దేశ జనాభాలో దాదాపు 80 శాతానికిపైగా అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్నారు. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో చిరు వ్యాపారులు చితికిపోతున్నారు. ముఖ్యంగా వీధులలో వ్యాపారం చేసుకొనే వేలాది మందికి ఉపాధి కరవై, ఆదాయాలు తగ్గిపోవడంతో వారి జీవితాలు రోడ్డున పడ్డాయి.
రహదారుల పక్కన కూరగాయలు, పండ్లు, వస్త్రాల వ్యాపారం చేసేవారు, పాదచారుల బాటలపై బ్యాగులు, బొమ్మలు, చిన్నచిన్న వస్తువులు అమ్ముకునే వారు, వాహనాలు, ఇతరత్రా గృహోపకరణాలు, యంత్రసామగ్రి మరమ్మతులు చేసే దుకాణాలు, కుట్టు దుకాణాలు, క్షౌరశాలలు వంటి పలు రకాల వ్యాపారాలు స్తంభించిపోవడం వల్ల వాటిలో పనిచేసే వారి జీవితాలు దుర్భరంగా మారాయి.
చిరు వ్యాపారాలతో కూడిన అసంఘటిత రంగంలో ఎక్కువ మంది స్వయం ఉపాధి పొందుతూ, వారి కాళ్లపై వారు జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి వారందరి వ్యాపారాలు గాడిలో పడడానికి మరికొన్ని నెలల సమయం పడుతుంది.
ఆత్మగౌరవాన్ని కాపాడాలి
ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల చిరువ్యాపారులకు తమ కార్యకలాపాలు సాగించుకునేందుకు లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ ప్రజలు కరోనా భయంతో కొనుగోళ్లకు వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాపార వ్యవస్థలో ఉన్నవారు చాలామంది నిరక్షరాస్యులు లేదా ప్రాథమిక విద్య వరకే అభ్యసించినవారు కావడం, వారు కరోనా నిరోధానికి సంబంధించిన జాగ్రత్తలు పాటించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శానిటైజర్‌లు, పీపీఈ మాస్కులు అందుబాటులో లేకపోవడం కూడా వారి వ్యాపారాలకు ప్రధాన ఎదురుదెబ్బగా మారుతోంది. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రంగాల్లో పనిచేసే కార్మికులకు వివిధ విధానాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాయి. కానీ, తమ సొంత కాళ్లపై నిలబడి, చిరు వ్యాపారాలు చేసుకునే వారికి మాత్రం ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చాలా సంస్థలు ఎంతోకొంత సహాయం అందించేందుకు ముందుకొచ్చినప్పటికీ... వారు చేసే సహాయాన్ని ఫొటోల ద్వారా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తుండటం వల్ల తమ ఆత్మగౌరవానికి భంగకరంగా భావించి చాలామంది చిరువ్యాపారులు నిరాకరిస్తున్నారు. చిరువ్యాపారాలు చేసుకొనే వారికి కొంతమందికి రేషన్ కార్డుల ద్వారా లబ్ధి జరుగుతున్నా, ఇతరత్రా ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువుల కొనుగోలు, అద్దెల చెల్లింపు వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆరేళ్ల కిందటే చట్టం..
ప్రభుత్వాలు ఇలాంటి వ్యాపారులకు సహాయం చెయ్యడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నా అధికారికంగా చిరువ్యాపారుల వివరాలు పూర్తిస్థాయిలో లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. భారత ప్రభుత్వం వీధి వ్యాపారుల గుర్తింపునకు, సంక్షేమానికి సంబంధించి 2014లో చట్టం చేసింది. ఈ చట్టం రూపకల్పనలో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీధి వ్యాపారులకు సంబంధించిన నిబంధనలు, విధానాన్ని ప్రకటించాయి.
వ్యాపారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు కమిటీ, అన్ని పట్టణాలలో ‘టౌన్ వెండింగ్ కమిటీ’లు ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా వీధి వ్యాపారుల వివరాల సేకరణ, గుర్తింపు కార్డుల జారీ, వీధి వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయింపు, టౌన్ వెండింగ్ కమిటీలకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు... తదితర సౌకర్యాలతో చిరు వ్యాపారుల అభివృద్ధికి కృషి జరిగింది.
చట్టబద్ధ రక్షణేదీ?
సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ వారి అధ్యయనం ప్రకారం తమిళనాడు, మిజోరం, రాజస్థాన్, చండీగఢ్ ఈ చట్టం అమలులో ముందంజలో ఉన్నాయి. ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, పంజాబ్, ఒడిశా, గోవా, గుజరాత్ కొంత పురోగతిని సాధించినప్పటికీ అనుకున్న స్థాయిలో పూర్తి చేయలేకపోయాయని ఆ అధ్యయనం తేల్చిచెప్పింది.
మణిపుర్, కర్ణాటక, సిక్కిం, పశ్చిమ్ బంగ, నాగాలాండ్ ఈ చట్టాన్ని అమలు చేయడంలో చాలా వెనకంజలో ఉన్నట్లు తేలింది. ఈ చట్టం ద్వారా చిరు వ్యాపారులకు కొంతమేర ఉపశమనం కల్పించినప్పటికీ ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో వారికి తగిన సహాయ సహకారాలు అందడం లేదని వివిధ వీధి వ్యాపారాల సంఘాల నాయకులు ఆవేదన చెందుతున్నారు.
అంతేకాకుండా, ఈ చట్టం కేవలం ఒక స్థిరమైన ప్రదేశంలో వ్యాపారం చేసుకునే వారినే గుర్తిస్తోందని, సంచార వాహనాలు, తోపుడు బండ్లు, సైకిళ్ల ద్వారా వ్యాపారాన్ని చేసుకునే వారిని గుర్తించలేకపోతోందనే విమర్శలున్నాయి. ఏది ఏమైనప్పటికీ, దేశ వ్యాపార రంగంలో ఇలాంటి చిరు వ్యాపారుల పాత్రను గుర్తించి, వారికి ప్రభుత్వం కొంత నగదు సహాయం ప్రకటించినట్లయితే, వారికి మేలు జరిగే అవకాశం ఉంది.
మనందరి బాధ్యత..
చిరువ్యాపారులకు అవసరమైన కరోనా ఆరోగ్య కిట్లను అందిస్తే ప్రస్తుత కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారనడంలో సందేహం లేదు. తమకు తాము స్వయం ఉపాధి పొందుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన వస్తువుల్ని వారి ముంగిళ్లలోనే అమ్మే వీధి/చిరు వ్యాపార వర్గాలకు చేయూతనిచ్చి రక్షించుకోవడం అందరి బాధ్యత.
(రచయిత - డాక్టర్ కృష్ణారెడ్డి చిట్టెడి, ఆర్థికరంగ నిపుణులు)