తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కొంపముంచిన 'అవినీతి'.. కాపాడని హిందుత్వం.. బీజేపీ ఓటమికి కారణాలివే!

Karnataka election results : కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు.. కర్ణాటకలో బీజేపీ ఓటమికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. అవినీతి మరకలతో ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్న బీజేపీకి.. ఎన్నికలకు ముందు అనేక సమస్యలు వెంటాడాయి. చివరికి అవి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఓటమికి కారణాలను అన్వేషిస్తే...

karnataka election results bjp loss reason
karnataka election results bjp loss reason

By

Published : May 13, 2023, 2:27 PM IST

Updated : May 14, 2023, 3:45 PM IST

Karnataka election results : 'పే సీఎం'.. '40 శాతం సర్కారు'.. 'కమీషన్ల మంత్రులు'.... కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ సంధించిన అస్త్రాలివి. రాష్ట్రంలో అవినీతి తీవ్ర స్థాయికి చేరిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ఇది. ప్రతి పనికి బీజేపీ సర్కారు 40 శాతం కమీషన్ తీసుకుంటోందని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇది ఎన్నికల్లో బీజేపీని బాగా ఇబ్బంది పెట్టింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టడం మినహా గట్టిగా సమాధానాలు చెప్పుకోలేకపోయింది. అవినీతితో పాటు అనేక అంశాల్లో బీజేపీ సర్కారుకు ఎదురుగాలి వీచింది. చివరకు అమూల్ పాల వ్యవహారం సైతం రాష్ట్రంలో దుమారం రేపింది. దీంతో 'స్థానికత' అస్త్రంతో బీజేపీని విపక్షాలు ఇరుకునపెట్టాయి. దీంతో పార్టీ 66 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలు ఓసారి విశ్లేషిస్తే...!

'40% కమీషన్' పోస్టర్లు

ఎన్నికల ఫలితాలు ఇలా...

పార్టీ పేరు సీట్ల సంఖ్య
కాంగ్రెస్ 135
బీజేపీ 66
జేడీఎస్ 19
ఇతరులు 4

అవినీతి!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణలు. 40 శాతం కమీషన్ ఇవ్వనిదే రాష్ట్రంలో ఏ పనీ జరగడం లేదని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేంతలా ఈ ఆరోపణలు వచ్చాయి. బీజేపీ మంత్రులపైనే ఈ ఆరోపణలు రావడం, అవినీతి ఆరోపణలతో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. దీంతో కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీజేపీ హయాంలో రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ప్రచారం చేసింది. ఇది కమలం పార్టీకి చేటు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • బీజేపీ సర్కారుపై కాంట్రాక్టర్లు చేసిన కమీషన్ల ఆరోపణలతో అవినీతి విషయం చర్చనీయాంశమైంది.
  • అవినీతిని ప్రస్తావిస్తూ గతేడాది ఏప్రిల్​లో సివిల్ కాంట్రాక్టర్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నారు
  • మంత్రి ఈశ్వరప్ప, ఆయన అనుచరులు లంచం డిమాండ్ చేశారని కాంట్రాక్టర్ ఆరోపణ
  • పాటిల్ ఆత్మహత్యతో బహిరంగంగా గళం విప్పిన బాధిత కాంట్రాక్టర్లు
  • ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకూ లంచం ఇవ్వాల్సి వస్తోందన్న ఆరోపణలు
  • ఎస్సై పోస్టుకు రూ.80 లక్షలు ఇవ్వాల్సి వస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపణ

కాంట్రాక్టర్ల నుంచి అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా వెల్లువెత్తగా.. అధిష్ఠానం సైతం అప్రమత్తమైంది. కొద్దిరోజులకు ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించారు. అయితే, ఈ సమస్యను పరిష్కరించడంలో బీజేపీ విజయం సాధించలేకపోయింది. కేఎస్ ఈశ్వరప్ప రాజీనామా చేసినప్పటికీ.. అవినీతి ఆరోపణలు పార్టీని వెంటాడాయి. ఈ విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రచారం సైతం రాష్ట్ర ప్రజలపై ప్రభావం చూపినట్లైంది. 'పే సీఎం'.. '40% సర్కారు' అంటూ పోస్టర్లు వేసి ప్రజల దృష్టిని ఆకర్షించింది హస్తం పార్టీ.

ప్రభుత్వ వ్యతిరేకత- లింగాయత ఓట్లు దూరం?
కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని చీల్చి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ సర్కారుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత సైతం ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించడం బీజేపీకి మంచి కంటే ఎక్కువగా చెడే చేసింది. లింగాయత దిగ్గజంగా ఉన్న యడ్డీని దూరం పెట్టడం ఆ వర్గం ఓటర్లకు రుచించలేదు. సీఎంగా మరో లింగాయత నేత బసవరాజ్ బొమ్మైని నియమించినప్పటికీ.. యడ్డీ స్థాయిలో ప్రజాకర్షణ బొమ్మైకి లేకపోవడం బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వీరశైవ లింగాయత ఫోరం కాంగ్రెస్​కు మద్దతుగా ప్రకటన చేయడం సంచలనమైంది.

లింగాయత ఫోరం లేఖ

టికెట్ల కేటాయింపు వ్యూహం ఫెయిల్!
ఎన్నికలకు ముందు బీజేపీని ఫిరాయింపులు ఇబ్బంది పెట్టాయి. సీనియర్ నాయకులు సైతం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం కమలనాథులను పరేషాన్​కు గురిచేసింది. మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సావది వంటి నాయకులు బీజేపీకి గుడ్​బై చెప్పారు. లింగాయత వర్గానికి చెందిన జగదీశ్ శెట్టర్​ ధార్వాడ్ జిల్లాలో గట్టి పట్టున్న నేత. సొంత నియోజకవర్గమైన హుబ్బళ్లి- ధార్వాడ్ సెంట్రల్​లో ఆయన ఓడిపోయినప్పటికీ.. ఇతర ప్రాంతాల్లో లింగాయత ఓట్లు బీజేపీకి దూరమైనట్లు తెలుస్తోంది. ప్రధాన నేతల పార్టీ మార్పుల వల్ల పలు ప్రాంతాల్లో బీజేపీకి పట్టుసడలింది. బలమైన నేతల తిరుగుబాటుతో అప్రమత్తమైన పార్టీ యంత్రాంగం.. చర్చలు ప్రారంభించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

బెంగళూరులో మోదీ రోడ్​షో

రాష్ట్ర నాయకులేరి?
నరేంద్ర మోదీ- అమిత్​షా నేతృత్వంలో దేశవ్యాప్తంగా తిరుగులేని పార్టీగా ఎదిగింది బీజేపీ. జాతీయ స్థాయిలో వీరికి దరిదాపులో ఏ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇందుకు ప్రధాన కారణం.. జాతీయ నాయకత్వమే! అయితే, కర్ణాటకలో మాత్రం ఈ పార్టీకి బలమైన నాయకత్వం కొరవడింది. అప్పటివరకు పార్టీలో కీలకంగా ఉన్న యడియూరప్పను తప్పించిన తర్వాత పార్టీలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ కాంగ్రెస్​కు రాష్ట్రంలో గట్టి నాయకులు ఉన్నారు. వారితో పోలిస్తే బీజేపీ ఈ విషయంలో స్పష్టంగా వెనకంజలో కనిపించింది.

బెంగళూరులో మోదీ రోడ్​షో

వివాదాలు
దక్షిణాదిలో ప్రాంతీయత అంశాలకే ఎన్నికల్లో ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. స్థానిక సమస్యలపైనే ప్రజలు ఎక్కువ పోరాడతారు. ఈ పరిస్థితుల్లో కర్ణాటక స్థానికతను సవాల్ చేసేలా అమూల్ వంటి వివాదాలు చెలరేగడం బీజేపీకి ప్రతికూలంగా మారింది.

  • రాష్ట్రంలోకి అమూల్ రాక రాజకీయ రంగు పులుముకుంది.
  • కర్ణాటక పాల బ్రాండ్ అయిన నందినిని అమూల్ దెబ్బతీస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
  • కర్ణాటక అస్తిత్వానికి ఇది ప్రమాదకరమంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.

ఫలించని రిజర్వేషన్ వ్యూహం!
రిజర్వేషన్ల అంశం సైతం బీజేపీకి కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. ముస్లిం రిజర్వేషన్లను తొలగించి వాటిని ఒక్కలిగ, లింగాయత వర్గాలకు సమానంగా పంచాలన్న బీజేపీ నిర్ణయం పెద్దగా మేలు చేసినట్లు కనిపించడం లేదు. ముస్లిం ఓట్ల ఏకీకరణ కాంగ్రెస్​కు లాభించినట్లు తెలుస్తోంది.

పే సీఎం పోస్టర్

మోదీషో.. అర్బన్ వరకే!
ఇన్ని ప్రతికూలతలు ఉన్నా.. మోదీ చరిష్మాపై బీజేపీ నమ్మకం పెట్టుకుంది. ప్రధానిని చూసైనా ఓటర్లు తమవైపు మొగ్గుచూపుతారని ఆశించింది. అందుకు తగ్గట్టే.. ప్రధాని సైతం కర్ణాటకను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వరుస బహిరంగ సభలు, రోడ్​షోలతో చెలరేగిపోయారు. బెంగళూరు నగరంలో రెండు రోజుల పాటు సుదీర్ఘ రోడ్​షో నిర్వహించారు. ఆయన ప్రచార ప్రభావం అర్బన్ ప్రాంతాల్లో బీజేపీపై సానుకూలంగానే పడింది. బెంగళూరు అర్బన్ నియోజకవర్గాల్లో బీజేపీ గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మోదీ చరిష్మా పనిచేయలేదు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా నందిని ఐస్​క్రీమ్ తింటున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు

హిందుత్వ వ్యూహం.. కోస్టల్​లోనే..
అప్పటివరకు అవినీతి, అభివృద్ధి, అమూల్ వంటి అంశాల చుట్టూ తిరిగిన కర్ణాటక రాజకీయం ఎన్నికలకు 10 రోజుల పూర్తిగా మారిపోయింది. బజరంగ్ దళ్​ వంటి సంస్థలపై నిషేధం విధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇవ్వడం వివాదానికి దారితీసింది. దీంతో తనకు బలాన్నిచ్చే హిందుత్వ ప్రచారాన్ని బీజేపీ మరింత ఉద్ధృతం చేసింది. చివరికి ప్రధాని మోదీ సైతం.. బజరంగ్ బలీ వ్యవహారంపైనే ప్రధానంగా ప్రసంగాలు చేశారు. హిందూ ఓట్ల ఏకీకరణకు ప్రయత్నం చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా ఫలితాలను ఇవ్వలేదని స్పష్టమవుతోంది! సంప్రదాయంగా బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న కోస్టల్ కర్ణాటకలో మాత్రం ఆ పార్టీ ప్రదర్శన మెరుగ్గానే ఉంది. గతంతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఓటు బ్యాంకు పెద్దగా పడిపోకపోవడం మాత్రం బీజేపీకి సానుకూల అంశంగా కనిపిస్తోంది.

Last Updated : May 14, 2023, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details