తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రజాప్రభుత్వం నామమాత్రం- దిల్లీలో ఎల్​జీనే కీలకం

దిల్లీ ప్రభుత్వం-కేంద్రం మధ్య ఉన్న గొడవలు ముదిరి పాకాన పడుతున్న తరుణంలో 'ది గవర్నమెంట్ ఆఫ్​ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్​ దిల్లీ సవరణ చట్టం-2021'ను నోటిఫై చేసింది కేంద్రం. ఈ మేరకు నోటిఫికేషన్​నూ జారీ చేసింది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్‌ గవర్నరే. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకోవాలన్నా ముందుగా ఎల్‌జీకి చెప్పాల్సిందే.

cm and lg
ఎల్​జీ సీఎం

By

Published : May 2, 2021, 7:43 AM IST

దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తీవ్ర ప్రభావం చూపనుంది. కేంద్ర హోంశాఖ ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి అమలులోకి తెచ్చిన దేశ రాజధాని ప్రాంత దిల్లీ ప్రభుత్వ (సవరణ) చట్టంతో రాష్ట్ర సర్కారు రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్‌ గవర్నరే. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకోవాలన్నా ముందుగా ఎల్‌జీకి చెప్పాల్సిందే. ఈ చట్టం ద్వారా ప్రజాప్రభుత్వ అధికారాలన్నీ దాదాపుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇది భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం అనే విమర్శలున్నా కేంద్ర ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంటోంది. దిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడి ప్రభుత్వ అధికారాలను ఇతర రాష్ట్రాలతో పోల్చలేమని చెబుతోంది. దేశ రాజధానిలో ఎల్‌జీ, ఎన్నికైన ప్రభుత్వ బాధ్యతలను స్పష్టంగా నిర్వచించి శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికే చట్టాన్ని సవరించినట్లు హోంశాఖ వివరణ ఇచ్చింది. దీనివల్ల దిల్లీలో పరిపాలన మెరుగుపడి- సామాన్యులకు ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాల అమలు సున్నితంగా సాగుతుందని భాష్యం చెప్పింది. కేంద్రం తన నిర్ణయాన్ని ఎంత సమర్థించుకున్నా- విపక్షాలు మాత్రం దీన్ని దొడ్డిదారి పాలనగా అభివర్ణిస్తున్నాయి. దీనివల్ల ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వం గవర్నర్‌ చేతిలో కీలుబొమ్మగా మారడం మినహా చేసేదేమీ ఉండదని పేర్కొంటున్నాయి.

ప్రజలకు నష్టం
ప్రస్తుతం దిల్లీని కొవిడ్‌ రెండో ఉద్ధృతి ఊపేస్తున్న కారణంగా నిర్ణయాధికారాలను ప్రజాప్రభుత్వం చేతుల్లోంచి తొలగించి ఎల్‌జీకి బదిలీ చేయడం వల్ల అత్యవసర నిర్ణయాల్లో జాప్యం జరిగి ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ పదవిలో ఉన్నవారు తనను నియమించిన వారికే తప్ప ప్రజలకు జవాబుదారీగా ఉండే అవకాశం లేదు కాబట్టి ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వరనే విమర్శలున్నాయి. ప్రభుత్వం కార్యనిర్వాహక చర్యల కోసం ముందస్తు అనుమతులు కోరాల్సిందే. అసెంబ్లీ కూడా లోక్‌సభ నియమాల ప్రకారం నిర్వహించాల్సిందే. ఎల్‌జీ అనుమతి లేకుండా మంత్రిమండలి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవడానికి వీల్లేదు. పరిపాలనపరంగా తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. రోజువారీ పరిపాలన వ్యవహారాలను అసెంబ్లీ పర్యవేక్షించడానికి వీల్లేదు. విచారణ కోసం ఏ అధికారినైనా అసెంబ్లీ కమిటీలు పిలిస్తే- అవన్నీ రోజువారీ కార్యకలాపాల్లోకి రావడం వల్ల తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ధిక్కార స్వరం వినిపించే అవకాశాన్ని కొత్త చట్టం కల్పిస్తోంది. చివరికి రాష్ట్ర ప్రభుత్వంలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడి పాలన అస్తవ్యస్తంగా మారే ప్రమాదముంది. సమాఖ్య వ్యవస్థలో చట్టసభా వ్యవహారాలకు సంబంధించిన నిబంధనలను రూపొందించుకొనే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. కానీ దిల్లీ అసెంబ్లీకి ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేదు. విద్య, వైద్యం, నీరు, విద్యుత్తు, రవాణా, రహదారులు వంటి రోజువారీ ప్రజాజీవితంతో ముడివడిన విషయాల్లో సైతం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దిల్లీ నగరం దేశ రాజధాని అనే కారణం చూపి అన్ని అధికారాలూ ఎల్‌జీకి ధారాదత్తం చేయడంలో న్యాయం లేదని 76 మంది మాజీ బ్యూరోక్రాట్లు ఇప్పటికే రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ చర్య దిల్లీ పాలన వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రజాప్రయోజనాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. కానీ, కేంద్రం పట్టించుకోలేదు.

ఇదీ చదవండి:'మహిళ.. సీజేఐ కావాల్సిన సమయమిది!'

నిర్వీర్యమవుతున్న సర్కారు
ఇదివరకున్న ఎల్‌జీ నజీబ్‌ జంగ్‌ యూపీయే ప్రభుత్వ హయాములో నియమితులైనా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగానే వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కొన్నాళ్లపాటు ప్రచ్ఛన్న యుద్ధం చేశారు. ఆయన ఉన్నన్ని రోజులు రెండు వ్యవస్థల మధ్య ప్రతిరోజూ జగడం నడిచింది. దిల్లీలో ప్రభుత్వం అంటే ఆర్టికల్‌ 239 ప్రకారం రాష్ట్రపతి నియమించిన ఎల్‌జీయేనని ఇదివరకే ఆయన భాష్యం చెప్పారు. దానిపైన దిల్లీ రాష్ట్రప్రభుత్వం కోర్టుకెళ్ళడంతో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్‌ సర్కారు వాదనను సమర్థిస్తూ 2018లో తీర్పు చెప్పింది. పోలీసు విభాగం, శాంతిభద్రతలు, భూములకు సంబంధించిన అంశాల్లో తప్ప మిగతా విషయాల్లో ప్రజాప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలకు ఎల్‌జీ ముందస్తు అనుమతి అవసరం లేదని, నిర్ణయం తీసుకున్న తరవాత చెబితే చాలని తేల్చిచెప్పింది. ఎల్‌జీ రాష్ట్ర మంత్రివర్గ సలహా, సూచనల ప్రకారం నడచుకోవాలని స్పష్టంచేసింది. అయితే, ఆ తీర్పును ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ కార్యనిర్వాహక వ్యవహారాలకు సంబంధించిన దస్త్రాలను ఎల్‌జీకి పంపడం మానేసిందని, అది మంచి పరిణామం కాదని 2019లో దిల్లీ న్యాయశాఖ కార్యదర్శి అంతర్గత మెమోలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటి మధ్య- కేంద్ర హోంశాఖ చట్ట సవరణ ద్వారా ఎల్‌జీకి సర్వాధికారాలు కట్టబెట్టింది. పోలీసులు, శాంతిభద్రతలు, భూములపై అధికారం లేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఉద్యోగులపై చర్యలు తీసుకొనే, అవినీతిపై విచారణ చేపట్టే, రోజువారీ నిర్ణయాధికారాలను తీసుకొనే శక్తి లేకుండా చేయడం ద్వారా ప్రజాప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసినట్లవుతుంది. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉంటే అన్నీ సజావుగా సాగిపోతాయి. భిన్న భావజాలాలున్న పార్టీలు అధికారంలో ఉంటే మాత్రం దిల్లీ ప్రభుత్వం నామమాత్రంగా మిగులుతుంది.

ABOUT THE AUTHOR

...view details