Karnataka Election 2023 : బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ త్రిముఖ పోటీతో రసవత్తరంగా సాగుతున్న కర్ణాటక పోరులోకి వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డి కొత్త పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రంలో బలమైన నేతగా ఉన్న గాలి జనార్దనరెడ్డి.. భారతీయ జనతా పార్టీని వీడి కల్యాణ రాజ్య ప్రగతి అనే కొత్త పార్టీని పెట్టారు. దీంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారిపోయాయి.
కర్ణాటకలో బళ్లారి ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాది పార్టీగా పేరున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో తొలిసారిగా గెలిచింది ఇక్కడే. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా బీజేపీ సీనియర్ నేత దివంగత సుష్మ స్వరాజ్ లాంటి నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. 2008లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడంలో ఈ జిల్లాకు చెందిన జనార్దన రెడ్డి సోదరులు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు అదే కుటుంబంలోని ఇద్దరు సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేస్తుండడం వల్ల బళ్లారి మరోసారి వార్తల్లో నిలిచింది.
Kalyana Rajya Pragati Party : కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ పోటీతో బళ్లారిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ పార్టీ తరఫున మాజీ మంత్రి, పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దనరెడ్డి భార్య లక్ష్మీ అరుణ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, జనార్దనరెడ్డి సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి బరిలో నిలిచారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి భరత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్ జేడీఎస్ నుంచి బరిలోకి దిగారు. ఆప్ సహా ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 24 మంది ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సోమశేఖర రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చింది బీజేపీ. సోమశేఖర రెడ్డి 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ లాడ్‌పై 1,022 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2013 అసెంబ్లీ ఎన్నికలకు సోమశేఖర రెడ్డి దూరంగా ఉన్నారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ లాడ్ గెలిచారు. 2018 ఎన్నికల బరిలో మరోసారి నిలిచిన సోమశేఖర రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గంలోకి నారా భరత్ రెడ్డి ఎంట్రీతో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్‌ను పక్కనపెట్టి భరత్ రెడ్డికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దీంతో అనిల్ జేడీఎస్‌లో చేరి టికెట్ పొందారు.
జోరుగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీలు
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ, కల్యాణ రాజ్య ప్రగతి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులను పక్కన పెడితే.. ఒకే కుటుంబానికి చెందిన లక్ష్మీ అరుణ, సోమశేఖర రెడ్డి పోటీలో ఉండడం వల్ల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. లక్ష్మీ అరుణ ఇంటింటికీ తిరుగుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి సైతం గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. వదిన, మరిది మధ్య జరుగుతున్న పోటీలో ఎవరు గెలుస్తారని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.