'మాస్ లీడర్లు కావాలండోయ్' అని పార్టీలు ప్రకటనలు ఇచ్చే పరిస్థితి వస్తుందేమో భవిష్యత్‌లో! ఓట్లు రాబట్టే వారి కోసం వేటాడుకోవాల్సి వస్తుందేమో! కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితిని చూస్తే అలాగే అనిపిస్తోంది! అక్కడి రాజకీయ పార్టీలను మాస్ లీడర్ల కొరత వేధిస్తోంది. పార్టీకి ఒకరు మినహా.. ఎక్కువ మంది మాస్ లీడర్లు లేకపోవడం చర్చనీయాంశమవుతోంది. సీనియర్ నాయకులు రాజకీయాలకు దూరమైతే.. ప్రజలను ఆ స్థాయిలో ఆకట్టుకునే యువ నేతలు ఉండకపోవడం పార్టీలను సందిగ్ధంలో పడేస్తోంది!
కర్ణాటకలో బీజేపీ తరఫున యడియూరప్ప, కాంగ్రెస్ నుంచి సిద్ధరామయ్య, జేడీఎస్ నుంచి హెచ్డీ కుమారస్వామి.. తమ తమ పార్టీల ప్రచారానికి నేతృత్వం వహిస్తున్నారు. మూడు పార్టీలకు ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు మూలస్తంభాలుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరు మినహా ఆయా పార్టీల్లో రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్ ఉన్న నాయకులు కనిపించడం లేదు. పార్టీల్లో ప్రజాకర్షక నేతలు లేకపోవడం మైనస్‌గా మారింది. భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది!
కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప.. బీజేపీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం సైతం పూర్తి బాధ్యతలను ఆయనకే అప్పజెప్పింది. ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయనను దింపేశాక.. కొంతకాలం యడియూరప్పను దూరంగా పెట్టిన బీజేపీ.. తర్వాత ఆ తప్పును గ్రహించింది. ఎన్నికల్లో ముప్పు ఎదురవుతుందేమోనని భావించి ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పజెప్పింది. మోదీ, అమిత్ షా సైతం ఎప్పుడు కర్ణాటకకు వచ్చినా.. యడియూరప్పను ఆకాశానికెత్తుతున్నారు. యడియూరప్ప నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు అమిత్ షా బహిరంగ ప్రకటన చేశారు. యడియూరప్పకు లింగాయత్ వర్గంలో మంచి పట్టు ఉంది. ఆయనకు తగిన ప్రాధాన్యం ఇస్తేనే ఎన్నికల్లో ఓట్లు రాలుతాయని బీజేపీ భావిస్తోంది. అందుకే ఎన్నికల ర్యాలీల్లో, మీటింగ్‌లలో ఆయన ఉండేలా చూస్తోంది.
బసవరాజ్ బొమ్మై, యడియూరప్ప యడియూరప్ప మినహా బీజేపీకి మరో దిగ్గజ నేత లేకపోవడం కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు మాజీ సీఎంలు జగదీశ్ షెట్టర్, డీవీ సదానంద గౌడ పార్టీలో కీలకంగా ఉన్నప్పటికీ.. వీరి వల్ల ఓట్లు రాలే పరిస్థితి కనిపించడం లేదు. బొమ్మై, షెట్టర్.. లింగాయత్ వర్గానికి చెందినవారే. కానీ ఆ వర్గం ఓటర్లు వీరికి అండగా ఉంటారన్న నమ్మకం లేదు. బొమ్మై సీఎంగా ఎంపికైనప్పటికీ.. యడియూరప్ప స్థాయిలో లింగాయత్ వర్గాన్ని ఆకర్షించలేకపోతున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న సదానంద గౌడ వొక్కలిగ వర్గానికి చెందిన నేత. అయినప్పటికీ సొంత సామాజిక వర్గాన్ని ఆశించిన మేరకు ఆయన ఆకట్టుకోలేకపోతున్నారు. జనాలను ఆకర్షించడంలోనూ యడ్డీతో పోలిస్తే వీరు వెనకంజలో ఉన్నారు.
రామయ్యతోనే ఓట్లు వస్తాయయ్యా!
కర్ణాటకలో విపక్ష కాంగ్రెస్ పరిస్థితి సైతం బీజేపీ తరహాలోనే ఉంది. హస్తం పార్టీ మాజీ సీఎం సిద్ధరామయ్యపైనే ఆధారపడుతోంది. యడియూరప్ప, దేవెగౌడ మాదిరిగా.. సిద్ధరామయ్యకు సైతం మాస్ లీడర్‌గా పేరుంది. సొంత కురుబ కమ్యూనిటీలో గట్టి పట్టు ఉంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఆ పార్టీ జాతీయధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సైతం సిద్ధరామయ్యతో పోలిస్తే మాస్ అప్పీల్ తక్కువే. ఉప ముఖ్యమంత్రి డీ పరమేశ్వర్, మాజీ మంత్రి షామనూర్ శివశంకరప్ప వంటి సీనియర్ నేతలకు ఆ రేంజ్లో ఆకర్షణ లేదు.
మాజీ మంత్రులు ఆర్వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్, కగోడు తిమ్మప్ప, టీబీ జయచంద్ర, మాజీ స్పీకర్ రమేశ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి, ఈశ్వర కాంద్రే, సతీశ్ జార్ఖిహోళి వంటి ప్రధాన నేతలు.. తమ తమ నియోజకవర్గాలు/ జిల్లాలకే పరిమితమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీరికి ఓట్లు ఆకర్షించే సత్తా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీకి అంత పాపులారిటీ లేదు. దీంతో కాంగ్రెస్ పూర్తిగా సిద్ధరామయ్యనే నమ్ముకుంది.
దేవెగౌడ, కుమారస్వామి.. ఆ తర్వాత?
కర్ణాటకలో కింగ్ మేకర్‌గా మారాలని ఆశిస్తున్న జేడీఎస్ పరిస్థితి సైతం బీజేపీ, కాంగ్రెస్ మాదిరిగానే ఉంది. సాధారణంగా జేడీఎస్ రాజకీయాలన్నీ మాజీ ప్రధాని దేవెగౌడ చుట్టూనే తిరుగుతాయి. వొక్కలిగ వర్గానికి చెందిన ఆయనకు.. ఆ వర్గంలో తిరుగులేని పట్టు ఉంది. దేవెగౌడ నాయకత్వ సామర్థ్యంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. దేవెగౌడను మినహా.. ఇతర పార్టీల నేతలెవరినీ వొక్కలిగలు ఆదరించలేదు. దక్షిణ కర్ణాటకలో ఇప్పటికీ తిరుగులేని ఆధిపత్యం ఈ పార్టీదే. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో జేడీఎస్‌కు దేవెగౌడనే కీలకంగా ఉన్నారు.
కానీ, ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది. దేవెగౌడ వయసు 85 ఏళ్లు దాటింది. వృద్ధాప్యం కారణంగా రాజకీయాల్లో మునుపటిలా యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే ఆయన.. ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొనలేకపోతున్నారు. దీంతో ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి ఆ బాధ్యతలు తన భుజాన వేసుకున్నారు. జేడీఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. దేవెగౌడకు అండగా ఉన్నట్టే.. వొక్కలిగలు ఇప్పుడు కుమారస్వామికి మద్దతు ఇస్తున్నారు. జేడీఎస్‌లో మరే ఇతర నేతకు ఆ వర్గంలో ఈ స్థాయిలో పట్టు లేదు. దీంతో ఆ పార్టీ రాజకీయాలు మొత్తం కుమారస్వామి చుట్టూ తిరుగుతున్నాయి. దేవెగౌడ మరో కుమారుడు రేవన్న.. హసన్ జిల్లాకే పరిమితమవుతున్నారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం, మాజీ మంత్రులు బండెప్ప కాశంపూర్, జీటీ దేవెగౌడకు రాష్ట్రవ్యాప్తంగా అంత పాపులారిటీ లేదు.
కారణం ఇదే!
భవిష్యత్‌లోనూ కర్ణాటక రాజకీయాల్లో మాస్ లీడర్ల కొరత కొనసాగనుంది. తనకు ఇవే చివరి ఎన్నికలని సిద్ధరామయ్య ఇదివరకే చెప్పేశారు. వయసురీత్యా యడ్డీ పరిస్థితీ అంతే! దేవెగౌడ ఇప్పటికే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెర వెనుక ఉండే నడిపిస్తున్నారు. పోరాట పటిమ లేకపోవడం, ప్రజాసేవలో నిరంతరం పాల్గొనకపోవడం వల్ల ప్రజలను ఆకట్టుకోవడంలో ప్రస్తుతం ఉన్న నేతలు విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నేతలు తమను తాము ప్రజా సేవకులమని మర్చిపోయి.. యజమానులుగా భావించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు ఎదిగితేనే.. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి గట్టి నాయకులను చూసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.