తమ తరతరాల ఆవాసాలపై భూమిపై, అటవీ ఉత్పత్తులపై పాలకులు ఆంక్షలు విధించినప్పుడల్లా ఆదివాసులు తిరుగుబాటు చేయక తప్పలేదు. వాటిని అణచివేయడానికి పాలకులు ఆయుధాలు ప్రయోగించారు. అయినా వెరవకుండా అకృత్యాలను అడ్డుకున్నారు. తమ సాంప్రదాయిక విల్లమ్ములతో వారిని పారదోలారు. లేదా ప్రాణాలు అర్పించారు. ఆ విధంగా విదేశీ ఆక్రమణలను తిప్పికొట్టింది ఆదివాసులే. దీన్ని దేశభక్తిగా వారు చెప్పుకోలేదు. ఇతరులు సైతం ఎక్కడా అలా పేర్కొనలేదు. కానీ నికార్సైన దేశభక్తులు వారే. ప్రజల నోళ్లలో వారి చరిత్ర నిక్షిప్తం చేసుకున్నారు. వారిపేరే ఒక మంత్రమయ్యింది. మౌఖికంగా నోళ్ళలో దాగిన చరిత్రకి చావులేదు. అలాంటి చరిత్ర కలవాడే కుమురం భీం.
అధికారుల దాష్టీకంపై పోరాటం
ఆదిలాబాద్ జిల్లాలోని సంకేపల్లిలో 1901లో పుట్టిన భీం చిన్నతనం నుంచే అటవీ, రెవిన్యూ అధికారుల దాష్టీకాన్ని చూశాడు. తండ్రి కుమురం కుర్దు విషజ్వరంతో మరణించాడు. ఆ తరవాత బాబాయిలు, తమ్ముళ్లతోపాటు సంకెపల్లి నుంచి సుర్దాపూర్ వెళ్లాడు. అక్కడ వారు అష్టకష్టాలు పడి పంట పండించుకున్నారు. కోతల కాలానికి అధికారి పట్టేదార్ సిద్దిక్ ఆ భూములన్నీ తనవే అని లాక్కోవడానికి వచ్చాడు. రక్తం ధారపోసి చెట్లు పొదలు నరికి తయారు చేసుకున్న పొలాల్ని తనవంటూ మరెవరో దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఉండలేకపోయాడు. అప్పుడు జరిగిన ఘర్షణలో సిద్దిక్ తలమీద దెబ్బ తగిలి మరణించాడు. అప్పటినుంచి పోలీసులు భీంని వెంటాడసాగారు. భీం తప్పించుకుని కాలినడకన బలార్షా చేరాడు. అక్కడి నుంచి అసోమ్‌కు పోయి తేయాకు తోటల్లో అయిదేళ్లు పనిచేశాడు. దేశంలోని వివిధ ఆదివాసీ తెగలవారు ఆ తోటల్లో పని చేసేవారు. ఆదివాసుల బతుకు వెతల గురించి విన్నాడు. అక్కడా ఓ ఘటనలో ఆయనపై పోలీసు కేసు నమోదైంది. అందుకే తిరుగు పయనమై తన అన్నలు ఉన్న కాకన్‌ఘాట్‌కు వెళ్లి దేవడం లచ్చు పటేల్ దగ్గర పాలేరుగా కుదిరాడు.
పోరాట యోధుడు.. కుమురం భీం
అటవీ శాఖవారు లచ్చుపటేల్‌పై కేసు పెడితే దాన్ని భీం పరిష్కరించాడు. ఈ విషయం తెలిసిన గోండులు భీంని తమ నాయకుడిగా భావించారు. ఆ తరువాత భీం కుటుంబ సభ్యులతో బాబేఝరి కేంద్రంగా కొన్ని గూడేలను రూపొందించి- అడవిని నరికి భూమిని చదును చేసుకున్నాడు. పోలీసులు, అటవీ అధికారులు కలిసి ఆ గూడేలను కాల్చివేశారు. కేసులు పెట్టారు. అధికారులు పెట్టే బాధలను నిజాం రాజైన ఉస్మాన్ అలీఖాన్‌కు విన్నవించడానికి భీం హైదరాబాదు వచ్చాడు. నిజాం దర్శనం లభించలేదు. ఇక చేసేదేమీ లేక తిరిగి ఊరికి వెళ్లాడు. అధికారులు గోండు, కొలాములను లొంగదీసుకునే చర్యలు చేపట్టారు. భీం చేసే పోరాటానికి చాలా గూడేల్లో మద్దతు లభించింది. స్థానిక అధికారులతో పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి.