'సురక్షిత బాల్యమే లక్ష్యం.. అందుకే 'లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్'' - learning space foundation
పదేళ్ల పాపకు సొంతింట్లోంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి ఆ చిన్నారినే నిందించింది ఆ ఇంటి పెద్దావిడ తెలిసీతెలియని వయసులో గర్భం దాల్చిందో అమ్మాయి పద్ధతిగా ఉంటే.. ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తుందని కడిగేసింది సమాజం.. రెండు ఘటనల్లో బాధితురాళ్లే నిందితులైన దుస్థితి.. ఈ వైఖరిలో మార్పు తెచ్చేందుకే కృషి చేస్తున్నారు ‘లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు కౌముది నాగరాజు.
లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్
By
Published : Aug 23, 2021, 3:37 PM IST
కౌముది నాగరాజు తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని ఓ మారుమూల గ్రామం. వారిద్దరూ 1993లో ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దాంతో ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చేసి కొన్నాళ్లు అమెరికాలో ఐటీ ఉద్యోగం చేశారు. ఇండియాలోనే స్థిరపడాలన్న ఆలోచనతో తిరిగొచ్చేశారు.
అమ్మకోరిక తీర్చడానికి...
టీచర్‌గా పనిచేసిన వాళ్ల అమ్మకు రిటైర్ అయ్యాక కూడా నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను బోధించాలనే కోరికుండేది. కానీ, పదవీ విరమణకు ముందే ఆవిడ చనిపోవడంతో ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు కౌముది. కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాలంటీర్‌గా పేద పిల్లలకు పాఠాలు బోధించారు. ‘లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్’ స్థాపించి నిరుపేద విద్యార్థుల కోసం ‘స్టెమ్’ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ‘యునైటెడ్ వే హైదరాబాద్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి జంట నగరాల్లో దాదాపు 88 ప్రభుత్వ పాఠశాలల్లోని 12 వేల మందికి పైగా స్టెమ్ ప్రాజెక్ట్ ద్వారా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను నేర్పించేందుకు కృషి చేశారు. ఇలా శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్న క్రమంలోనే.. ఓ ఘటన ఆమెను విస్తుపోయేలా చేసింది.
భద్రత కూడా మౌలికావసరమే..
ఓ పాఠశాలకు వెళ్లినప్పుడు సొంత తాతే మనవరాలిని లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ ఘటన కొన్నాళ్లపాటు ఆమెను వెంటాడింది. మరో ఘటనలో టీనేజీ అమ్మాయి గర్భానికి కారణమైన వారిని నిందించకుండా తప్పంతా అమ్మాయిదే అనడం చూశారు. ఇలాంటి దుర్ఘటనలు పసిహృదయాలను మానసికంగా కుంగదీస్తాయి. దీని ప్రభావం చదువు, జీవితంపై పడే ప్రమాదముంది. కూడు, గుడ్డ, నీడలాగా పిల్లలకు భద్రత కూడా కనీస అవసరమని భావించారు కౌముది.
సురక్షిత బాల్యమే లక్ష్యం..
ఈ వేధింపుల గురించి తెలుసుకునే కొద్దీ హృదయాల్ని కదిలించే ఘటనలెన్నో తారసపడ్డాయి. దీంతో ఓ వైపు విద్యార్థులకు జీవన నైపుణ్యాలు నేర్పిస్తూనే, ‘సురక్షా ఔర్ సమ్మాన్’ పేరిట లైంగిక వేధింపులను నివారించడానికి తన బృందంతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం మొదలు పెట్టారు. లాక్‌డౌన్‌కు ముందు కొన్ని పాఠశాలల్లో స్వీయ రక్షణ కోసం కరాటే తరగతులను కూడా నిర్వహించారు. ఇవే కాదు...భద్రతతో పాటు ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన జెండర్ అవగాహనను, లీగల్ ఎడ్యుకేషన్‌ను, విలువలతో కూడిన జీవన నైపుణ్యాలను కూడా నేర్పిస్తున్నారు. బాలల హక్కుల కోసం ఉద్దేశించిన పోక్సో లాంటి చట్టాల గురించి వివరించి పెద్లల్లోనూ చైతన్యం తీసుకొస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైన చిన్నారులను మానసిక చికిత్స చేయిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల వారికీ..
కరోనా లాక్‌డౌన్ కారణంగా అఘాయిత్యాలు ఇంకా పెరిగాయి అంటున్నారామె. అందుకే ఆన్‌లైన్‌లో ‘వి హియర్ యూ’ కార్యక్రమం ద్వారా టీనేజీ పిల్లల సమస్యలపై చర్చిస్తూ పరిష్కారాలు చూపుతున్నారు. టీచర్లు, గృహిణులకు పిల్లల భద్రతపై అవగాహన కల్పించేందుకు ‘శ్రేయోభిలాషి’ కార్యక్రమం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల్లోని పెద్దవారికీ ఆన్‌లైన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ‘మొదట్లో లైంగిక విద్యను నేర్పిస్తామన్నప్పుడు అభ్యంతరం చెప్పినవారే, పిల్లల్లో వచ్చిన మార్పులు చూసి అభినందిస్తున్నారు. పిల్లలపై లైంగిక వేధింపులు లేని స్వచ్ఛమైన సమాజం ఏర్పడేంత వరకు నా వంతు కృషి చేస్తాను. పిల్లల భద్రత మనందరి బాధ్యత. లైంగిక విద్య గురించి చెప్పడం, మాట్లాడుకోవడం పాపమైపోయింది. ఈ ఆగడాల బారి నుంచి తప్పించుకోలేక, బయటకు చెప్పలేక పసిమనసులు చితికిపోతున్నాయి. ఇలాంటి దుర్ఘటనలు జరిగాక బాధపడటం కన్నా, వాటిని ముందే నివారించడం ఉత్తమం’ అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు కౌముది నాగరాజు.