస కూలీలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఆహార భద్రత, నివాసం, తాగునీరు,. ఆరోగ్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, సామాజిక భద్రత తదితర అంశాల గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వలస కార్మికులంతా దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందినవారు. కష్టపడి పనులు చేసి ఇంటికి పంపడం ద్వారా కుటుంబాలను పోషించుకొంటున్నారు.
లాక్‌డౌన్‌తో పనులు ఆగిపోవడం, రవాణా ఆగిపోయి నిబంధనల కారణంగా ఊళ్లకెళ్లడానికి అవకాశం లేకపోవడంతో పడరానిపాట్లు పడ్డారు. మొదటి లాక్‌డౌన్‌లో 21 రోజులు ఓపిక పట్టారు. మళ్ళీ పొడిగించడంతో షాక్‌కు గురై ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సొంతూళ్లకు వెళ్లలేకపోయినా, కడుపు నిండితే చాలనుకునే దుస్థితి దాపురించింది. నిర్మాణరంగం గణనీయంగా అభివృద్ధి చెందిన తరవాత ఈ కార్మికుల్లో యువత ఎక్కువ శాతం ఉంటున్నారు. నైపుణ్యం కలిగిన, నిర్మాణ పనులు చేసే కోట్లమంది వలస కూలీలే. రెండు దశాబ్దాల క్రితం వర్షంపై ఆధారపడి పంటలు సాగు చేసే ప్రాంతం నుంచి ఎక్కువగా వలసలు ఉండేవి.
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, కర్నూలు, తెలంగాణలో మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి వలస వెళ్లేవారు. ఇందులో ఎక్కువమంది ముంబయి, బెంగళూరు తదితర ప్రాంతాలకు కూలి పనులకోసం వెళ్లేవారు. 2002లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం అనంతపురం జిల్లా నుంచి వివిధ రాష్ట్రాల్లోని 150 ప్రాంతాలకు వలస వెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి క్యాబ్‌డ్రైవర్లు, ఇతర వృత్తులకోసం హైదరాబాద్ వచ్చారు.