తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహాత్ముడి ఆరోగ్య సందేశం- అందరికీ ఆచరణీయం - మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు

మహాత్ముడు ఆచరించి చూపిన ఆరోగ్య సూత్రాలు అందరికీ మార్గదర్శకాలు. బోధించడమే కాదు, తాను చెప్పిన ఆరోగ్య ధర్మాలను జీవితాంతం ఆచరించిన మహానుభావుడాయన. శరీరాన్ని నిలబెట్టడానికి, ఆకలిని సంతృప్తి పరచడానికి ఆహారాన్ని ఔషధంలో స్వీకరించాలన్నది గాంధీ మార్గం. అనేకానేక దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న ప్రపంచానికి ఈ మాటలే దివ్యౌషధం. ప్రస్తుత కాలంలో సర్వదా ఆచరణీయం- మహాత్ముడి ఆరోగ్య సందేశం! నేడు గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

Mahatma's health message- applicable to all
మహాత్ముడి ఆరోగ్య సందేశం- అందరికీ ఆచరణీయం

By

Published : Oct 2, 2020, 7:31 AM IST

'గాంధీవంటి ఓ వ్యక్తి ఈ ప్రపంచంలో నడయాడాడని చెబితే భవిష్యత్‌ తరాలు నమ్మవేమో...' అని ఐన్‌స్టీన్‌ అభిప్రాయపడ్డారు. అనేక అంశాలపై గాంధీ విస్తృత ఆలోచనా పరిధిని పరిశీలిస్తే ఈ వ్యాఖ్య అతిశయోక్తి కాదని స్పష్టమవుతుంది. వ్యాధులు ఖండాంతర వ్యాప్తి చెందుతున్న తరుణంలో మహాత్ముడు ఆచరించి చూపిన ఆరోగ్యసూత్రాలు అందరికీ మార్గదర్శకాలు. గాంధీజీ 'కీ టు హెల్త్‌' అనే పుస్తకాన్ని సైతం రాశారని చాలామందికి తెలియదు. బోధించడమే కాదు, తాను చెప్పిన ఆరోగ్య ధర్మాలను జీవితాంతం ఆచరించి చూపిన మహానుభావుడాయన! శరీరాన్ని నిలబెట్టడానికి, ఆకలిని సంతృప్తి పరచడానికి ఆహారాన్ని ఔషధంలా స్వీకరించాలన్నది గాంధీ మార్గం. అనేకానేక దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న ప్రపంచానికి ఈ మాటలే దివ్యౌషధం.

నిరంతర సత్యాన్వేషణ

ప్రకృతి వైద్యాన్ని స్వయంగా పరిశీలించి ప్రయోగాత్మకంగా ఆచరించేవారు. ఆకళింపు చేసుకునేవారు. శాస్త్రీయ దృక్పథంతోనే ఆ అధ్యయనం సాగేది. గాంధీ వ్యక్తిగత వైద్యుల్లో సుశీలా నయ్యర్‌ ఒకరు. సత్యాన్వేషణే సైన్స్‌ పరమావధి అయితే- గాంధీ ఓ నిత్య సత్యాన్వేషి, నిజమైన శాస్త్రవాది అన్నారామె! అహింసావాదిగా శస్త్రచికిత్సల అల్లోపతీ వైద్య విధానాన్ని గాంధీ కొంత విభేదించారే తప్ప, ఎన్నడూ పూర్తిగా వ్యతిరేకించలేదు. దక్షిణాఫ్రికాలో డిస్పెన్సరీలో రోజూ సేవ చేసేవారు. బోర్‌ యుద్ధసమయంలో ఆంబులెన్సు సేవల్ని పర్యవేక్షించారు. మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యానికి హేతువని గాంధీ గట్టిగా విశ్వసించారు. అతిగా భుజించి అజీర్తి పాలైతే- ఉపవాసమే ఉత్తమ మార్గం అన్నారు. సేవాగ్రామ్‌లో మలేరియా బారినపడ్డ ఆఫ్రికా మిత్రుణ్ని ‘క్వినైన్‌’ తీసుకొమ్మన్నారు. ఆ మందు తీసుకునే మలేరియా నుంచి తానూ విముక్తడయ్యారు. ప్రకృతి విరుద్ధ జీవనం వ్యాధులకు కారణమని, మళ్ళీ ప్రకృతే చేరదీసి స్వస్థత చేకూరుస్తుందని భావించే గాంధీ, ఆ విధానాలను 50 ఏళ్లు సాధన చేశారు. జొహాన్నెస్‌బర్గ్‌లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు సైకిల్‌పై తిరుగుతూ వ్యాధిగ్రస్తుల పట్టిక తయారుచేశారు. అపరిశుభ్రంగా ఉన్న గిడ్డంగులను స్వయంగా శుభ్రపరచి, బాధితులను వాటిలో ఉంచి స్నేహితులు, నర్సుల సాయంతో చికిత్స అందించారు. మృత్తికా వైద్యం చేయగా కొందరిలో మంచి ఫలితాలు రావడం గమనించారు. ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేసే సమయంలో గాంధీజీ ఇతరులకు దూరంగా స్వీయనిర్బంధంలో ఉండేవారు. తండోపతండాలుగా వచ్చే సేవాగ్రామ్‌ సందర్శకుల కోసం డాక్టర్‌ సుశీలా నయ్యర్‌ సహకారంతో అందులోనే డిస్పెన్సరీని ఏర్పాటు చేసుకున్నారు. వైద్యాన్ని లాభసాటి వ్యాపారంగా చూడటాన్ని ఆనాడే గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతర్జాతీయ స్థాయి మాత్రలకు బదులుగా మూలికా వైద్యానికి కట్టుబడేవారు. అన్ని వైద్యవిధానాలను సమానంగా ఆదరించేవారు.

పారిశుద్ధ్యానికి పెద్దపీట

భారతీయాత్మ గ్రామాల్లో ఉందని నమ్మే గాంధీజీ, శాంతినికేతన్‌కు వెళ్లే మార్గంలో గ్రామాల్లోని పారిశుద్ధ్య లోపాలను గమనించారు. డాక్టర్‌ దేవ్‌ సహకారంతో ప్రజల్లో అవగాహన పెంచి గ్రామాలను శుభ్రపరచే కార్యక్రమాలను చేపట్టారు. స్వీయపర్యవేక్షణలో రోడ్లను, బావులను సరిదిద్దారు. తరవాత చంపారన్‌లోనూ ఇదే పద్ధతి ప్రవేశపెట్టారు. దక్షిణాఫ్రికాలో ఉండగానే 'ఇండియన్‌ ఒపీనియన్‌' పత్రిక ద్వారా ఆహారం, పరిశుభ్రతలపై అనేక వ్యాసాలను గాంధీ ప్రచురించారు. భారత్‌కు వచ్చిన తరవాత 'యంగ్‌ ఇండియా', 'నవజీవన్‌', 'హరిజన్‌' అనే పత్రికల్లోనూ పారిశుద్ధ్యం ఆవశ్యకత వివరించేవారు. బద్ధకం పాపం, సోమరితనం శత్రువు... ఎవరి పనులు వారే చేసుకోవాలంటారాయన. మద్యాన్ని సైతాన్‌ అన్నారు. ధూమపానాన్ని నిషేధించి దానిపై గుమ్మరించే ధనాన్ని దేశం కోసం వినియోగించాలని కోరారు. కుష్టువ్యాధి పీడితులకు గాంధీజీ ఆజన్మాంతం అండగా నిలిచారు. శుశ్రూష ద్వారా దాన్ని నయం చేయవచ్చన్నారు. వారి అనుభవాలను ఆలకించేవారు. అది అంటువ్యాధి కాదన్నారు. ఎరవాడ జైల్లో కుష్టు వ్యాధిగ్రస్తుడైన పర్చురే శాస్త్రి అందజేసిన పండ్లరసాన్ని స్వీకరించి నిరసనను విరమించారు. అతణ్ని ఆశ్రమానికి తీసుకెళ్లి దగ్గరుండి సేవ చేశారు. ఆరోగ్యవంతురాలైన తల్లి ఆరోగ్యవంతులైన పిల్లలకు జన్మనిస్తుంది కాబట్టి, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పారు గాంధీ. ఎదుటి మనిషి దుఃఖాన్ని, బాధను అర్థం చేసుకోవడమే నరుడు నారాయణత్వాన్ని పొందే మార్గమని బోధించే ‘వైష్ణవ జనతో’ గాంధీకి ఇష్టమైన భజన. ప్రస్తుత కాలంలో సర్వదా ఆచరణీయం- మహాత్ముడి ఆరోగ్య సందేశం!

మందుల అతి వినియోగం అనర్థదాయకం

ధ్యానం నిత్య ఆరోగ్యమంత్రంగా సాధన చేసేవారు గాంధీ. చేయాల్సిన పనులు అధికంగా ఉన్నప్పుడు ఒకటికి రెండు గంటలు ధ్యానం చేయాలన్న ఆయన పలుకులు నేటి ఉరుకుల పరుగుల జీవితానికి ఆచరణీయాలు. 40 ఏళ్లపాటు రోజూ 18 కిలోమీటర్లు నడిచారాయన. 1913-1948 మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 79 వేల కిలోమీటర్లు పర్యటించారు. అంటే భూమండలాన్ని రెండుసార్లు చుట్టివచ్చినట్లన్నమాట. మంచి ఆరోగ్యం కోసం రోజుకు ఎనిమిది వేల నుంచి పది వేల అడుగులు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థా చెబుతోంది. జీవితంలో వైద్యవృత్తిని స్వీకరించాలని గాంధీ భావించారు. మృతకళేబరాలను ముట్టుకోవడం వైష్ణవ సంప్రదాయ విరుద్ధమన్న భావనవల్ల అప్పట్లో పెద్దన్నయ్య వ్యతిరేకించారు. బారిష్టర్‌ చదువు మంచిదని ప్రోత్సహించారు. వైద్యవిద్యార్థులు కప్పల్ని కోస్తారని తెలిసి ఆ వృత్తిని వద్దనుకున్నట్లు 1909లో స్నేహితుడికి రాసిన లేఖలో గాంధీ తెలిపారు. చికిత్సకన్నా నివారణే ఉత్తమమని భావించేవారాయన. అనవసరమైన మందులు అనర్థదాయకమనేవారు. న్యాయవృత్తిని విడిచిపెట్టినా, వ్యాధిగ్రస్తులకు సేవను జీవితాంతం కొనసాగించారు.

- డాక్టర్​ శ్రీభూషణ్​ రాజు, రచయిత- హైదరాబాద్​ నిమ్స్​లో నెఫ్రాలజీ విభాగాధిపతి

ABOUT THE AUTHOR

...view details