రుణ లభ్యత మొదలు గిట్టుబాటు ధర వరకు ఏటా ఎన్నో చేదు అనుభవాలు ఆనవాయితీగా రైతాంగాన్ని తీవ్ర గుండెకోతకు గురిచేస్తున్న దేశం మనది. ఈసారి సాగు ఖర్చులు తడిసి మోపెడైన కారణంగా పంట రుణ పరిమితి పెంచాలని వివిధ జిల్లాల యంత్రాంగాలు తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితికి సిఫార్సు చేశాయన్న కథనాలు, పక్షం రోజులక్రితం ఆశల్ని మోసులెత్తించాయి. రేపటినుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో ఏ పంట సాగుకు ఎకరానికి ఎంత మేర అప్పులివ్వాలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సాంకేతిక కమిటీ తాజాగా ఖరారు చేసిన పరిమితులు విస్మయపరుస్తున్నాయి.
బారెడు ఆశలతో..
ఆయిల్‌పామ్ తోటల సాగును పెద్దయెత్తున ప్రోత్సహించాలన్న ప్రభుత్వ సూచనల మేరకు ఎకరానికి రూ.57వేల దాకా రుణమివ్వాలని జిల్లా అధికారులు సిఫార్సులందించగా, సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపింది రూ.38వేలకే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన ఆహార పంట. ఏపీలో నిరుడు వరికి ఖరారైన సుమారు రూ.23వేల రుణ పరిమితి రైతుల్ని హతాశుల్ని చేసింది. ఈసారి తెలంగాణలో వ్యయ విస్తృతి దృష్ట్యా ఎకరా సాగుకు రూ.45వేల వరకు రుణమివ్వాలని అధికారులు కోరినా, ఇప్పుడది రూ.34వేలకే పరిమితం కావడం అన్నదాతను కుంగదీసే పరిణామం! నాలుగు పందులు పెంచితే రూ.43వేల అప్పివ్వాలని ఉదారంగా అనుమతించిన సాంకేతిక కమిటీ- ఎకరా వేరుశనగ సాగుకు రూ.30వేల రుణ పరిమితి కోరితే, అంగీకరించింది రూ.19-26వేలు. పత్తి పంటకు రూ.53వేలు అనుగ్రహించాలని అభ్యర్థిస్తే, దయతలచింది రూ.35-38వేలు. సేద్యానికి వ్యవస్థాగత పరపతే అంతంతమాత్రం. వాస్తవ వ్యయ అంచనాల్ని తుంగలో తొక్కి, అసంబద్ధ రుణ పరిమితి నిర్ధారించి, అరకొర పంటరుణాలతోనే బ్యాంకులు ఇలా సరిపుచ్చడం.. రైతుల ప్రారబ్ధం!
రాష్ట్రాలవారీగా ఏటికేడాది పంట రుణాల వితరణ ఇతోధికమవుతున్నట్లు బ్యాంకులు చెప్పే గొప్పలు, చూపించే లెక్కల వెనక ఎన్నో తిరకాసులు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. సేద్యరుణాల పద్దుపై రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు తిలోదకాలు వదిలి పుస్తక సర్దుబాట్లతో నెట్టుకొస్తున్న బ్యాంకులు ఖరీఫ్, రబీ లక్ష్యాలను పూర్తిగా సాధిస్తున్న సందర్భాలే లేవని అధ్యయనాలెన్నో ధ్రువీకరిస్తున్నాయి. భారీ వడ్డీరేటుకు తలొగ్గి అప్పులకోసం ఎందరో రైతులు ప్రైవేటు వ్యాపారుల్ని ఆశ్రయించాల్సి వస్తోందంటేనే- బ్యాంకుల రుణ వసతి కొరగానిదన్న నిజం బోధపడుతుంది.
వడ్డీవ్యాపారులే దిక్కు!