శాసనసభ ఎన్నికల వేళ కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. కర్ణాటక పాల సమాఖ్య ఆధ్వర్యంలోని నందిని పాల ఉత్పత్తులకు పోటీగా గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు అవకాశం కల్పించడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. గుజరాత్ రాష్ట్ర పాల సహకార సంస్థ బ్రాండ్- అమూల్, కర్ణాటక పాల సహకార సమాఖ్య బ్రాండ్(కేఎంఎఫ్)- నందిని కలిసి పనిచేయాలని కొద్ది నెలల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. అలాగే త్వరలోనే బెంగళూరులోనూ అమూల్ పాలు, పెరుగు అందుబాటులోకి రానున్నాయంటూ ఆ కంపెనీ ట్వీట్ చేసింది. ఈ రెండింటి నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అధికార బీజేపీపై మండిపడ్డాయి.
కర్ణాటకలో నందినిని(కేఎంఎఫ్).. గుజరాత్‌కు చెందిన అమూల్‌కు అమ్మేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. మరోవైపు కర్ణాటకలో నందినిని అంతమొందించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి విమర్శించారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 'ఒకే దేశం, ఒకే అమూల్, ఒకే మిల్క్, ఒకే గుజరాత్' నినాదంతో ముందుకు సాగుతోందని ఆయన చురకలంటించారు.
మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఖండించారు. కర్ణాటకలో అమూల్ ప్రవేశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. 'అమూల్‌కు సంబంధించి మాకు పూర్తి స్పష్టత ఉంది. నందిని జాతీయ బ్రాండ్. ఇది కర్ణాటకకు పరిమితం కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా నందినికి గొప్ప బ్రాండ్‌గా పేరుంది.' అని అన్నారు.
కర్ణాటకలో 'బ్రదర్స్ పాలిటిక్స్'.. గాలి భార్య X తమ్ముడు.. జార్కిహోలి అన్నదమ్ములు ఢీ!
1. కర్ణాటకలో అమూల్ వ్యాపారం చేస్తే ఏంటి ఇబ్బంది?
గతేడాది డిసెంబరులో మండ్యలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) మెగా డెయిరీ ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 'అమూల్, నందిని కలిస్తే డెయిరీ రంగంలో అద్భుతాలు సృష్టించగలవు' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. నందిని డెయిరీని గుజరాత్‌కు చెందిన అమూల్‌లో విలీనం చేసే ఆలోచనగా కాంగ్రెస్, జేడీఎస్ విమర్శించాయి. ఈ ఆరోపణల్ని అప్పట్లో అధికార బీజేపీ కొట్టిపారేసింది. మరోవైపు.. మార్చి నెలలో పెరుగు ప్యాకెట్లపై దహీ అని హిందీలో ప్రింట్ చేయాలని ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆదేశించింది. ఈ నిర్ణయంపై కూడా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల మధ్య.. మే నెలలో జరిగే ఎన్నికలకు ముందు అమూల్-నందిని వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.
2. అమూల్ ఇంతకు ముందు కర్ణాటకలో లేదా?
అమూల్ కొన్నేళ్ల కిందటే కర్ణాటకలో ప్రవేశించింది. వెన్న, నెయ్యి, పెరుగు, ఐస్‌క్రీమ్ వంటి పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమూల్ మాత్రమే కాదు.. దొడ్ల, హెరిటేజ్, తిరుమల, ఆరోక్య, మిల్కీ మిస్ట్( తమిళనాడు), నామ్‌ధారి, అక్షయకల్ప (కర్ణాటక) వంటి బ్రాండ్లు కూడా కన్నడనాట వ్యాపారాలు చేస్తున్నాయి.
3. ప్రతిపక్షాల మాటేంటి?
"కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం నందిని పాల ఉత్పత్తుల కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అప్పుడు రాష్ట్రంలో అమూల్‌కు పోటీగా మరే బ్రాండ్లు ఉండవు. కచ్చితంగా ప్రజలు అమూల్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని బీజేపీ బలవంతం చేస్తుంది." అనేది విపక్షాల ఆరోపణ.
కిట్టూర్-కర్ణాటకలో బీజేపీ x కాంగ్రెస్.. లింగాయత్‌లే కీలకం.. పీఠం ఎవరిదో?
4.అమూల్-నందిని వివాదంపై బీజేపీ వైఖరి ఏంటి?
నందినిని అమూల్‌లో విలీనం చేసే ఆలోచన లేదని అధికార బీజేపీ చెబుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించి.. వారిలో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపిస్తోంది. బీజేపీ పాలనలోనే రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరిగిందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.