తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Galwan Clash: భారత్​ నేర్వాల్సిన పాఠాలు!

గల్వాన్‌ పరిణామాలను పరిశీలిస్తే భారత నిఘా సంస్థలు ఉదాసీన వైఖరితో వ్యవహరించినట్లు అనిపిస్తుంది. 2013 నాటికే చైనా సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద 640 చ.కి.మీ. ఆక్రమించుకొందని నాటి జాతీయ భద్రతా సలహాదారు శ్యామ్‌శరణ్‌ నివేదిక ఇచ్చినా ప్రభుత్వాలు మేల్కొనలేదు. 2016-2018 మధ్య వాస్తవాధీన రేఖ వెంట దాదాపు వెయ్యికి పైగా 'హద్దుమీరిన' ఘటనలు చోటు చేసుకొన్నట్లు పార్లమెంట్‌ రికార్డులు చెబుతున్నాయి.

Indian army
జవాన్లు, భారత్-చైనా సరిహద్దు

By

Published : Jun 15, 2021, 6:56 AM IST

భారత్‌- చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2020 ఏప్రిల్‌ నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ తరవాత రెండున్నర నెలల్లోనే ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. లద్దాఖ్‌ ఉద్రిక్తంగా మారింది. గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికులు పరస్పర ఘర్షణలకు దిగడంతో ఇరువైపులా ప్రాణనష్టం చోటుచేసుకొంది. గల్వాన్‌ ఘర్షణలకు జూన్‌ 15వ తేదీతో ఏడాది కావస్తోంది. నేటికీ అక్కడ యుద్ధవిమానాల రెక్కల చప్పుడు మార్మోగుతోంది. గల్వాన్‌ ఉదంతం భారత్‌కు చాలా పాఠాలు నేర్పింది. డ్రాగన్‌ దూకుడును ఎదుర్కోవాలంటే సైనిక, ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక అంశాల్లో చాలా ముందుచూపుతో వ్యవహరించాలన్న విషయాన్ని నొక్కిచెప్పింది. అది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన పాఠంగా నిలిచింది.

ఉదాసీన వైఖరి

గల్వాన్‌ పరిణామాలను పరిశీలిస్తే భారత నిఘా సంస్థలు ఉదాసీన వైఖరితో వ్యవహరించినట్లు అనిపిస్తుంది. 2013 నాటికే చైనా సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద 640 చ.కి.మీ. ఆక్రమించుకొందని నాటి జాతీయ భద్రతా సలహాదారు శ్యామ్‌శరణ్‌ నివేదిక ఇచ్చినా ప్రభుత్వాలు మేల్కొనలేదు. 2016-2018 మధ్య వాస్తవాధీన రేఖ వెంట దాదాపు వెయ్యికి పైగా 'హద్దుమీరిన' ఘటనలు చోటు చేసుకొన్నట్లు పార్లమెంట్‌ రికార్డులు చెబుతున్నాయి. 2020లో షింజియాంగ్‌-టిబెట్‌ను అనుసంధానించే జీ-219 రహదారి సమీపంలో చైనా బలగాలు యుద్ధవిన్యాసాలు నిర్వహించాయి. తరవాత సాయుధ వాహనాలు, శతఘ్నులను గోగ్రా, దెప్సాంగ్‌, గల్వాన్‌, ప్యాంగాంగ్‌ సమీప ప్రాంతాలకు తరలించింది. వీటికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. మే నెలలో ఇరు దేశాల దళాల మధ్య స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు గల్వాన్‌ నది వెడల్పు తగ్గించేందుకు భారీ యంత్రాలతో ప్రయత్నాలు సాగించడం మొదలుపెట్టింది. ఉపగ్రహ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అదనపు భూభాగం అందుబాటులోకి వస్తే వీలైనన్ని ఎక్కువ బలగాలను మోహరించవచ్చన్నది వ్యూహం.

డ్రాగన్‌ కొన్ని చోట్ల వాస్తవాధీన రేఖ దాటినట్లు వార్తలొచ్చాయి. ఆ క్రమంలో గత ఏడాది జూన్‌ 6న ఇరుపక్షాల కోర్‌ కమాండర్ల స్థాయిలో, జూన్‌ 10న మధ్యశ్రేణి సైనిక అధికారుల స్థాయిలో సమావేశాలు జరిగాయి. గల్వాన్‌ లోయలోని పీపీ15, హాట్‌స్ప్రింగ్స్‌ కొంత భాగంలో బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. అనంతరం చైనా బలగాల ఉపసంహరణ పరిశీలనకు వెళ్లిన కర్నల్‌ సంతోష్‌బాబు బృందం పాశవిక దాడికి గురైంది. వాస్తవానికి ఆ సమయంలో పరిశీలనకు డ్రోన్లు ఉపయోగించి ఉంటే చైనా బలగాల మోహరింపులు ముందే తెలిసి ఉండేవనే విమర్శలు వచ్చాయి.

కార్గిల్‌ వైఫల్యాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్‌టీఆర్‌ఓ) మన దళాలను ఎందుకు హెచ్చరించలేదో తెలియదు. ఈ సంస్థ అధీనంలో ఉపగ్రహాలు, డ్రోన్లు, సంకేతాలను విశ్లేషించే వ్యవస్థలు ఉన్నాయి. అదనంగా మరో నాలుగు నిఘా సంస్థలు ఉన్నాయి. అయినా కర్నల్‌ సంతోష్‌బాబు బృందాన్ని కాపాడుకోలేకపోయాం. సంక్షోభ సమయంలోనే ఆయుధాలను కొనుగోలు చేసే అలవాటు నుంచి భారత్‌ బయట పడలేదు. గల్వాన్‌ ఘర్షణల తరవాత హడావుడిగా 39 యుద్ధ విమానాలు, క్షిపణులు, రాకెట్‌ లాంఛర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. స్వాతంత్య్రం వచ్చాక అయిదు యుద్ధాలు చేసినా పాలకులు పాఠాలు నేర్చుకొన్నట్లు కనిపించడం లేదు.

'గల్వాన్‌ ఘర్షణ' తరవాతే నిఘా విషయంలో అప్రమత్తత పెరిగింది. ఆగస్టులో కైలాస్‌ రేంజిలో చైనా బలగాల అనుమానాస్పద కదలికలను మన సైన్యం గుర్తించింది. దీంతో మెరుపు వేగంతో కీలక శిఖరాలను స్వాధీనం చేసుకొంది. ఆ ఆధిపత్యమే ప్యాంగాంగ్‌ సరస్సుకు ఇరువైపులా చైనా దళాలను ఖాళీ చేయించడానికి తురుఫుముక్కలా ఉపయోగపడింది. చైనా విషయంలో అనుసరించిన విభిన్న వ్యూహం ఇదే. మరోవైపు, భారత్‌ సరిహద్దుల్లో తన ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, లద్దాఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో నిర్మిస్తున్న 32 రహదారి ప్రాజెక్టులకు రూ.12,434 కోట్లు కేటాయించింది.

కొనసాగుతున్న ఉద్రిక్తత

ఇప్పటికీ గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌, దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌లలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఈ ఏడాది మళ్లీ చైనా దళాలు యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టాయి. వాస్తవానికి గత జులైలోనే గోగ్రా, హాట్‌స్ప్రింగ్‌ వద్ద బలగాలు వెనక్కి వెళ్లడంపై అవగాహన కుదిరినా అమలు కాలేదు. వీటితో పోల్చుకుంటే దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌ వివాదం కాస్త పాతది. దెప్సాంగ్‌లో 2013, 2017లలో కూడా ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఇక్కడి గస్తీ కేంద్రాలకు భారత దళాలు వెళ్లకుండా చైనా సేనలు అడ్డుకుంటున్నాయి. ఈ మార్గంలోని 'వై' కూడలి వద్ద చైనా బలగాల పట్టు కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. భారత సైన్యం వీటిని అంగీకరించడం లేదు. హాట్‌స్ప్రింగ్స్‌లో రెండుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పరస్పర విశ్వాసం కొరవడటంతో ఇక్కడ బలగాల ఉపసంహరణ వ్యవహారం నిదానంగా ఉందని సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ పేర్కొనడం వాస్తవిక పరిస్థితికి అద్దం పట్టింది.

మరికొన్ని వారాల్లో ఇరుదేశాల కోర్‌కమాండర్లు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. కైలాస్‌ రేంజి మాదిరిగానే ఇక్కడ భారత్‌ వ్యూహాత్మక ప్రదేశాలను దక్కించుకొని చర్చలకు వెళ్లే అవకాశం లేదని గతంలో నార్తర్న్‌ కమాండ్‌ అధిపతిగా వ్యవహరించిన లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌.ఎస్‌.పనాగ్‌ అభిప్రాయపడ్డారు. కొన్నిచోట్ల బఫర్‌ జోన్ల ఏర్పాటుతో అవగాహన కుదిరితే భారత్‌ ముందడుగు వేయవచ్చు. ఇవేవీ సాధ్యం కానిపక్షంలో చైనాతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూనే.. వాస్తవాధీన రేఖ వద్ద బలగాలను మోహరించాల్సి ఉంటుందంటున్నారు. మొత్తానికి చైనా బలగాల ఆక్రమణ చిన్నదైనా, పెద్దదైనా భారత్‌ స్పందన ఒకే స్థాయిలో ఉండాలన్న విలువైన పాఠాన్ని గల్వాన్‌ ఉదంతం నేర్పింది.

క్వాడ్ దేశాలు

పదునెక్కిన 'క్వాడ్‌'

గల్వాన్‌ ఘర్షణల నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో భారత్‌ సఫలమైంది. రష్యా ఇరువర్గాలకు సమదూరం పాటించినా- ఫ్రాన్స్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాలు భారత్‌ పక్షాన నిలిచాయి. అమెరికా క్వాడ్‌ కూటమికి కోరలు తొడిగే పనిని వేగవంతం చేయగా, భారత్‌ సహకరించింది. మలబార్‌ యుద్ధ విన్యాసాల్లో ఆస్ట్రేలియా కూడా చేరేందుకు దిల్లీ పచ్చజెండా ఊపడం ఇందుకు నిదర్శనం. శత్రువుల కదలికలకు సంబంధించిన భౌగోళిక సమాచారం పొందేలా అమెరికాతో 'బెకా ఒప్పందం'పై భారత్‌ సంతకం చేయడం డ్రాగన్‌ను కలవరానికి గురిచేసే పరిణామం. మరోవైపు భారత్‌ విధించిన పరోక్ష ఆంక్షల ఫలితంగా చైనా కంపెనీలకు చెందిన 200 కోట్ల డాలర్ల విలువ చేసే 150 ప్రతిపాదనలు నిలిచి పోయాయి. దాదాపు 223 చైనా యాప్‌ల నిషేధం కూడా చెప్పుకోదగిన చర్యే.

- పెద్దింటి ఫణికిరణ్‌

ఇదీ చదవండి:గల్వాన్​ ఘటనకు ఏడాది.. మరువలేనివి సైనికుల త్యాగాలు

ABOUT THE AUTHOR

...view details