తెలంగాణ

telangana

ETV Bharat / opinion

విపత్తులను ఎదుర్కోవడంలో నేర్వాల్సిన పాఠాలెన్నో.. - environment disasters news

తరచూ విరుచుకుపడుతున్న తుపానులతో ఏర్పడే విపత్తులు భారీ ఆస్తి నష్టం కలిగిస్తున్నాయి. తీర ప్రాంత రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని అవి గుర్తుచేస్తున్నాయి. ఆ విషయంలో ప్రభుత్వ వ్యవస్థల ప్రణాళికలు దీర్ఘకాలంగా కార్యాచరణకు నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆరేళ్ల క్రితం నాటి హుద్‌హుద్‌ అనుభవాలతో తీరరక్షణకు పటిష్ఠమైన దీర్ఘకాలిక కార్యాచరణను అమలు చేయడంలో ప్రభుత్వ వ్యవస్థలు విఫలమయ్యాయనే చెప్పాలి. వాతావరణంలో పెను మార్పుల వల్ల తలెత్తే విపత్తులను మానవాళి ఎదుర్కోవడం అసాధ్యం. కానీ ముందస్తు జాగ్రత్తలతో నష్టప్రభావాలను తగ్గించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Lessons to be learned by governments in dealing with disasters
విపత్తులను ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు నేర్వాల్సిన పాఠాలెన్నో..

By

Published : Oct 14, 2020, 9:17 AM IST

బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడ్డ వాయుగుండంతో కురుస్తున్న భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాలకు తుపానులు కొత్తేమీ కాదు. తరచూ విరుచుకుపడుతున్న తుపానులతో ఏర్పడే విపత్తులు, భారీ ఆస్తి నష్టం కలిగిస్తున్నాయి. అవి తీర రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు, నష్ట ప్రభావాన్ని తగ్గించేందుకు తీరంలోని పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వ వ్యవస్థల ప్రణాళికలు దీర్ఘకాలంగా కార్యాచరణకు నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆరేళ్ల క్రితం అక్టోబర్‌ 13న తీరందాటి, తూర్పు కోస్తాతీరంపై విరుచుకుపడిన ‘హుద్‌హుద్‌’- గత వందేళ్లలోనే విధ్వంసకరమైన మహా తుపాను అని వాతావరణ నిపుణుల అంచనా. అది పట్టణ ప్రాంతాలను తాకి అత్యధిక నష్టం కలిగించింది. హుద్‌హుద్‌ అనుభవాలతో తీరరక్షణకు పటిష్ఠమైన దీర్ఘకాలిక కార్యాచరణను అమలు చేయడంలో ప్రభుత్వ వ్యవస్థలు విఫలమయ్యాయనే చెప్పాలి. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం, వాతావరణంలో పెనుమార్పులవల్ల తలెత్తే విపత్తులను మానవాళి ఎదుర్కోవడం అసాధ్యం. అయితే ముందస్తు ఏర్పాట్లతో నష్టప్రభావాలను తగ్గించే అవకాశాలు మెండుగా ఉంటాయన్న సంగతి విస్మరించకూడదు.

విధ్వంసంతో అపార నష్టం

మన దేశం భూభాగం వెంట 7,500 కి.మీ. మేర సముద్రతీర ప్రాంతం విస్తరించి ఉంది. తీరానికి 50 కి.మీ.లోపు 25 కోట్ల మేర జనాభా ఉంది. తీర ప్రాంతంలో విస్తరించిన మడ అడవులు, ఉప్పునీటి కయ్యలు, చిత్తడి నేలలతోపాటు అనేక రకాల ఇసుక నేలల్లో విశిష్టమైన జీవవైవిధ్య సంపద ఉంది. జనాభా పెరుగుదల, నగరీకరణ, అభివృద్ధి పేరిట తీరంలో విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణాలు, పరిశ్రమలు, ఓడరేవుల ఏర్పాటు వల్ల జీవవైవిధ్యంపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. తీరప్రాంతం ఎన్నో విపత్తులకూ కేంద్రబిందువుగా మారుతోంది. 1800-2000 మధ్య కాలంలో దేశంలో 320 తుపానులు ఏర్పడగా వాటిలో 110 వరకు తీవ్ర నష్టం కలిగించాయి. కోస్తా తీరంలో దివిసీమ (1977), కోనసీమ (1997), ఒడిశా (1999) తుపానులతోపాటు హుద్‌హుద్‌, తిత్లీ వంటివి తీరం వెంబడి ఉన్న ప్రాంతాలను విపరీతంగా దెబ్బతీశాయి. 2004 నాటి సునామీ దేశ తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. చరిత్రలో ప్రపంచంలో అత్యంత ఘోరమైన పది తుపానుల్లో కాకినాడ తీరం కోరింగ ఓడరేవు ప్రాంతంలో 1839లో ఏర్పడినది ఒకటిగా చెబుతారు. అప్పట్లో మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.

సన్నద్ధం కావాల్సిన వ్యవస్థలు

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు తీరప్రాంత పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. 60 శాతం జనాభా తీరప్రాంతంలో నివసిస్తున్న అమెరికా 1972 నుంచి తీర ప్రాంత నిర్వహణ కోసం ప్రత్యేక చట్టాలను అమలు చేస్తోంది. మన దేశంలో తీరప్రాంత పెట్టుబడుల కోసం చేపట్టిన అభివృద్ధి విధానాల్లో ఆ ప్రాంత పరిరక్షణ, నిర్వహణకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలు పొందుపరచకపోవడం ఆందోళనకరం. 1977లో దివిసీమ ఉప్పెన తరవాత రాష్ట్రంలో తీరం వెంబడి తుపానుల తాకిడి తగ్గించేందుకు సరుగుడు, యూకలిప్టస్‌ వంటి ఎత్తయిన మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఆ తరవాత వాటిని పునరుద్ధరించే చర్యలు చేపట్టలేదు. తుపానులను అడ్డుకునే మడ అడవులు, వనాలను రేవులు, పరిశ్రమలు, పర్యాటక పథకాల పేరిట ధ్వంసం చేయడంతో ముప్పు మరింత పెరిగింది. హుద్‌హుద్‌, తిత్లీ వంటి తుపానుల వల్ల నష్టాల భర్తీ కోసం వేల కోట్ల రూపాయల మేర ప్రపంచ బ్యాంకు, ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నా వాటిలో పారదర్శకత కొరవడిందన్న విమర్శలున్నాయి. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో తుపానులతో నష్టపోయిన ప్రాంతాల పునర్నిర్మాణ ప్రక్రియకు చట్టబద్ధత కల్పిస్తారు. వీటివల్ల ప్రభుత్వ వ్యవస్థలను జవాబుదారీ చేసే అవకాశం ఉంటుంది. మన దేశంలో అలాంటి విధానం లేదు. 2050 నాటికి సముద్రమట్టం పెరుగుదల వల్ల మన దేశంలో మూడు కోట్ల 60 లక్షల జనాభా తీవ్ర వరద తాకిడి సమస్య ఎదుర్కోవాల్సిన ముప్పుందని క్లెమేట్‌ సెంట్రల్‌ అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ]్యంలో తీర పరిరక్షణపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. తీరప్రాంత ప్రజల నివాసాలు సురక్షితంగా ఉండే రీతిలో ప్రణాళికలు అమలు చేయడం వంటి చర్యల ద్వారా తుపానుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా తీర ప్రాంత రక్షణపై దృష్టి సారించి తుపానుల్ని ధైర్యంగా ఎదుర్కొగలమనే భరోసా ప్రజల్లో కల్పించాలి.

నీరోడుతున్న నియంత్రణ

తీర ప్రాంత యాజమాన్యం, పరిరక్షణ పకడ్బందీగా ఉంటేనే తుపానులు, విపత్తుల నష్ట తీవ్రతను గణనీయంగా తగ్గించగల అవకాశం ఉంటుంది. దేశంలో తీరప్రాంత పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ చట్టం-1986కు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం 1991లో తీరప్రాంత నియంత్రణ నిబంధనల అమలుకు నోటిఫికేషన్‌ (సీఆర్‌జెడ్‌)ను తీసుకొచ్చింది. దీనిద్వారా తీరప్రాంతాల్లో చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నియంత్రించి అక్కడి పర్యావరణ వ్యవస్థలను కాపాడాలి. చేపల వేట కేంద్రాలు, రేవులు, వాణిజ్య నౌకా రవాణా, వన్యప్రాణి సంరక్షణ, జల సంరక్షణ, దేశ తీర రక్షణ, విదేశీ నౌకా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అనేక చట్టాలు తీరప్రాంత పరిరక్షణతో ముడివడి ఉన్నాయి. 1991లో అమలులోకి వచ్చిన సీఆర్‌జెడ్‌ నిబంధనలు అమలు చేయడంలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోంది. 1991-2003 మధ్యకాలంలో 12సార్లు ఆ నిబంధనలు సవరించి, అభివృద్ధి కార్యక్రమాల విస్తరణకు అనుమతించారు. సీఆర్‌జెడ్‌ నిబంధనలకు చట్టబద్ధత తీసుకొచ్చి, కోస్తా నియంత్రణను పటిష్ఠ పరచాలంటూ ఎం.ఎస్‌.స్వామినాథన్‌, పలు కమిటీలు ఇచ్చిన నివేదికలను పట్టించుకోలేదు. వీటిని నిర్వీర్యం చేస్తూ 2011లో ఒక నోటిఫికేషన్‌ తెచ్చారు. మళ్లీ గత ఏడాది వాటిని మార్చేసి కొత్త సీఆర్‌జెడ్‌ నిబంధనలు (2019) అమలులోకి తెచ్చారు.

(రచయిత-గంజివరపు శ్రీనివాస్, అటవీ పర్యావరణ రంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details