తెలంగాణ

telangana

By

Published : Aug 11, 2021, 5:16 AM IST

ETV Bharat / opinion

చట్టసభల్లో నేరస్థులు-ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు!

నేర చరిత్ర కలిగినవారిని రాజకీయ పార్టీలు చట్టసభలకు పంపే పెడధోరణి ఏటికేడు పెరగడం ఆందోళనకరం. ఈ పోకడను న్యాయస్థానాలు ఏళ్లుగా ఎండగడుతూ వస్తున్నా పెద్దగా మార్పు ఉండటం లేదు. రాజకీయాల్లోంచి నేరగాళ్ల ఏరివేతకు చర్యలు తీసుకోకపోతే 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి అర్థం లేకుండా పోతుంది.

supreme court
సుప్రీం కోర్టు

'ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు, ధనాఢ్యుల దౌర్జన్యాలు, అధికార యంత్రాంగం అసమర్థత.. స్వాతంత్య్రం సంప్రాప్తించగానే ఇవన్నీ మన జీవితాలను దుర్భరం చేసేస్తాయి'- 99 ఏళ్ల క్రితమే స్వతంత్ర భారత భవిష్యత్తుకు బొమ్మకట్టిన సి.రాజగోపాలాచారి జైలుడైరీలోని అక్షరాలివి. ఆయన ఆందోళనను నిజంచేస్తూ నేరగ్రస్త రాజకీయాల పాలబడిన భారతావనిలో రాజ్యాంగ ఆదర్శాలన్నీ చాపచుట్టుకుపోతున్నాయి. సిద్ధాంతాలకు అతీతంగా అన్ని పార్టీలూ నేరగాళ్లను నేతలుగా తీర్చిదిద్దుతున్నాయి. ప్రజాస్వామ్య పునాదులనే పెళుసుబార్చే ఈ పెడపోకడలను సుప్రీంకోర్టు ధర్మాసనాలు కొన్నేళ్లుగా తూర్పారపడుతూనే ఉన్నాయి. అక్షింతలెన్ని పడ్డా దులపరించేసుకోవడంలో ఆరితేరిపోయిన రాజకీయ పక్షాలకు సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కొర్రుకాల్చి వాతపెట్టింది. అభ్యర్థుల నేరచరిత్రలను ముందుగానే ప్రకటించాలన్న తన తీర్పునకు నిరుటి బిహార్‌ ఎన్నికల్లో జెల్లకొట్టిన పార్టీలకు జరిమానాలు వడ్డించింది. ఎన్సీపీ, సీపీఐ(ఎం) చెరో రూ.అయిదు లక్షలు; భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ, జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీలు తలా లక్ష రూపాయల వంతున అపరాధ రుసుం చెల్లించాలన్న 'సుప్రీం' నిర్దేశం సంచలనాత్మకం.. దుర్రాజకీయాలపై న్యాయపాలిక ఆవేదనకు ప్రతిబింబం!

వ్యవస్థకు శస్త్రచికిత్స..

నేరచరితులను చట్టసభలకు పంపకుండా నియంత్రించడంలో కలిసిరావడానికి నిరాకరిస్తున్న పార్టీలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. నేరమూ రాజకీయమూ సయామీ కవలలైన దుస్థితిని ప్రక్షాళన చేయాలని ఉన్నా- వ్యవస్థల మధ్య అధికారాల విభజన తమ చేతులను కట్టేస్తోందని వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన 48 గంటల్లోగా వారి నేరచరిత్రలను పార్టీలే బహిర్గతం చేయాలన్న సుప్రీంకోర్టు- సంబంధిత సమాచారం ఓటర్లకు చేరేలా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. లోక్‌సభలో 43శాతం, రాష్ట్రాల శాసనసభల్లో లెక్కకుమిక్కిలిగా హేయ నేరాభియోగ చరితులు కొలువుతీరిన దుస్థితి సమసిపోవాలంటే 'సుప్రీం' ఆశిస్తున్నట్లు- వ్యవస్థకు శస్త్రచికిత్స తప్పనిసరి! ఆ మేరకు పటిష్ఠ నిబంధనలతో ప్రత్యేక చట్టాన్ని పార్లమెంటు పట్టాలకెక్కించాలి. నేరగ్రస్త రాజకీయాలకు అంటుకట్టడంలో ఒకే తానుముక్కలైన పార్టీలు ఇందుకు ముందుకొస్తాయా అన్నదే చిక్కుప్రశ్న!

ఏటికేడు పెరుగుతున్న ధోరణి..

ప్రజల సుఖసంతోషాలను ద్విగుణీకృతం చేసేవే నిజమైన రాజకీయాలని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నిర్వచించారు. తద్భిన్నంగా జనావళిని భయభ్రాంతులకు గురిచేసే నేరగాళ్లెందరో నేడు నాయకులుగా చలామణీ అవుతున్నారు. 22 రాష్ట్రాలకు చెందిన తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై 4442 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నిరుడే వెల్లడైంది. 2018-20 మధ్య ఈ కేసుల సంఖ్య 17శాతం ఎగబాకిందని అమికస్‌క్యూరీ విజయ్‌ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక కుండ బద్దలుకొట్టింది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై కేసులను ఏకపక్షంగా ఎత్తేస్తున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైనా ఆందోళన వ్యక్తంచేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకొన్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం- హైకోర్టుల అనుమతి లేనిదే ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత కూడదని తాజాగా తీర్పిచ్చింది. చట్టసభల సభ్యులు నిందితులైన కేసులను విచారించే ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేయకూడదన్న 'సుప్రీం' ఆదేశాలూ విశిష్టమైనవే.

వారు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు!

హత్యలు మొదలు అత్యాచారాల వరకు, అపహరణల నుంచి మనీలాండరింగ్‌ దాకా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రజాప్రతినిధులై చట్టనిర్మాతలు కావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు! అక్రమార్కులైన నేతలను వదిలించుకోవడంలో విదేశాలెన్నో స్ఫూర్తిదాయక మార్గాలను అనుసరిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా అవినీతి వ్యవస్థీకృతమైన ఇండియాలో మకిలి రాజకీయాలు పోనుపోను ముమ్మరిస్తున్నాయి. వాటికి తెరదించేలా సుప్రీంకోర్టు వెలువరించిన కీలక ఉత్తర్వులు- ప్రజాస్వామ్యహితైషుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. వాటిని ఫలవంతం చేస్తూ రాజకీయాల్లోంచి నేరగాళ్ల ఏరివేతకు పార్టీలన్నీ ప్రతినబూనితేనే స్వాతంత్య్ర అమృతోత్సవాలు అర్థవంతమవుతాయి!

ఇవీ చూడండి:

'హైకోర్టుల అనుమతి ఉంటేనే నేతలపై​ కేసులు వాపస్'

నేర చరిత్ర వివరాలేవి? భాజపా, కాంగ్రెస్​కు జరిమానా!

ABOUT THE AUTHOR

...view details