Madhya Pradesh Elections Family Battle : మధ్యప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో కుటుంబాల మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది. హోషంగాబాద్ నియోజకవర్గంలో అన్నదమ్ములు.. సయ్యంటే సయ్యంటున్నారు. డియోతలాబ్ నియోజకవర్గంలో మామాఅల్లుళ్లు బస్తీమే సవాల్ అంటున్నారు. డబ్రా నియోజకవర్గంలో ఇద్దరు దగ్గరి బంధువుల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. సాగర్ నియోజకవర్గంలో బావామరదళ్లు తలపడుతున్నారు. మరి వారెవరు? వారి రాజకీయ పరిస్థితేంటి?
అన్నదమ్ములే ప్రత్యర్థులు..
హోషంగాబాద్ నియోజకవర్గం మూడు దశాబ్దాల నుంచి భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉంది. అన్నదమ్ములైన గిరిజా శంకర్‌శర్మ, సీతా శరణ్ శర్మ.. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ తరఫున ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. 73 ఏళ్ల గిరిజా శంకర్ 2003, 2008 ఎన్నికల్లో కమలం తరఫున రెండుసార్లు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంపై ఆయనకు గట్టిపట్టు ఉంది. ఆయన తమ్ముడు 69ఏళ్ల సీతా శరణ్ కూడా ఇదే నియోజకవర్గం నుంచే బీజేపీ తరఫున 1990, 1993, 1998, 2013, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 2018 ఎన్నికల నుంచి అన్నదమ్ముల మధ్య విరోధం మొదలైంది. 2018 ఎన్నికల్లో తొలుత గిరిజా శంకర్‌ను తమ అభ్యర్థిగా నామినేట్ చేసిన బీజేపీ.. తర్వాత నిర్ణయం మార్చుకొని సీతా శరణ్‌కు టికెట్ కేటాయించింది. గిరిజా శంకర్ 2023 సెప్టెంబర్‌లో మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. హోషంగాబాద్‌లో బీజేపీ తరఫున సీతా శరణ్ పోటీ చేస్తుండగా.. ఆయన సోదరుడు గిరిజా శంకర్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది.
మామాఅల్లుళ్ల సవాల్!
డియోతలాబ్ నియోజకవర్గంలో మామాఅల్లుళ్లు బస్తీమే సవాల్ అంటున్నారు. బీజేపీ తరఫున గిరీశ్ గౌతమ్, కాంగ్రెస్ తరఫున పద్మేశ్ గౌతమ్ రంగంలో ఉన్నారు. వారిద్దరూ మామాఅల్లుళ్లు. 70ఏళ్ల గిరీశ్ గౌతమ్ నాలుగుసార్లు డియోతలాబ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత సీపీఐ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన తర్వాత కాలంలో బీజేపీలో చేరారు. 2003 ఎన్నికల్లో తొలిసారి మంగవాన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే ఆ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించడం వల్ల 2008లో డియోతలాబ్ స్థానానికి మారారు.
2008, 2013, 2018 ఎన్నికల్లో అక్కడి నుంచి గెలుపొందారు. వివిధ రాజకీయ కారణాలతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవటం వల్ల బీజేపీ అధికారం చేపట్టాక 2020 ప్రారంభంలో అసెంబ్లీ స్పీకర్‌గా సేవలందించారు. పద్మేశ్ గౌతమ్ ఆయనకు స్వయాన మేనల్లుడు. 9ఏళ్లక్రితం కాంగ్రెస్‌లో చేరారు. వారిద్దరూ ప్రత్యర్థులుగా మారడానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. 2020లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ గిరీశ్ గౌతమ్ తనయుడు రాహుల్‌ను పద్మేశ్ గౌతమ్ ఓడించారు.
దగ్గరి బంధువుల మధ్య పోరు!
డబ్రా నియోజకవర్గంలో ఇద్దరు దగ్గరి బంధువుల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేశ్ రాజేతో బీజేపీ నుంచి ఇమర్తి దేవి తలపడుతున్నారు. వారిద్దరూ దగ్గరి బంధువులు. ఇమర్తి దేవి అన్నయ్య కుమార్తెను సురేశ్ రాజే కుమారుడు వివాహం చేసుకున్నారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విధేయురాలిగా గుర్తింపు పొందిన ఇమర్తిదేవి ఎక్కువకాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. డబ్రా నుంచి 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈమె 2020 వరకు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.