నరేంద్ర మోదీ కేంద్రంలో రెండోసారి పగ్గాలు చేపట్టి మొన్న మే 30నాటికి ఏడాది పూర్తయింది. దానికి కొన్ని నెలల ముందు నుంచే కొవిడ్ సంక్షోభం విరుచుకుపడటంతో మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికకు పెను విఘాతం కలిగింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన వివిధ కార్యక్రమాలను నిలిపివేయడమే కాదు, కొత్త పథకాలేవీ చేపట్టకూడదని మంత్రిత్వ శాఖలను కోరారు. బడ్జెట్‌లో ప్రకటించి, ప్రభుత్వ వ్యయాల శాఖ అనుమతి పొందిన పథకాలను మాత్రం కొనసాగిస్తూ, సూత్రప్రాయంగా అనుమతి పొంది నిధుల కేటాయింపు జరగని పథకాలను మాత్రం నిలిపేస్తారు.
అనుకున్నట్లే ఆత్మనిర్భర భారత్
ఇంత నిధుల కటకటలోనూ రూ.20 లక్షల ఆత్మ నిర్భర్ భారత్ పథకాన్ని మాత్రం అనుకున్నట్లే కొనసాగిస్తారు. సంక్షోభ సమయంలోనే నాయకుడి బలాబలాలు నిగ్గుతేలుతాయి. మోదీ రెండో సంవత్సర పాలనలో ప్రజలు ఆయన శక్తిసామర్థ్యాలపై సరైన అంచనాకు రాగలుగుతారు. అటు కరోనా ఇటు మిడతల దాడితో- కష్టాలు చెప్పిరావనీ, కట్టకట్టుకుని వస్తాయన్న పెద్దల మాట మరోసారి స్ఫురణకు వస్తోంది. ఈ సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థకు అగ్నిపరీక్షగా నిలవనున్నది. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టేసరికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉండేది. మోదీ ప్రభుత్వం 2019 మేలో రెండోసారి అధికారం చేపట్టేసరికి అది 2.7 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. 2024కల్లా భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్షిస్తున్నారు.
ఆశలు ఆవిరి
కరోనా తెచ్చిపెట్టిన కొవిడ్ వ్యాధి ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటుందనే ఆశలపై నీళ్ళు చల్లింది. రాబోయే రెండేళ్ల వరకు ఆర్థికంగా కోలుకుంటామనే ఆశ లేకుండా పోయింది. లాక్‌డౌన్ తరవాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ప్రభుత్వం పేరుకు రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినా, వాస్తవ కేటాయింపులు జీడీపీలో రెండు శాతాన్ని మించవని కొందరు నిపుణుల అంచనా. ఈ ప్యాకేజీలో చెప్పుకోదగిన అంశాలేమంటే- వ్యవసాయ సంస్కరణలు, బొగ్గు రవాణాపై పెట్టుబడులు. సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికీ ప్రయోజనాల్ని ఉద్దేశించారు.
లాక్‌డౌన్ కాలంలో ముందనుకున్న ఆదాయవ్యయ లెక్కలన్నీ తప్పిపోయాయి. ఆర్థిక రథం దశదిశ ఏమిటో అగమ్యగోచరమైంది. సవరించిన అంచనాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మొత్తం ఆదాయం రూ.26.54 లక్షల కోట్లు. అందులో పన్నుల ద్వారా రూ.21.63 లక్షల కోట్లు సమకూరాయి. కస్టమ్స్ సుంకాల వాటా రూ.1.25 లక్షల కోట్లయితే, ఎక్సైజు సుంకాల వాటా రూ.2.48 లక్షల కోట్లు. ఈ ఏడాది కస్టమ్స్, ఎక్సైజు సుంకాలు మినహా ఇతర రకాల పన్ను వసూళ్లు పడిపోవడం తథ్యం. పెట్రోలియం ఉత్పత్తులపై భారీగా పన్నులు వేసి ఆదాయ లోటు భర్తీ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నందువల్ల, ఇతర రంగాల్లో గిరాకీపై తప్పక ప్రతికూల ప్రభావం పడుతుంది.
ప్రధాన సమస్యలివే...
మోదీ మొదటి సంవత్సర పాలనలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండి స్థూల పెట్టుబడి సంచయం కాస్త పెరుగుదల నమోదు చేసింది. సులభతర వాణిజ్య సూచీలో భారత్ ర్యాంకు మెరుగుపడింది. మొదటి ఆరు నెలల్లో రాష్ట్రాల ఎన్నికలు, 370 అధికరణ వంటి రాజకీయ, పాలనా అంశాల మీద ప్రభుత్వం దృష్టిపెట్టడంతో ఆర్థిక రంగం మీద శ్రద్ధ తగ్గింది. పొదుపు, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు తగ్గిపోతుంటే- ప్రభుత్వ రుణ భారం, నిరుద్యోగం పెరగసాగాయి. గడచిన తొమ్మిది త్రైమాసికాలకు ఎనిమిది త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిరేటు క్షీణించింది. అసలే బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోయి, జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయి ప్రభుత్వం అల్లలాడుతున్న సమయంలో- పులి మీద పుట్రలా కరోనా కల్లోలం వచ్చిపడింది.