భూమిని మానవులు వినియోగిస్తున్న తీరులో ఉన్న లోపాలు ప్రకృతి విపత్తులకు కారణమౌతున్నాయి. ఏ భూమిని ఏ విధంగా వినియోగించాలనే విధానమే మనకు లేదు. వ్యవసాయ భూముల్లో భవనాలు పుట్టుకొస్తున్నాయి! చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. లేఅవుట్లు వెలుస్తున్నాయి. అడవులు మాయమవుతున్నాయి. పల్లెలు పట్టణాలవుతున్నాయి. లక్షల ఎకరాల వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు మారుతున్నాయి. ఈ భూగోళంపై ఉన్న భూమి అయిదోవంతు మాత్రమే. భారత్‌లో 1950-51 సంవత్సరంలో తలసరి భూమి 0.48 హెక్టార్లు (1.18 ఎకరాలు). ఇది కాస్త 2007-08 నాటికి 0.16 హెక్టార్ల(0.39 ఎకరాల)కు పడిపోయింది.
కార్యాచరణ అవసరం..
భూ వినియోగ ప్రణాళికలు తక్షణ అవసరమని కేంద్రప్రభుత్వం 2009లో ఏర్పాటు చేసిన 'వ్యవసాయ సంబంధాలు, అసంపూర్ణ భూ సంస్కరణల' కమిటీ పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ 1988లో జాతీయ భూ వినియోగ విధాన మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. ఈ మార్గదర్శకాలు ఎలాంటి ఫలితాలను సాధించలేదు. 170 దేశాలు అంగీకరించిన 'సుస్థిర అభివృద్ధి వ్యూహం అజెండా'లో భూవినియోగ ప్రణాళికలు కీలకం. ప్రపంచ దేశాలు 2030 నాటికి సాధించాలని నిర్దేశించుకున్న 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనలోనూ భూవినియోగ ప్రణాళికలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భూమి వినియోగం ప్రణాళికాబద్ధంగా లేనట్లైతే ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతుంది. జీవనోపాదులకు నష్టం కలుగుతుంది. నీరు, వాయు కాలుష్యం పెరుగుతుంది. జీవవైవిద్యం దెబ్బతింటుంది. పారిశ్రామిక, పర్యావరణ ప్రమాదాలు పెరుగుతాయి.
జాతీయ భూ వినియోగ విధానంపై కేంద్రం 2013లో ముసాయిదాను రూపొందించింది. రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా భూ వినియోగ విధానాలు రూపొందించుకోవడానికి మార్గదర్శకంగా ఉండటంకోసం ఈ ముసాయిదా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు, చట్టాలు, ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆ మార్గదర్శక సూత్రాల్లో మనుషులు పర్యావరణహితకరమైన విధానాలను అనుసరిస్తూ జీవించడం ప్రధానం. ప్రస్తుత, రాబోయే తరాల ఆర్థిక, సామాజిక, పర్యావరణ అవసరాలను సమతుల్యపరచుకొంటూ అభివృద్ధికి బాటలు వెయ్యాలి. సాధ్యమైనంతవరకు వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలే భూమికి రక్షణ కల్పించాలి. పారదర్శకమైన, సమగ్ర భూ విధానాల రూపకల్పనకు కావలసిన చట్టాలను, విధానాలను రాష్ట్రాలు రూపొందించుకోవాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను, విధానాలను సమన్వయ పరుచుకోవాలి. ఈ ముసాయిదా ప్రకారం దేశాన్ని ఆరు ప్రధాన భూ వినియోగ జోన్లుగా విభజిస్తారు. ఈ జోన్లలో ఉన్న భూమిని నిర్దేశించిన అంశంకోసమే వినియోగించాలి. ఉదాహరణకు, వ్యవసాయ జోన్లు భూమిని ప్రధానంగా సాగుకోసమే వినియోగించాలి. ఈ విధానం అమలు చెయ్యడానికి కేంద్రంలో ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో భూ వినియోగ కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో, రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలోనూ భూవిధాన కమిటీ ఏర్పాటవుతుంది.