- మెజారిటీ సీట్లు పట్టేశారు..
- అధికారం చేతుల్లోకి వచ్చి చేరింది..
- సీఎం పదవి ఎవరిదన్నదే ఇప్పుడు ప్రశ్న..
- సిద్ధ వర్సెస్ డీకే... ఇద్దరి మధ్యే ఫైట్..
Karnataka election results : ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంతకాలం విభేదాలు బయటపడకుండా చూసుకున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వ్యూహం ఏంటి? సీఎం పదవిని ఒడిసిపట్టేదెవరు? పదవిని త్యాగం చేసేది ఎవరు? కర్ణాటక కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ బయటపడుతుందా? అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంగానే కనిపించినా.. అంతకుముందు వర్గపోర్లు నడిచాయన్నది కాదలేని వాస్తవం. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రధానంగా రెండు వర్గాలు ఉన్నాయి. మాజీ సీఎం సిద్ధరామయ్యకు మద్దతు ఇచ్చేది కొందరైతే.. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు అండగా ఉండేది మరికొందరు. సిద్ధరామయ్య ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేయగా.. డీకే శివకుమార్‌కు ఆ అనుభవం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరికి ఈ హోదా వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
- సిద్ధరామయ్య బలాలు
- పార్టీలో సీనియర్ నాయకుడు
- ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం
- మచ్చలేని రాజకీయ జీవితం
- పార్టీ నేతల నుంచి అధిక మద్దతు
- ఇవే చివరి ఎన్నికలు అని స్వీయప్రచారం
- సిద్ధరామయ్య బలహీనతలు
- బయటి నుంచి వచ్చిన వ్యక్తి అనే పేరు
- డీకే శివకుమార్ బలాలు
- పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత
- పార్టీకి ఆర్థికంగా అండగా ఉండటం
- సోనియా గాంధీకి నమ్మకస్తుడనే పేరు
- పార్టీలో ట్రబుల్ షూటర్‌గా ఉండటం
- డీకే శివకుమార్ బలహీనతలు
- మనీలాండరింగ్, పన్ను ఎగవేత కేసులు
- మెడపై సీబీఐ, ఈడీ కత్తి
Karnataka cm name : కర్ణాటకలో సామాజిక వర్గాలను ఆధారంగా చేసుకుంటే.. లింగాయతల తర్వాతి స్థానంలో ఒక్కలిగలు ఉంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఒక్కలిగ వర్గానికి చెందిన వ్యక్తి. తాజా ఎన్నికల్లో పాత మైసూరు ప్రాంతంలోనూ కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. జేడీఎస్‌ను కాదని కాంగ్రెస్‌కే ఒక్కలిగలు పట్టం కట్టినట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. స్వయంగా ఒక్కలిగ నేత అయిన డీకేకు ఈ విజయంలో కొంతైనా వాటా దక్కుతుంది. మరోవైపు, సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత. లింగాయత, ఒక్కలిగల తర్వాత రాష్ట్రంలో మూడో అతిపెద్ద సామాజిక వర్గం ఇదే. అంతేకాకుండా.. అహింద (మైనారిటీలు, బీసీలు, దళితులు) వర్గాలను ఏకం చేసి కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మార్చిన ఘనత సిద్ధరామయ్య సొంతం.
ప్రజా, ఆర్థికబలం!
Karnataka election results 2023 : ప్రజాబలంలో ఇద్దరూ తిరుగులేని నాయకులే. సీనియర్ నాయకుడిగా సిద్ధరామయ్య ఈ విషయంలో ఇంకాస్త ముందంజలో ఉంటారన్నది విశ్లేషకుల మాట! మాస్ లీడర్‌గా సిద్ధరామయ్యకు ప్రజల్లో ఆదరణ అధికంగా ఉంది. కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు అనగానే యడియూరప్ప, సిద్ధరామయ్య పేర్లే వినిపిస్తుంటాయి. ప్రస్తుతం యడ్డీ రాజకీయాలకు దూరమైన నేపథ్యంలో రాష్ట్రంలో తిరుగులేని లీడర్ సిద్ధరామయ్యే. ఇటీవలి కాలంలో డీకే సైతం రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా ఎదిగారు. ఆర్థికపరంగా బలమైన నేత కావడం డీకే శివకుమార్ ప్లస్ పాయింట్.