తెలంగాణ

telangana

ETV Bharat / opinion

School Reopen: బడుల్లో సమస్యల తాండవం.. ప్రత్యక్ష తరగతులు సవాలే!

భారత్‌లో ఏడాదిన్నర నుంచి పాఠశాలలు (School Reopen) పనిచేయకపోవడంతో ఆ ప్రభావం 26 కోట్లమంది  పిల్లలపై పడింది. ఆన్‌లైన్‌ అభ్యసనం(Online classes) ప్రత్యక్ష బోధనకు సరైన ప్రత్యామ్నాయం కాలేకపోయింది. విద్యా సామర్థ్యాలు తీవ్రంగా పడిపోయాయి. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే వేలమంది ఉపాధ్యాయులు వీధిన పడ్డారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటివీ అధికమయ్యాయి. పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది.

schools
పాఠశాలలు

By

Published : Aug 31, 2021, 6:30 AM IST

దేశంలో కరోనా కేసులు(Coronavirus cases) తగ్గుముఖం పడుతుండటంతో పాఠశాలలను తెరిచేందుకు (School Reopen) రాష్ట్రాలు ఉద్యుక్తమయ్యాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టాయి. దీర్ఘకాలికంగా పాఠశాలలు పనిచేయకపోతే పిల్లలు శారీరక, మానసిక, మేధాపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ పేర్కొన్నారు.

ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ(Health Ministry) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. స్థానిక పరిస్థితులను బట్టి పాఠశాలల పునః ప్రారంభంపై(School Reopen) రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. భారత్‌లో ఏడాదిన్నర నుంచి పాఠశాలలు పనిచేయకపోవడంతో ఆ ప్రభావం 26 కోట్లమంది పిల్లలపై పడింది.

ఆన్‌లైన్‌ అభ్యసనం(Online classes) ప్రత్యక్ష బోధనకు సరైన ప్రత్యామ్నాయం కాలేకపోయింది. విద్యా సామర్థ్యాలు తీవ్రంగా పడిపోయాయి. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే వేలమంది ఉపాధ్యాయులు వీధిన పడ్డారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటివీ అధికమయ్యాయి. పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది.

నిధుల కోత

ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బడులు తెరచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆగస్టు 16న ప్రత్యక్ష తరగతులు ప్రారంభించగా, తెలంగాణలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి మొదలుకానున్నాయి. కరోనా ముప్పు ఇంకా తొలగిపోనందువల్ల బడుల్లో మౌలిక వసతులు కల్పించి, పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టడం ప్రస్తుతం అత్యావశ్యకం. గతంలో కరోనా తొలిదశ ఉద్ధృతి తగ్గుముఖం పట్టాక పాఠశాలలు మళ్ళీ మొదలైనా, రెండో దశ కారణంగా వెంటనే మూతపడ్డాయి. దాంతో చాలా విద్యాలయాలు మరమ్మతులకు నోచుకోలేదు. చాలా చోట్ల పాఠశాలల గోడలు దెబ్బతిన్నాయి. తరగతి గదుల పైకప్పులు పెచ్చులూడుతున్నాయి. ప్రహరీలు పగుళ్లుబారి కూలిపోయేలా ఉన్నాయి. గేట్లు ఊడిపోయాయి.

కొన్ని బడుల్లో ఇప్పటికే ఉన్న నీటి వసతి సైతం దెబ్బతింది. 15 రాష్ట్రాల్లోని పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించిన మరుగుదొడ్లపై గతేడాది కాగ్‌ జరిపిన అధ్యయనంలో పలు వాస్తవాలు వెలుగుచూశాయి. దాదాపు 55శాతం మరుగుదొడ్లలో నీటి వసతి లేదని, 72శాతం బడులకు నల్లానీటి సౌకర్యం లేదని తేలింది. పేలవమైన నిర్వహణ వల్ల 30శాతం మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. మానవ వనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం నిధుల ప్రతిపాదనలు, కేటాయింపులు, వినియోగంలో వ్యత్యాసాలను పట్టిచూపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర విద్యాశాఖ 82,570 కోట్ల రూపాయలు ప్రతిపాదించగా, బడ్జెట్‌లో 59,845 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనల నుంచి 27శాతం కోత విధించడం పట్ల స్థాయీసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాదీ కేటాయింపులు ఆశాజనకంగా లేవని నిపుణులు పేర్కొంటున్నారు.

నిబంధనలు పాటించడం తప్పనిసరి

సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను పొందడం పిల్లల హక్కు అని విద్యా హక్కు చట్టం-2009 పేర్కొంటోంది. విద్యకు జీడీపీలో(GDP of India)) ఆరు శాతం నిధులను కేటాయించాలని జాతీయ విద్యావిధానం పేర్కొంటోంది. బడ్జెట్లో నిధుల తగ్గింపు మౌలిక వసతుల కల్పనలో అవరోధంగా నిలవనుంది. దిల్లీ ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో 25శాతం నిధులు కేటాయించి ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'నాడు-నేడు' కార్యక్రమం కింద దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరిస్తోంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించింది. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచీ 40 శాతందాకా ఖర్చు చేయనున్నారు. కరోనా మూడోదశ ముప్పు పొంచి ఉందన్న తరుణంలో ప్రభుత్వాలు సరైన వ్యూహంతో ముందుకెళితేనే చదువులు సక్రమంగా సాగుతాయి.

ఇటీవల సమగ్రశిక్ష 2.0 కార్యక్రమాన్ని మరో అయిదేళ్ల పాటు పొడిగించారు. ఇందులో పారిశుద్ధ్య సౌకర్యాలతో సహా సురక్షిత మౌలిక సదుపాయాల కోసం మార్గదర్శకాలను జారీ చేశారు. కొవిడ్‌ కష్ట కాలంలో కుటుంబాల ఆదాయాలు తెగ్గోసుకుపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగింది. అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలి. విద్యార్థులందరికీ మాస్కులు, శానిటైజర్‌లతో పాటు సబ్బు, నీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించవలసి ఉంది. పిల్లలకు టీకా అందుబాటులోకి తేవాలి. అప్పుడే బడుల్లో సురక్షిత అభ్యసనానికి మార్గం సుగమమవుతుంది.

- సంపతి రమేష్‌ మహారాజ్‌

ABOUT THE AUTHOR

...view details