తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'లీగల్‌ క్లినిక్‌'లతో న్యాయసేవలకు నవ్యపథం - దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు

సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ఉచితంగా చట్టపరమైన తోడ్పాటునందిచడం ద్వారా అందరికీ న్యాయం అందేలా చూడాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అందరికీ సమానవకాశాల ప్రాతిపదికన న్యాయ సేవల్ని విస్తృతం చేయాలన్న రాజ్యాంగ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కేంద్రం ప్రణాళిక నిర్దేశించుకుంది. మారుమూల ప్రాంతాలకూ న్యాయసేవలు అందాలంటే ప్రతి గ్రామంలోనూ 'లీగల్‌ క్లినిక్' ఏర్పాటు చేయాలని నల్సా నిర్దేశించుకొంది. సత్వర న్యాయాన్ని సమర్థంగా ప్రజలకు చేరువ చేసేందుకు, విశిష్టమైన లోక్‌అదాలత్‌ సేవా యంత్రాంగాన్ని మరింతగా పరిపుష్టం చేయక తప్పదు!

Lok Adalat service needs to be expanded due to bring speedy justice to the people effectively
న్యాయసేవలకు నవ్యపథం

By

Published : Apr 12, 2021, 6:53 AM IST

సమాజంలోని పేద, బలహీన వర్గాలకు ఉచితంగా చట్టపరమైన తోడ్పాటు అందించడం ద్వారా అందరికీ న్యాయం అందేలా చూడాలని రాజ్యాంగంలోని 39(ఎ) అధికరణ నిర్దేశిస్తోంది. అందరికీ సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయ సేవల్ని విస్తృతీకరించాలన్న రాజ్యాంగ లక్ష్యాన్ని నెరవేర్చడానికి స్వాతంత్య్రానంతరం నాలుగు దశాబ్దాలకు కేంద్రం తీరిక చేసుకొంది. 1987లోనే లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీస్‌ యాక్ట్‌కు పార్లమెంటు ఆమోదముద్ర వేసినా 1995లో అది పట్టాలకెక్కాకే, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా) ఏర్పాటైంది. పలుపు కోసం కోర్టుకెక్కి పాడిని అమ్ముకోవాల్సి వచ్చే దురవస్థ నుంచి సామాన్య జనావళిని కాచుకోవడానికి లోక్‌ అదాలత్‌లు, ఇతర ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల యంత్రాంగాల ఏర్పాటు తదాదిగా చురుకందుకొని సత్వర న్యాయానికి వేదికగా భాసిస్తోంది. ఈ ఏడాది నల్సా తలపెట్టిన నాలుగు జాతీయ లోక్‌ అదాలత్‌లలో మొట్టమొదటిది మొన్న శనివారం పూర్తి కాగా, తెలంగాణవ్యాప్తంగా దాదాపు 36 వేల కేసులు పరిష్కారమై రూ.49 కోట్ల పరిహారం బాధితులకు అందింది.

లోక్​ అదాలత్​..

కొవిడ్‌ విస్తృతి కారణంగా మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ్‌ బంగ, ఆంధ్రప్రదేశ్‌ వంటి 16 రాష్ట్రాలు లోక్‌ అదాలత్‌ను వాయిదా వేసుకోగా, కర్ణాటక మార్చి చివరి వారంలోనే దాన్ని నిర్వహించి, 3.3 లక్షల కేసుల్ని రూ.1000 కోట్ల పరిహారంతో పరిష్కరించింది. నిరుడు కొవిడ్‌ ముప్పు తీవ్రంగా ఉన్న సమయంలోనూ రెండుసార్లు నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లలో- కోర్టు మెట్లు ఎక్కడానికి ముందే 12.6 లక్షల వివాదాల్ని, మరో 12.8 లక్షల పెండింగ్‌ కేసుల్ని రూ. 1000 కోట్ల పరిహారంతో పరిష్కరించడం విశేషం. దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారానూ 24 రాష్ట్రాల న్యాయ సేవా ప్రాధికార సంస్థలు, ఈ-లోక్‌ అదాలత్‌లు నిర్వహించగలుగుతుండటం- సాంకేతిక దన్నుతో సత్వర న్యాయ ప్రదానం కొత్త పుంతలు తొక్కుతోందనడానికి నిదర్శనం. లోక్‌ అదాలత్‌ వ్యవస్థ ప్రపంచంలో వేరెక్కడా లేదు. ఇన్నేళ్ల అనుభవాల్ని వడగట్టి దాన్ని మరింత ప్రభావాన్వితం చేయాలిప్పుడు!

కార్యచరణేదీ?

పెండింగ్‌ కేసుల కొండల కింద న్యాయపాలికే దశాబ్దాలుగా కుదేలైపోతున్న తీరు కోట్లాది కక్షిదారుల గుండెల్ని మండిస్తోంది. ఈ దురవస్థను దునుమాడేందుకు ఇదమిత్థంగా ఏం చేయాలన్న విజ్ఞతాయుత సూచనలకు ఏనాడూ కొదవ లేకపోయినా- కార్యాచరణే కదులూ మెదులూ లేకుండా ఉంది. దేశవ్యాప్తంగా జిల్లా తాలూకా కోర్టుల్లో దాదాపు 17శాతం కేసులు మూడు నుంచి అయిదేళ్ల క్రితం దాఖలైనవి. అదే ఉన్నత న్యాయస్థానాల్లో 20.4శాతం కేసులు 5-10 ఏళ్లు, 17శాతం పది నుంచి ఇరవయ్యేళ్లుగా పెండింగులో ఉన్నాయి. పెండింగ్‌ కేసుల్లో సగానికి పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే లిటిగెంట్లుగా ఉన్న వైపరీత్యం మరెక్కడా కనీవినీ ఎరుగనిది. కేంద్రం సరైన వ్యాజ్య విధానం అనుసరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై పెండింగ్‌ భారాన్ని తగ్గించాలంటూ లా కమిషన్‌ వివరణాత్మక నివేదిక అందించి మూడు దశాబ్దాలు దాటింది.

'లీగల్​ క్లినిక్​'ల ఏర్పాటుతో..

పౌరులతో ప్రభుత్వాల వ్యవహార సరళి సానునయంగా ఉండాలి గాని సంఘర్షణాత్మకంగా కాదని సుప్రీంకోర్టు సైతం గతంలోనే హితవు పలికింది. లోక్‌అదాలత్‌ పరిశీలనకొచ్చే కేసుల్లో సింహభాగం భూసేకరణ, కార్మిక వివాదాలు, పింఛన్లు, వినియోగదారుల వెతలు, విద్యుత్‌, టెలిఫోన్‌, మున్సిపల్‌ వ్యవహారాల వంటివే అయినందున- ఆయా ప్రభుత్వ విభాగాలకూ 'సుప్రీం' సూచన శిరోధార్యం కావాలి. ప్రజాకోర్టులుగా లోక్‌అదాలత్‌లకు దక్కుతున్న మన్ననకు దీటుగా న్యాయప్రదానమూ బాధితుల గుండె బరువు తగ్గించేదిగా ఉండాలి. మారుమూల ప్రాంతాలకూ న్యాయసేవలు అందాలంటే ప్రతి గ్రామంలోనూ 'లీగల్‌ క్లినిక్' ఏర్పాటు కావాలని, హేతుబద్ధంగా కూర్చిన కొన్ని గ్రామాల సమూహానికైనా ఒకటి నెలకొల్పాలని 2011లో నల్సా నిర్దేశించుకొంది. దేశీయంగా ఆరు లక్షల గ్రామాలకు గాను ప్రస్తుతం ఉన్నవి పద్నాలుగు వేల పైచిలుకు! సత్వర న్యాయాన్ని సమర్థంగా ప్రజలకు చేరువ చేసేందుకు, విశిష్టమైన లోక్‌అదాలత్‌ సేవా యంత్రాంగాన్ని మరింతగా పరిపుష్టం చేయక తప్పదు!

ఇదీ చదవండి:ప్రధాన ఎన్నికల కమిషనర్​గా సుశీల్​ చంద్ర!

ABOUT THE AUTHOR

...view details