తెలంగాణ

telangana

ETV Bharat / opinion

తెలుగు రాష్ట్రాల వారసత్వ కట్టడాలకు కొరవడిన రక్షణ

తెలుగు రాష్ట్రాల్లోని అనేక చారిత్రక వారసత్వ కట్టడాలు నేటి తరాలకు దూరమైపోయే స్థితిలో ఉన్నాయి. వాటికి తగిన ప్రాధాన్యం దక్కకపోవడమే కారణం. ఆక్రమణలు జోరుగా జరుగుతుండటం, చిత్తశుద్ధి కొరవడటం వల్ల అనేక ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని సూచిస్తున్నారు.

historical monuments
చారిత్రక సంపదకు నిర్లక్ష్యం చెదలు

By

Published : Nov 22, 2021, 3:47 AM IST

భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటుతున్న భారతదేశం- ప్రాచీన సంస్కృతీసంప్రదాయాలు, చారిత్రక వారసత్వ కట్టడాలకు నిలయం. అపురూపమైన శిల్ప సంపదను కళ్లకు కట్టే ఆలయాలు, కనువిందు చేసే కళాకృతులు లెక్కకు మిక్కిలిగా ఇండియాలో ఉన్నాయి. అలనాటి పాలకులు, కళాపోషకులు ఎంతో మక్కువతో, ఏళ్ల తరబడి శ్రమించి నిర్మించి మనకందించిన ఆ అపురూప వారసత్వ కానుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి పాలకులు, దేశ పౌరులుగా మనందరిపై ఉంది. వాటికి తగిన ప్రాధాన్యం దక్కకపోవడం వల్ల నేటి తరాలకు దూరమైపోతున్నాయి. చారిత్రక కట్టడాలు, ప్రదేశాల ప్రాముఖ్యాన్ని వివరించేందుకు ఏటా నవంబరు 19 నుంచి 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలను యునెస్కో నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాలు, సహజ వింతలు దేశీయంగా 40దాకా ఉన్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలో ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయం ఒక్కటే కనిపిస్తుంది. కాకతీయ సామంతరాజు రేచర్ల రుద్రుడి హయాములో 13వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయానికి ఈ ఏడాది జులైలో ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడం ప్రస్తుతం ప్రధాన అంశం.

జోరుగా ఆక్రమణలు

యునెస్కో కొన్ని షరతులు విధించిన తరవాతే వారసత్వ హోదా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో రామప్ప ఆలయంలో 2022 డిసెంబరు ఒకటి నాటికి పూర్తి చేయవలసిన పనులెన్నో ఉన్నాయి. గుర్తింపు దక్కి నాలుగు నెలలు గడుస్తున్నా నిర్దేశిత అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రధాన ఆలయానికి కుడి భాగంలో శిథిలమైన కామేశ్వరాలయంతోపాటు త్రికూటాలయం, గొల్లగుడి శివాలయం, చెరువుకట్ట మీద ఉన్న మరో రెండు కోవెలలను పునరుద్ధరించాలి. మౌలిక వసతులు కల్పించాలి. ఉద్యానవనాలు, విద్యుత్తు దీపాలతో సుందరీకరణ చేపట్టాలి. ఈ పనులకు సుమారు రూ.60-70 కోట్ల వరకు అవసరం అవుతాయని కేంద్ర పురావస్తు శాఖ అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పరిసరాల్లోని రహదారులను అభివృద్ధి చేసి, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలి. పర్యాటక అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికను సైతం రూపొందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తేనే వారసత్వ హోదా పదిలంగా ఉంటుంది.

యునెస్కో గుర్తింపు పొందేందుకు అర్హత కలిగిన మానవ నిర్మిత అద్భుతాలు, సహజ వింతలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి. వాటి పరిసరాలు ఆక్రమణకు గురికావడం, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వంటివి యునెస్కో గుర్తింపు దక్కడంలో అవరోధంగా నిలుస్తున్నాయి. యునెస్కో నిబంధనల ప్రకారం ఒక కట్టడం పోటీలో నిలవాలంటే దానికి వంద మీటర్ల పరిధిలో ఎటువంటి ఆక్రమణలూ ఉండకూడదు. అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయం, తెలంగాణలోని కుతుబ్‌షాహీ సమాధులు, వరంగల్‌ వేయిస్తంభాల గుడి, కోట యునెస్కో గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాయి. వాటి చుట్టూ వంద మీటర్ల లోపే అక్రమ నిర్మాణాలు వెలుస్తుండటం వల్ల ప్రపంచ వారసత్వ హోదాకు దూరమవుతున్నాయి. వరంగల్‌ కోటలో ప్రధాన ఆకర్షణ అయిన కళాతోరణాలకు సమీపంలోనే పలు విక్రయశాలలు, ప్రైవేటు భవనాలు వెలుస్తున్నాయి. మట్టి కోటకు ఆనుకొని ఉన్న మోటు(అగడ్త)ను ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. దానిపై పురావస్తు శాఖ అధికారులు నోటీసులిచ్చి వదిలేయడమే తప్ప ఆక్రమణలను అడ్డుకొనే చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

కనిపించని చిత్తశుద్ధి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సహజ వింతల విభాగంలోనూ గుర్తింపు పొందేందుకు అర్హమైన అనేక అద్భుతాలు ఉన్నాయి. కడప జిల్లాలోని గండికోట- 'గ్రాండ్‌ కెన్యన్‌ ఆఫ్‌ ఇండియా'గా ప్రసిద్ధిచెందింది. భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టపై ఉన్న గుహల్లో 30 వేల ఏళ్ల నాటి ఆదిమానవులు గీసినట్టు చెప్పే ప్రాచీన చిత్రకళ అబ్బురపరుస్తుంది. రామప్ప ఆలయ పరిశీలనకు వచ్చిన యునెస్కో ప్రతినిధి వాసు పోష్యనందన ములుగు జిల్లాలోని దేవునిగుట్టను చూసి ఆశ్చర్యపోయారు. 'యునెస్కో'కు దరఖాస్తు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. 1600 శిల్పాలతో కనువిందు చేస్తున్న ఆ నిర్మాణం కీకారణ్యంలోని కొండపై కొన్ని శతాబ్దాలుగా నిరాదరణకు గురవుతోంది. ఇలాగే బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో అద్భుతాలు తెలుగు రాష్ట్రాల్లో కొలువై ఉన్నాయి. వాటిపై పాలకుల నిర్లక్ష్యం కారణంగా భావితరాలకు మన ఘనమైన వారసత్వ సంపద గొప్పదనం తెలియకుండా పోతోంది.

యునెస్కో గుర్తింపు దక్కిన ప్రదేశాల పరంగా ప్రపంచంలో భారత్‌ ఏడో స్థానంలో నిలుస్తుంది. 58 కట్టడాలతో ఇటలీ అగ్రస్థానంలో ఉంది. ఆ తరవాత చైనా, జర్మనీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో మనకన్నా ఎక్కువ సంఖ్యలో కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించింది. దీన్నిబట్టి ఆయా దేశాల పాలకులకు వారసత్వ సంపద పరిరక్షణపై ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుంది. వారసత్వ సంపద పరిరక్షణ వల్ల మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఆస్కారం లభిస్తుంది. పర్యాటక పరంగా ఆయా ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెంది స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వారసత్వ సంపదను కాపాడాలంటే సంబంధిత శాఖల్లో తగిన సిబ్బంది చాలా అవసరం. తెలంగాణలో పురావస్తు తవ్వకాలు జరిపే శాసనాల పరిష్కర్త పోస్టు ఒక్కటీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగవిరమణ పొందిన పురావస్తు అధికారులతో నెట్టుకొస్తున్నారు. కేంద్ర పురావస్తు శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. నిధులనూ అరకొరగానే కేటాయిస్తున్నారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఈ ఏడాది బడ్జెట్టులో రూ.2687 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 15శాతం తక్కువ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో తగినన్ని నిధులు కేటాయించాలి. ఆయా వారసత్వ ప్రదేశాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే మన ఘనమైన వారసత్వ సంపద భవిష్యత్తు తరాలకు బంగారు కానుక అవుతుంది.

శిథిలమవుతున్న సంస్కృతి

కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు సైతం తెలుగు రాష్ట్రాలలోని వారసత్వ కట్టడాలను గుర్తించడంలో ఆసక్తి చూపడం లేదు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో ఏడు వందలకు పైగా కట్టడాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్‌లో 129, తెలంగాణలో కేవలం ఎనిమిది కట్టడాలు మాత్రమే దాని పర్యవేక్షణలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల ఆధీనంలో లేని అనేక ఆలయాలు శిథిలమైపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని కోటగుళ్లు, ఏకవీర ఆలయం, గుంటూరులో కాకతీయుల కాలంలో రుద్రమదేవి నిర్మించినట్టు చెబుతున్న మందడం శివాలయంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు పన్నెండు వందల ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయనేది కఠోర వాస్తవం.

- గుండు పాండురంగశర్మ

ఇదీ చూడండి :అసమానతల అంతమే నిజమైన వృద్ధి

ABOUT THE AUTHOR

...view details