Madhya Pradesh Bundelkhand Election :మధ్యప్రదేశ్‌లో దాదాపు రెండు దశాబ్దాల నుంచి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. ఈసారి కూడా కాషాయజెండా ఎగురవేయాలని పావులు కదుపుతోంది. సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్‌పై వ్యతిరేకత, ఇతర ప్రతికూల అంశాలను అధిగమించేందుకు అభివృద్ధి నినాదంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తమకు కలిసివస్తాయని కమలనాథులు ధీమాతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో 15నెలలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా.. ఈసారి పూర్తి మెజార్టీ సాధించి ఐదేళ్లు పాలించాలని వ్యూహరచన చేస్తోంది.
పేదరికం, కరవుకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందిన బుందేల్‌ఖండ్‌లో ఆధిక్యం సాధించిన పార్టీకే మధ్యప్రదేశ్‌లో అధికారం దక్కుతుందని 20ఏళ్ల ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. 2003 నుంచి దాదాపు 2దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై భారతీయ జనతా పార్టీ పట్టు కొనసాగుతోంది. మొత్తం 26 శాసనసభ స్థానాలు ఉండగా.. 2003 ఎన్నికల్లో కమలం పార్టీ 20 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2008లో 14, 2013లో 20, 2018లో 18స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి కూడా బుందేల్‌ఖండ్‌లో కమలం వికసిస్తుందా.. లేక మారిన పరిస్థితులతో కాంగ్రెస్ లాభపడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
డైమండ్ గనులు ఓవైపు.. కరవు మరోవైపు..
బుందేల్‌ఖండ్ ప్రాంతంలో డైమండ్ గనులున్నా.. దశాబ్దాల నుంచి కరవు, ఆర్థిక అసమానతలు, పేదరికం, కులఘర్షణలు వంటి సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. బుందేల్‌ఖండ్ కరవు ప్రాంతమే కాకుండా పారిశ్రామీకరణకు ఆమడ దూరంలో ఉంది. ఉపాధి అవకాశాలు లేక అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం దశాబ్దాల నుంచి పరిపాటిగా మారింది. 2003లో ఈ ప్రాంతానికే చెందిన ఉమాభారతి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆమె ఏడాది కంటే తక్కువ కాలమే అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత 2 దశాబ్దాల నుంచి బీజేపీ అధికారంలో ఉన్నా.. ఈ ప్రాంత ముఖచిత్రం మారలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
యూపీ రాజకీయ పార్టీల ప్రభావం
బుందేల్‌ఖండ్... మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 6 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో రాజకీయాలు ఇతర ప్రాంతాల కంటే సంక్లిష్టంగా ఉంటాయి. ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ప్రభావం ఉంటుంది. యూపీకి చెందిన 2 పార్టీలు కూడా ఈ ప్రాంతంలో విస్తరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తం 6 జిల్లాల్లో విస్తరించిన బుందేల్‌ఖండ్‌లో 26 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అందులో 6 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ 16 స్థానాల్లో, కాంగ్రెస్ 8 నియోజకవర్గాల్లో గెలుపొందింది.
శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై వ్యతిరేకత.. అందుకే ఆ వ్యూహం!
మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు కమలనాథులు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించిన బీజేపీ అధినాయకత్వం.. ఆ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యనేతలను ఎన్నికల బరిలో దింపింది. మళ్లీ అధికారం చేపడితే సీఎం చౌహాన్‌ను పక్కన పెట్టనున్నట్లు పార్టీ కేడర్‌తోపాటు ప్రజల్లోకి సంకేతాలు పంపింది.
అభివృద్ధి ఫలాలను ప్రస్తావిస్తూ..
2018లో కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా తాము ఆశించిన స్థాయిలో బుందేల్‌ఖండ్‌లో సీట్లు రాలేదని, ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు అందాయని అంటున్నారు. బినా రిఫైనరీ, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం బుందేల్‌ఖండ్ అభివృద్ధికి సంకేతమని గుర్తు చేస్తున్నారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన కెన్-బట్వా నదుల అనుసంధానం వల్ల ఈ ప్రాంతంలో 10లక్షల హెక్టార్లు సాగులోకి వస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 62లక్షల మందికి తాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుందని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారు.