తెలంగాణ

telangana

ETV Bharat / opinion

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ టార్గెట్ అదేనా..? అందుకే వారికి దూరంగా..! - బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభతో అనేక కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్న కేసీఆర్ సభకు.. కొందరు దూరంగా ఉండడం చర్చనీయాంశమవుతోంది. బిహార్ సీఎం నీతీశ్ కుమార్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వంటి నేతలు ఖమ్మం సభకు రాకపోవడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. అసలు కేసీఆర్ ఏ ప్లాన్​తో ముందుకెళ్తున్నారు? ఆయన ప్రయత్నాలు థర్డ్ ఫ్రంట్ కోసమేనా? అదే నిజమైతే.. కాంగ్రెస్​తో కూడిన విపక్షాల ఐక్య కూటమి ఉండదా? భాజపాకు లాభమా, నష్టమా?

KCR KHAMMAM MEETING DISUNITY IN OPPOSITION
KCR KHAMMAM MEETING DISUNITY IN OPPOSITION

By

Published : Jan 22, 2023, 4:57 PM IST

ఉత్తరాన ఆమ్ ఆద్మీ పార్టీ.. తూర్పున బంగాల్​లో టీఎంసీ.. బిహార్​లో జేడీయూ.. తెలంగాణలో బీఆర్ఎస్.. ఈ పార్టీల లక్ష్యం ఒక్కటే.. 2024లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ సర్కారును గద్దెదించడం. ఈ లక్ష్యం సంగతి ఎలాగున్నా.. వీరి మధ్య ఐక్యత మాత్రం కొరవడిందనేది విస్పష్టం. ప్రధాని కుర్చీపై మక్కువతో ఎవరికి వారు సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కూటములు, మద్దతుదారులతో బలప్రదర్శనకు దిగుతున్నారు. భాజపాను ఢీకొట్టాలని ఎవరికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయని ప్రశ్నార్థకమవుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సైతం ఖమ్మంలో మెగా ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అజెండా, విమర్శలు ప్రతివిమర్శలను పక్కనబెడితే.. దేశంలో విపక్షాల అనైక్యతకు ఈ సభ ఉదాహరణలా నిలిచిపోయింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావం తర్వాత నిర్వహించిన ఈ తొలి సభకు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్; పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్; కేరళ సీఎం, సీపీఎం దిగ్గజం పినరయి విజయన్; యూపీ మాజీ సీఎం, సమాజ్​వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డీ రాజా హాజరయ్యారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్.. విపక్షాల ఐక్యతను చాటుతూ ఈ సభ నిర్వహించారు. అయితే, ప్రధాని పదవిపై మక్కువ పెంచుకొని, జాతీయ రాజకీయాలవైపు మొగ్గు చూపుతున్న కొందరు నేతలు మాత్రం ఇక్కడ కనిపించలేదు.

ఖమ్మం సభకు వచ్చిన సీఎంలు, నేతలతో కేసీఆర్

ఉదాహరణకు బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.. స్వరాష్ట్రంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విపక్షాలను ఏకం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నవారిలో ఆయన ఒకరు. విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన పేరు వినిపిస్తోంది. అలాంటి నీతీశ్.. బీఆర్ఎస్ సభకు రాలేదు. గతంలో నీతీశ్​తో కేసీఆర్ సైతం భేటీ అయ్యారు. రాజకీయ అంశాలపై చర్చించారు. తీరా చూస్తే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఆయనకు ఆహ్వానమే అందలేదు. అయితే, బీఆర్ఎస్ సమావేశం.. తాము ప్రతిపాదిస్తున్న భాజపాయేతర 'మెయిన్ ఫ్రంట్​'కు వ్యతిరేకం కాకపోవచ్చని చెప్పుకొచ్చారు.

అఖిలేశ్, కేజ్రీవాల్, మాన్, విజయన్, డీ.రాజాతో కేసీఆర్

"ఆ మీటింగ్ గురించి నాకు తెలియదు. ఒకవేళ నాకు ఆహ్వానం అందినా నేను వెళ్లేవాడిని కాదు. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. అది పార్టీ (బీఆర్ఎస్) కార్యక్రమంలా అనిపిస్తోంది. ఎవరికైతే ఆహ్వానం అందిందో వారే వెళ్లారు. ఇది కొత్త కూటమి ఏర్పాటు అని నేను అనుకోవడం లేదు. ఆయన (కేసీఆర్) కొద్దిరోజుల క్రితమే ఇక్కడికి (పట్నాకు) వచ్చారు కదా."
-నీతీశ్ కుమార్, బిహార్ సీఎం

అటు, జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీ సైతం బీఆర్ఎస్ సభకు రాలేదు. పట్నాకు వెళ్లిన సమయంలో కేసీఆర్.. నీతీశ్​తో పాటు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్​ను సైతం కలిశారు. మోదీని ఢీకొట్టే ప్రధాని అభ్యర్థి ఎవరని అప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నకు విపక్ష కూటమే సమాధానం చెబుతుందని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు ఆ విపక్ష కూటమి ఏంటన్నదే చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్

కేసీఆర్ తొలి నుంచీ.. భాజపాయేతర, కాంగ్రెస్సేతర కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత రాష్ట్రంలోనూ ఆ రెండు పార్టీలే కేసీఆర్​కు ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఇక ఖమ్మం సభ సైతం అలాంటి నేతలతోనే నిండిపోయింది. తమతమ రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు రెండింటినీ విమర్శించే నేతలు మాత్రమే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వచ్చారు. కాంగ్రెస్​ను కలుపుకొని వెళ్లాలని భావిస్తున్న పార్టీలు ఇక్కడ కనిపించలేదు. కాంగ్రెస్​ను పూర్తిగా విస్మరించి కూటమిని ఏర్పాటు చేయడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషించే ముందు.. అసలు అలాంటి కూటమి సాధ్యపడుతుందా? అనేది రాజకీయ పండితుల ప్రశ్న. పలు పార్టీలు కాంగ్రెస్​ను వీడి మూడో కూటమిని ఆశ్రయించే అవకాశం ఉందా అన్నది చర్చించాల్సి ఉంది.

యాదాద్రి ఆలయంలో కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ మాన్

సంకట స్థితిలో జేడీఎస్?
బీఆర్​ఎస్​కు ఆది నుంచి మద్దతు ప్రకటిస్తూ వచ్చిన జనతా దళ్ సెక్యులర్ పార్టీ సైతం ఖమ్మం సభకు డుమ్మా కొట్టింది. ఆ పార్టీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి సభకు రాలేకపోయారు. వ్యక్తిగత కారణాల వల్లే సభకు రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. కర్ణాటకలో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి బీఆర్ఎస్, జేడీఎస్. అలాంటిది.. ఆవిర్భావ సభకు ఆ పార్టీ రాకపోవడం ప్రశ్నార్థకం.

కర్ణాటకలో 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్​తో కలిసి అధికారం చేపట్టింది జేడీఎస్. మధ్యలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం వల్ల అధికారం కోల్పోయింది. 2023లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ ఎవరికీ మెజార్టీ రాకపోతే.. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి మరోసారి అధికారంలోకి రావడాన్ని ఎవరూ కొట్టిపారేయలేం. అప్పుడు, బీఆర్ఎస్​తో జేడీఎస్ బంధం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.

బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వచ్చిన జనం

'ఆ పాపం కాంగ్రెస్​దే!'
అయితే, విపక్షాలతో కలిసి నడిచే విషయంలో కాంగ్రెస్ పార్టీయే తర్జనభర్జన పడుతోందని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. సరైన నిర్ణయం తీసుకోకుండా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది. నిజానికి.. ముందుగా టీఎంసీ పార్టీయే విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్​ను కలుపుకుపోవాలని సైతం ఆలోచన చేసింది. అయితే, ఇందుకు హస్తం పార్టీ సహకరించడం లేదని టీఎంసీ నేత కునాల్ ఘోష్ చెబుతున్నారు.

"విపక్ష పార్టీలను ఒకచోటికి చేర్చేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా భాజపా పాలిత రాష్ట్రాల్లో విపక్షపార్టీలను ఐక్యం చేయాలని భావించారు. కానీ, కాంగ్రెస్ ఇందుకు స్పందించడం లేదు. ఏకపక్షంగా ముందుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో విఫలమైంది. 2014, 2019 లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. కాబట్టి, మమతా బెనర్జీ ప్రతిపాదనల ప్రకారం.. శాస్త్రీయంగా విపక్ష యంత్రాంగాన్ని తీర్చిదిద్దాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ఇది అర్థం చేసుకుంటుందని భావిస్తున్నా."
-కునాల్ ఘోష్, టీఎంసీ నేత

'మేం లేకుండా ఎలా?'
విపక్షాల ఆలోచనలు ఎలా ఉన్నా.. కాంగ్రెస్ మాత్రం భాజపాకు తామే ప్రత్యామ్నాయం అని భావిస్తోంది. కాంగ్రెస్ లేకుండా బలమైన విపక్షం తయారు కావడం అసాధ్యమని చెబుతోంది. 'ఖమ్మం సభకు ఇద్దరు ముగ్గురు సీఎంలు వచ్చినట్టున్నారు. కానీ, కాంగ్రెస్ లేకుండా బలమైన విపక్షం సాధ్యం కాదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ యాక్టివ్​గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రత్యేక కూటమి ఏర్పాటు చేస్తే అది విపక్షాలను బలహీనం చేసినట్టవుతుంది. అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలనే కాంగ్రెస్ కోరుకుంటోంది. కాంగ్రెస్​ను బలహీనం చేసేందుకే కేసీఆర్ పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ఆయన అదే చేశారు. ఉత్తరాదిలో మోదీ సర్కారుకు ఉపయోగపడేలా కేజ్రీవాల్, ఒవైసీ పార్టీలు పనిచేస్తున్నాయి. దక్షిణాదిలో ఈ బాధ్యత కేసీఆర్ తీసుకున్నారు' అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ చెప్పుకొచ్చారు.

కేసీఆర్​తో రాజకీయ పార్టీల నేతలు

అయితే, కేసీఆర్ ర్యాలీ.. థర్డ్ ఫ్రంట్ కోసమనని విశ్లేషణలు వెలువడుతున్నాయి. దాదాపు ప్రతీ రాష్ట్రంలో అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్​ను కాదని... 'నాన్-కాంగ్రెస్' పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్​సభ ఎన్నికలకు దాదాపు 15 నెలల సమయం ఉంది. ఈసారీ భారీ మెజార్టీతో గెలవాలని భాజపా సకల్పించుకుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించుకొని ముందుకెళ్తోంది. బలమైన విపక్ష కూటమి ఇంకా ఖరారు కాకపోవడం.. కేంద్రంలోని అధికారపక్షానికి లాభించేదే. ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న విపక్ష పార్టీలు ఎలా ముందుకెళ్తాయనేది చూడాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details