కర్ణాటకలో అత్యంత కీలకమైన ప్రాంతం కిట్టూర్-కర్ణాటక. ఈ ప్రాంతంలోని 7 జిల్లాల్లో 50 అసెంబ్లీ స్థానాలున్నాయి. గతంలో స్వాతంత్రానికి ముందు బాంబే ప్రెసిడెన్సీలో ఉన్న ఈ ప్రాంతాన్ని ముంబయి-కర్ణాటకగా పిలిచేవారు. దీన్ని కిట్టూర్ కర్ణాటకగా నామకరణం చేయాలని 2021లో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కిట్టూర్-కర్ణాటక ప్రాంతంలో బెళగావి, ధార్వాడ్, విజయపుర, హవేరీ, గడగ్, బాఘల్‌కోట్, ఉత్తర కన్నడ జిల్లాలున్నాయి. ఈ ప్రాంతంలో అధికార భాజపాకు కాంగ్రెస్‌కు ప్రత్యక్ష పోరు ఉండగా.. జనతాదళ్(ఎస్) చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ ఉత్తర కన్నడ జిల్లా మినహా మిగతా ప్రాంతంలో ప్రధానంగా లింగాయత్‌ల ఆధిపత్యం కొనసాగుతుంది. సీఎం బసవరాజ్ బొమ్మై సహా పలువురు సీనియర్ నాయకులు ఈ ప్రాంతం వారే కావడం గమనార్హం.
మారుతున్న లింగాయత్‌ల ధోరణి..
2018లో కిట్టూర్-కర్ణాటక ప్రాంతంలోని 50 అసెంబ్లీ స్థానాల్లో భాజపా 30 గెలుచుకోగా.. కాంగ్రెస్ 17, జేడీఎస్ 2, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. రాజకీయంగా ప్రభావవంతమైన లింగాయత్ వర్గం మద్దతుతో ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ప్రస్తుతం వారు భాజపా వైపు నిలిచారు. 1990 వరకు ఈ ప్రాంతంపై కాంగ్రెస్‌కు పట్టు ఉండగా.. అప్పటి ముఖ్యమంత్రి, లింగాయత్ వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్‌ను పదవి నుంచి తప్పించడం వల్ల ఆ వర్గానికి కోపం తెప్పించింది. దీంతో ఆ వర్గం కాంగ్రెస్ పార్టీకి దూరమై భాజపా వైపు మెుగ్గు చూపింది. అప్పటి నుంచి 2013 వరకు లింగాయత్‌లు కమలం పార్టీ వైపు నిలిచారు.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి 50 స్థానాల్లో కాంగ్రెస్ 31 స్థానాలు గెలుచుకుని మరోసారి కిట్టూర్-కర్ణాటక ప్రాంతంపై తిరిగి పట్టుసాధించింది. అధికార భాజపాపై ప్రభుత్వ వ్యతిరేకత, యడియూరప్ప వేరు కుంపటి పెట్టడం వల్ల హస్తం పార్టీకి పునర్వైభవం వచ్చింది. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో యడియూరప్ప తిరిగి భాజపాలో చేరడం.. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడం వల్ల భాజపా బలపడింది. దీంతో 2018లో ఈ ప్రాంతంపై కాంగ్రెస్ పట్టును కోల్పోయి.. కమలం పార్టీ చేతుల్లోకి వెళ్లింది. అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కిట్టూర్-కర్ణాటక ప్రాంతంలోని బదామీ సీటు నుంచి పోటీ చేసినప్పటికీ.. లింగాయత్‌ల ఉద్యమం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారలేదు. కాంగ్రెస్‌తోపాటు ప్రత్యేక లింగాయత్‌ల ఉద్యమం చేపట్టిన చాలామంది సీనియర్ నేతలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
భాజపా కీలక నిర్ణయాలు..
మరోసారి అధికారాన్ని చేజిక్కించునేందుకు యత్నిస్తున్న భాజపా.. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న యడియూరప్పను ఎన్నికల వేళ తెరపైకి తీసుకువచ్చింది. రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేసిన లింగాయత్‌లకు 2 శాతం కోటా పెంచుతున్నట్లు కొద్దిరోజుల ముందు బొమ్మై సర్కార్ ప్రకటించింది. కిట్టూర్-కర్ణాటక ప్రాంతంలోని కొన్ని సెగ్మెంట్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లింలు కూడా రాజకీయంగా కీలకంగా ఉన్నారు. దీంతో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా..ఇటీవల ధార్వాడ్, బెళగావిలో భారీ బహిరంగ సభలు, మెగా రోడ్‌షోలు నిర్వహించారు. అటు.. గతనెలలో బెళగావిలో కర్ణాటక కాంగ్రెస్ యూనిట్ ఏర్పాటు చేసిన యువక్రాంతి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు.