తెలంగాణ

telangana

ETV Bharat / opinion

జన భాగస్వామ్యంతోనే పోరు- అవగాహనతోనే ఆరోగ్యం - తాజా వార్తలు కరోనా

కొత్త సవాళ్ల నేపథ్యంలో ఇప్పుడున్న ఆరోగ్య వ్యవస్థలు, చికిత్సా విధానాలు కొరగానివిగా మిగిలే అవకాశం ఉంది. మారుతున్న సామాజిక, పర్యావరణ, జనాభా తీరుతెన్నులకు అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థలు సమూలంగా మారాల్సి ఉంది. అత్యాధునిక మౌలిక సౌకర్యాలు, దీటైన వనరులు, అత్యాధునిక నైపుణ్యాలతోనే ముంచుకొచ్చే ముప్పులను ఎదుర్కోవడం సాధ్యం. అన్నింటికీ మించి ఆరోగ్య వ్యవస్థలను మెరుగ్గా నిర్వహించుకోవడం చాలా అవసరం.

CORONA VIRUS
జన భాగస్వామ్యంతోనే పోరు- అవగాహన పెరిగితేనే ఆరోగ్యం

By

Published : Dec 11, 2020, 5:45 AM IST

ప్రతి సంక్షోభమూ ఓ కొత్త పాఠం నేర్పుతుంది. సమస్యలు ముసిరినప్పుడు అడుగులు తడబడతాయి. గమ్యం మసకబారుతుంది. ఇబ్బందులు అధిగమిస్తూ, తెలివిగా, సహనంగా ముందుకు కదిలితే మబ్బుతెరలు వీడిపోతాయి. సమస్యలకు ముకుతాడు పడుతుంది. ఒక్కో సమస్య ఒక్కో పాఠం చెబుతుంది. పరిష్కారాలు చూపుతుంది. కావలసిందల్లా తెలుసుకోవాలన్న తపన, నేర్చుకునే నైపుణ్యమే! ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మానవాళి ముందు అనేక ప్రశ్నలు ఉంచింది. భవితపై భయాలను రేకెత్తించింది. గడచిన అనేక శతాబ్దాలుగా మానవాళిని అంటువ్యాధులు చెండుకుతింటూనే ఉన్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే కొవిడ్‌ భయంకరమైనది. ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య వాతావరణాన్ని కకావికలం చేసిన వైరస్‌ ఇది. అభివృద్ధి రథాన్ని ఒక్కపెట్టున నిలువరించిన ఎదురుదెబ్బ ఇది!

మునుపెన్నడూ లేని స్థాయిలో ఆరోగ్య కార్యకర్తల సేవలు, అంటువ్యాధులపై పోరాటం సాగించే సామాజిక సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తు న్నాయిప్పుడు. స్వల్ప కాలావధిలో కరోనా సృష్టించే ఇబ్బందులు ఏమిటో దాదాపుగా ఇప్పటికే తేటపడ్డాయి. దీర్ఘకాలంలో కరోనా ప్రభావం పడి ఆరోగ్య రంగం, దేశాల అభివృద్ధి, ఉద్యోగిత, ప్రణాళికా ప్రాథమ్యాలు ఎలా మారతాయన్నది ఇంకా అంతుపట్టనిదిగానే ఉంది. పర్యావరణాన్ని ఛిద్రం చేసిన పాపం మనిషిని ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ ప్రపంచాన్ని వణికించిన ప్రతి అంటువ్యాధికీ- పర్యావరణంతో సంబంధం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో మనిషి అలక్ష్యానికి ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో కరోనా మానవాళికి తగిలిన అతిపెద్ద ఎదురుదెబ్బ. కరోనా నిష్క్రమణ తరవాత- ప్రజలు, ప్రభుత్వాలు ఉమ్మడిగా తీసుకోబోయే నిర్ణయాలే రేపటి ప్రపంచాన్ని శాసించనున్నాయి.

కొత్త సవాళ్ల నేపథ్యంలో ఇప్పుడున్న ఆరోగ్య వ్యవస్థలు, చికిత్సా విధానాలు కొరగానివిగా మిగిలే అవకాశం ఉంది. మారుతున్న సామాజిక, పర్యావరణ, జనాభా తీరుతెన్నులకు అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థలు సమూలంగా మారాల్సి ఉంది. అత్యాధునిక మౌలిక సౌకర్యాలు, దీటైన వనరులు, అత్యాధునిక నైపుణ్యాలతోనే ముంచుకొచ్చే ముప్పులను ఎదుర్కోవడం సాధ్యం. అన్నింటికీ మించి ఆరోగ్య వ్యవస్థలను మెరుగ్గా నిర్వహించుకోవడం చాలా అవసరం. పాత ఆయుధాలతో కొత్తశత్రువులపై యుద్ధం చేయడం కుదిరే పనికాదు. కరోనా అంతు పట్టని సవాళ్లను మన ముందు నిలిపింది. ఆరోగ్య వ్యవస్థలను, విధానాలను సమూలంగా మార్చుకోక తప్పని చారిత్రక అవసరాన్ని సృష్టించింది. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయం అంతంతమాత్రం కావడం అన్నింటినీ మించి వేధిస్తున్న అంశం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను పీడిస్తున్న సమస్య ఇది. అంటువ్యాధులు భయపెడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజారోగ్యం తీరుతెన్నులపై నిరంతర నిఘా, పరిశీలన తప్పనిస రి. ఎక్కడ ఏ మూల ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా, దాన్ని వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యే యంత్రాంగం కావాలి. అంటువ్యాధుల గురించి, వాటి బారినుంచి తమను తాము రక్షించుకొనే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను నిరంతరం చైతన్యపరచాలి. ఆ మేరకు ఇప్పటివరకూ నిర్వహించిన ప్రచారం, చైతన్య కార్యక్రమాలు ప్రజావళిలో అవసరమైన మార్పును సాకారం చేయలేకపోయాయి.

ఇప్పటికీ మెజారిటీ జనాభా మాస్కులకు దూరంగానే ఉన్నారు. శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకుంటున్నవారు అరుదుగా తప్ప కనిపించడం లేదు. పదేపదే వివిధ మాధ్యమాల ద్వారా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తున్నా- ఆ విషయాలు ప్రజల్లో ఆశించిన మార్పు ఎందుకు తేవడం లేదన్న విషయాన్నీ పరిశీలించాలి. ఆ మేరకు సమీక్షించుకొని ప్రచార వ్యూహాలను మార్చుకోవాలి. కఠినమైన శిక్షలు విధిస్తామని భయపెట్టడం ద్వారా ప్రజల్లో మార్పు సాధించలేం. అంటువ్యాధులనుంచి తమను తాము కాపాడుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తల ఆవశ్యకతను వారికి అర్థమయ్యేలా వివరించాలి. దాని వెనక ఉన్న శాస్త్రీయ కారణాలను, తార్కికతను విడమరచి చెప్పాలి. ప్రజల్లో పునరాలోచన ప్రారంభమైనప్పుడే మహమ్మారులపై విజయం సాధ్యపడుతుంది. సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవడం ఇప్పుడు సర్వత్రా ఒక తప్పనిసరి అలవాటుగా మారింది. సబ్బునీటితో చేతులు కడుక్కుంటే వ్యాధికారక వైరస్‌లు, బ్యాక్టీరియాలను అంతమొందించవచ్చునన్న అవగాహన పెరగడమే ఇందుకు కారణం. ప్రజలకు శాస్త్రీయ విషయాలను సులభశైలిలో వివరించి, అంటువ్యాధులపై పోరాటంలో వారిని ప్రభుత్వాలు, పౌర సంఘాలు తమతో నడిపించుకువెళ్లాలి. ఆ క్రమంలో ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంచాలి. అవసరమైన సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు అందించి, చైతన్యపరచాలి. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే కరోనా వంటి అంటువ్యాధులను శాశ్వతంగా తుడిచిపెట్టడం సాధ్యం!

- డాక్టర్‌ అనిల్‌ కృష్ణ గుండాల (హృద్రోగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details