తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Covid-19: కరోనాపై పోరులో ఆత్మపరిశీలనకు సమయమిది! - మశూచి

1918లో స్పానిష్‌ ఫ్లూ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. సుమారు వందేళ్ల తర్వాత- కరోనా వైరస్‌ దాదాపు అన్ని దేశాలనూ గడగడలాడిస్తోంది. ఈ రెండూ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులే. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మెరుగైన భవిష్యత్తును నిర్మించడం కష్టమని కరోనా మహమ్మారి వల్ల తెలిసొచ్చింది. ఇక ఇప్పుడైనా మెలుకొని వైరస్​కు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకోవాలి.

corona, pandemic
కరోనా, అంటువ్యాధులు

By

Published : Jun 11, 2021, 7:23 AM IST

చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మెరుగైన భవిష్యత్తును నిర్మించడం కష్టం. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. గతంలో పలు రకాల అంటువ్యాధుల విజృంభణను చవిచూసిన భారత్‌- వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొంది. ఆ అనుభవాలను మేళవించి, ఆధునిక సాంకేతికత దన్నుతో కరోనాపై పోరు సాగించాల్సి ఉండగా... దురదృష్టవశాత్తు మన వ్యవస్థలు ఈ దిశగా ముందుకు కదలలేదు. 1918లో స్పానిష్‌ ఫ్లూ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. సుమారు వందేళ్ల తరవాత- కరోనా వైరస్‌ దాదాపు అన్ని దేశాలనూ గడగడలాడిస్తోంది. ఈ రెండూ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులే. విదేశీ ప్రయాణికుల ద్వారానే ఈ వైరస్‌లు దేశంలోకి ప్రవేశించాయి.

నాడు స్పానిష్‌ ఫ్లూ దెబ్బకు ఉపాధిని సైతం వదిలేసి ప్రజలు నగరాలను వీడి సొంతూళ్లకు పయనమయ్యారు. 2020లోనూ ఇదే జరిగింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వలసకూలీల జీవనాన్ని దారుణంగా దెబ్బతీసింది. స్పానిష్‌ ఫ్లూ రెండో దశ ఉద్ధృతి ప్రపంచ దేశాలను వణికించింది. ప్రస్తుతం భారత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అప్పట్లో 50 కోట్ల మందికి పైగా ప్రజలకు ఫ్లూ సోకింది. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు బాధితులే. 1920 ఏప్రిల్‌ వరకు నాలుగు దశలుగా స్పానిష్‌ ఫ్లూ విజృంభించింది. మరణాల రేటు ప్రపంచ జనాభాలో రెండు శాతమని అంచనా. భారత్‌లో 5.2శాతం జనాభా అప్పట్లో ఆ మహమ్మారికి బలయ్యారు.

వ్యవస్థల వెనకబాటు

మహమ్మారులను ఎదుర్కొనేందుకు శతాబ్దం ముందు కంటే ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయనడంలో అనుమానం లేదు. అప్పట్లో వైద్య వ్యవస్థ విస్తరించలేదు. ఐసీయూలు, వెంటిలేటర్లు, టీకాలువంటివి లేవు. స్పానిష్‌ ఫ్లూ కంటే ముందు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉండేవారు. ఈ పరిస్థితుల్లో ఫ్లూ నుంచి రక్షణ కోసం సామాజిక దూరాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్నారు.

ప్రస్తుతం ఆధునిక సాంకేతిక రంగం గణనీయంగా విస్తరించినా- సరైన చికిత్స అందని రోగుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. జీవనపోరాటంలో వలసకూలీల వ్యధ కళ్లకు కడుతోంది. అన్ని రంగాల్లో ఆధునికత కొత్తపుంతలు తొక్కినా సగటు మనిషి జీవించేహక్కుకు భరోసానివ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం చొరవ చూపలేకపోయాయి. అప్పుడూ, ఇప్పుడూ దహన సంస్కారాలకు సైతం నోచుకోకుండా, గంగానదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన మృతదేహాలు ఇందుకు ప్రబల నిదర్శనాలు. భారత్‌లో 2020లో సవరణలు చేసే వరకు 1897 అంటువ్యాధుల చట్టాన్నే కేంద్రం నమ్ముకోవడం పరిస్థితుల తీవ్రతకు అద్ధం పడుతోంది. ఈ వ్యవహారంలో బ్రిటిషర్లకు, ప్రజలు ఎన్నుకొన్న ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తక్షణ చర్యలతోనే అడ్డుకట్ట

సమగ్ర టీకా విధానాలను రూపొందించి అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. విలువైన సమయాన్ని వృథా చేసింది. అత్యున్నత న్యాయస్థానం సైతం టీకా విధానంపై కేంద్రం అహేతుకంగా వ్యవహరించిందని తప్పుపట్టింది. ఆ తరవాత కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు దాటినవారికందరికీ ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించినా- 25శాతం టీకాల వాటాను ప్రైవేటు రంగానికి ఇచ్చింది. ఇది కూడా అసమానతలకు దారితీసే చర్యే. ఎందుకంటే టీకాల బాధ్యత పూర్తిగా ప్రభుత్వపరమైందే. ప్రజలు, సంస్థలు, రాజకీయ శత్రువులు కూడా ఐకమత్యంతో ఉంటూ పోరాడేందుకు సంక్షోభ సమయం ఓ మంచి అవకాశం. కానీ రాష్ట్రాలు- కేంద్రం మధ్య కరోనా మహమ్మారి దూరం పెంచేసింది. టీకా పంపిణీలో అవకతవకలు, అధిక ధరలు, ఆక్సిజన్‌-ఔషధాల కొరత వంటివి సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తాయి. ఇప్పటికే ఈ తరహా లోపాలతో ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టాలి. దేశంలోని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు, విశ్రాంత దౌత్యవేత్తలు, ప్రముఖులు ప్రధానమంత్రికి ఇంచుమించు రోజూ లేఖల ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. సరైన విధానాలను అనుసరించాలని అభ్యర్థిస్తూనే ఉన్నారు. వీరి సూచనలను ప్రభుత్వం పరిగణించకపోతే అనర్థాలు తప్పవు. కరోనాపై పోరులో భాగంగా భవిష్యత్తు వినాశనాన్ని అడ్డుకోవాలంటే కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాలను ఒకతాటిపైకి తీసుకురావాల్సిన తరుణమిది. వైద్య నిపుణులు, కార్పొరేట్లు, ప్రజాసంస్థలు, స్వచ్ఛంద సేవాసంస్థలతో విస్తృతంగా చర్చించి, వారి భాగస్వామ్యంతో ప్రజలను కాపాడే కార్యక్రమాలతో ముందుకు సాగడం అత్యావశ్యకం.

స్ఫూర్తినిచ్చిన చరిత్ర

పోలియో

స్వాతంత్య్రం అనంతరం మశూచి, పోలియో వ్యాధులపై భారత్‌ ఘన విజయం సాధించి ప్రపంచదేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. దేశం నుంచి వీటిని తరిమికొట్టడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో వ్యూహాలు రచించి, అమలు చేసింది. 1967లో మశూచి కేసులు దాదాపు 84వేలకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో అది 65శాతం. 26వేలకు పైగా ప్రజలు మశూచికి బలయ్యారు. 1974లో మరోమారు ఆ వ్యాధి విజృంభించి, 31,262 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సహాయం తీసుకుంటూనే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం వ్యాధిని నిర్మూలించగలిగింది. ఇందులో భాగంగా 30లక్షలమంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, 20 నెలల వ్యవధిలో 5.75లక్షల గ్రామాలు, 2,641 నగరాలు-పట్టణాల్లోని పది కోట్ల ఇళ్లకు తిరిగారు. కేసులను నివేదించే విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని కేంద్రం కఠినంగా తేల్చిచెప్పింది. ఇది వ్యాధి నిర్మూలనలో కీలకంగా మారింది.

కంప్యూటర్లే లేని కాలంలో వైరస్‌ కేసులను లెక్కించి, విశ్లేషించి, చర్యలు చేపట్టడం వేగంగా జరిగింది. ఫలితంగా దేశంలో 1975 మే 17 తరవాత ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదు. పోలియోపైనా భారత్‌ ఇలాంటి యుద్ధమే చేసింది. లక్ష్యం పట్ల అంకితభావం, రాజకీయంగా బలమైన సంకల్పాన్ని కనబరిచింది. 2009లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలియో కేసుల్లో భారత్‌ వాటా 60శాతం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం రంగంలోకి దిగింది. ఫలితంగా 2011 తరవాత కేసులు చాలావరకు తగ్గిపోయాయి. అప్పట్లో కేంద్రం నిపుణుల సలహా బృందాన్ని(ఐఈఏజీ) ఏర్పాటు చేసి వ్యూహాలు రచించింది. వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని అన్ని రాష్ట్రాలకూ అదేశాలు జారీ చేసింది. దేశం నుంచి పోలియోను తరిమికొట్టేంతవరకు నిర్విరామంగా శ్రమించింది. ఆ అంకితభావం నేడు కొరవడింది. ఫలితంగా కరోనా రెండో దశ దండయాత్ర నుంచి దేశాన్ని రక్షించడంలో విఫలమైంది.

- డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌. జ్యోతి కుమార్‌ (మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాఖాధిపతి).

ఇదీ చదవండి:'టీకాలనూ తప్పించుకునే వైరస్‌ రకాలు'

ABOUT THE AUTHOR

...view details