ఆ మూడు దేశాలు ఉక్కు వంటి క్రమశిక్షణకు మారు పేరు. కదనంలో కాకలు తీరిన చరిత్ర వాటి సొంతం. ఏకతాటిపై నడిచే ప్రజలు ఆ దేశాలకు జాతిరత్నాలు. మరి ఈ యోధత్రయం కరోనా వైరస్‌కు ముకుతాడు బిగించాయంటే ఆశ్చర్యమేముంది? కొవిడ్ ముప్పును పొరుగువారికన్నా ముందే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం, విస్తృత వైద్య వసతులు ఏర్పాటు చేసి వైరస్ పీచమణచడం ఈ మూడు దేశాల ఉమ్మడి లక్షణం.
వియత్నాం, జర్మనీ... త్రిముఖ పోరు!
'సార్స్'ను 2003లో విజయవంతంగా కట్టడి చేయగలిగిన వియత్నాం ఈసారి కొవిడ్‌పైనా అదేమాదిరి విజయం సాధించింది. కొవిడ్‌ను వేగంగా నియంత్రించగలిగింది కాబట్టి వియత్నాంలో విద్యా సంస్థలు, పరిశ్రమలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి ఆ దేశం తప్పించుకోనుందని ఆర్థికవేత్తల అంచనా. ఫిబ్రవరిలో తొలి కరోనా కేసులు నమోదు కాగానే జనం కదలికలపై సర్కారు ఆంక్షలు విధించడంతో గత మూడు నెలలుగా విద్యార్థులు ఇంటిపట్టునే ఉండిపోయారు. మిగతా ఆగ్నేయాసియా దేశాలు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే వియత్నాం వేగంగా లాక్ డౌన్ విధించి, బయటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్ చేయసాగింది. చైనా పర్యాటక బృందాలను కానీ, వ్యాపార ప్రతినిధి వర్గాలను కానీ తన గడ్డపైకి రానివ్వలేదు. చైనాకు రాకపోకలనూ బంద్ చేసింది. వియత్నాం సైనిక దళాలు, పౌర బృందాలు కలిసికట్టుగా ట్రేసింగ్, కంటైన్మెంట్ కార్యకలాపాలతో పరిస్థితిని వేగంగా అదుపులోకి తెచ్చాయి.
అమెరికాతో, సాటి ఐరోపా దేశాలతో పోలిస్తే జర్మనీలో ప్రాణాంతక కరోనా కేసులు, మరణాలు బాగా తక్కువ. కరోనాపై విజయంలో జర్మనీకి మూడు అంశాలు తోడ్పడ్డాయి. మొదటిది- కరోనా కేసులు తలెత్తడానికి ముందు నుంచే జర్మన్ ఆరోగ్య రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఆ దేశంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. దేశమంతటా చాలినంతమంది వైద్యులు ఉన్నందున ఒక మోస్తరు కొవిడ్ కేసులకు ఎక్కడికక్కడ చికిత్స చేయడం ద్వారా పెద్ద ఆస్పత్రులపై మితిమీరిన భారం పడకుండా చూడగలిగారు. రెండో అంశం- కొన్ని దేశాల మాదిరిగా జర్మనీ కొవిడ్‌ను అలక్ష్యం చేయకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంది. కొవిడ్‌కు ముందు దేశంలో 12,000 ఐసీయూ పడకలు ఉంటే, కొవిడ్ కేసులు పెరగ్గానే ఆ పడకలను చాలా వేగంగా 40,000కు పెంచింది. మూడో అంశం- జర్మనీలో వైద్య పరీక్షలకు అందుబాటులో ఉన్న ప్రయోగశాలలు చాలా ఎక్కువ. కొవిడ్ ఛాయలను వేగంగా పసిగట్టడానికి తొలి పరీక్షా విధానం జర్మనీలోనే రూపుదిద్దుకుంది. 8.3 కోట్ల జనాభా ఉన్న జర్మనీ కరోనా నిర్ధారణకు రోజుకు 10 లక్షల పరీక్షలు చేయసాగింది. త్వరలోనే నెలకు 50 లక్షల యాంటీబాడీ పరీక్షలు చేయడానికి సమాయత్తమవుతోంది. ఇన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం వల్ల జర్మనీకి జాతీయ స్థాయిలో కర్ఫ్యూలు విధించాల్సిన అవసరం రాలేదు.
జపాన్ తీరే వేరు
కొత్త కరోనా కేసులు పదుల సంఖ్యకు పడిపోయినందున జపాన్‌లో కరోనా సంబంధ అత్యయిక పరిస్థితిని ఎత్తివేస్తున్నారు. మిగతా దేశాల్లోలాగా జపాన్‌లో పౌరుల కదలికలపై ఆంక్షలు పెట్టలేదు. రెస్టారెంట్ల నుంచి క్షౌరశాలల వరకు అన్నీ తెరచే ఉన్నాయి. జనం కదలికలను ఆచూకీ తీయడానికి హైటెక్ యాప్లేమీ వాడలేదు. ప్రపంచమంతా ‘టెస్ట్ టెస్ట్ టెస్ట్’ అంటూ తారకమంత్రంలా జపిస్తుంటే, జపాన్ జనాభాలో కేవలం 0.2 శాతానికి కరోనా పరీక్షలు జరిపారు. అయినప్పటికీ జీ-7 దేశాలన్నింటిలోకీ అతి తక్కువ మరణాలు (వెయ్యికి లోపు) జపాన్‌లో నమోదయ్యాయి. కాస్త జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తే జపానీయులు మాస్క్ తప్పనిసరిగా ధరిస్తారు. కరచాలనాలు కాకుండా కాస్త వంగి గౌరవ వందనం పలకడం జపానీయుల సంప్రదాయం, సంస్కారం. ముప్పువార్త తెలిసిన వెంటనే జపాన్‌లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయడమూ వ్యాధి కట్టడికి ఎంతో ఉపకరించింది. జపాన్‌లో క్షయ, ఫ్లూ వంటి సమస్యలను పసిగట్టేందుకు శిక్షణ పొందిన 50 వేలమంది నర్సులు సదా సంచరిస్తుంటారు. కరోనా వైరస్ జాడలను పసిగట్టడానికీ వారే రంగంలోకి దిగారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు కరోనా వ్యాపించిన తరవాత ఇలాంటి ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపుతున్నాయి. కరోనాకు రెండోసారి తిరగబెట్టే లక్షణం ఉంది కాబట్టి జర్మనీ, జపాన్, వియత్నాం దేశాలు అప్పుడే సంబరపడకూడదని అక్కడి నిపుణులే హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వారి హెచ్చరికలు నిజమే అయినా కరోనాను ఎదుర్కోవడానికి ఈ మూడు దేశాలు అన్నివిధాల సంసిద్ధమనడంలో సందేహం లేదు. పైగా ఈ దేశాల్లో ఏ ఒక్కదాని జనాభా పది కోట్లకు మించకపోవడమూ కొవిడ్‌పై పోరుకు అనుకూలించే అంశం. పెద్ద జనాభా కలిగిన దేశాలకు ఇలాంటి వెసులుబాటు తక్కువే.
- ఏఏవీ ప్రసాద్