తెలంగాణ

telangana

ETV Bharat / opinion

దిగ్గజాల నేల.. పాత మైసూరులో ఎవరిది పైచేయి.. ఒక్కలిగ ఓట్లెవరికి? - కర్ణాటక అసెంబ్లీ ఓల్డ్ మైసూర్

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఓల్డ్ మైసూరు ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఇక్కడి నుంచే ఎక్కువ మంది ముఖ్య మంత్రులు ఎన్నికయ్యారు. దీంతో పాటు చాలా మంది రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. భారత్​కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంతో కలిపి మైసూరు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత మైసూరు మహారాజులు ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి పునాది వేశారు.

karnataka election old mysore
karnataka election old mysore

By

Published : Apr 27, 2023, 7:55 AM IST

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఓల్డ్ మైసూరు ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడి వారికి రాజకీయ పరిజ్ఞానం ఉండేది. ఏకీకరణకు ముందు కర్ణాటక.. మైసూరులోనే అంతర్భాగంగా ఉండేది. బెంగళూరు నగరం కాకుండా కోలార్, బెంగళూరు రూరల్, రామనగర, మండ్య, హాసన్, మైసూరు, కొడగు, చామరాజనగర్, చిక్కబల్లాపూర్, తుమకూరు అనే 10 జిల్లాలు కలిపి ఓల్డ్ మైసూరు రీజియన్​గా ఏర్పడింది. ఇక్కడ మొత్తం 61కి పైగా నియోజకవర్గాలుండేవి.

ఇక్కడ గత 50 ఏళ్లలో రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. మన దేశానికి ప్రధానిగా సేవలందించిన హెచ్.డి. దేవెగౌడ ఇక్కడి హాసన్ జిల్లాకు చెందిన వ్యక్తి. కర్ణాటకను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన ఆ రాష్ట్ర మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ మండ్య జిల్లాకు చెందిన వారు.

ఎస్.ఎం కృష్ణ

ఇతర ప్రముఖులు:
రైతుల రుణాలు మాఫీ చేసి దేశ దృష్టిని ఆకర్షించిన నేత, మాజీ సీఎం కుమార స్వామి రామనగర జిల్లా ప్రస్తుత ఎమ్మెల్యే. వెనుకబడిన తరగతుల వారికి మార్గదర్శి దేవరాజ అరసు.. మైసూరు జిల్లాలోని హన్సూర్ నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎన్నికయ్యారు. ఆయన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యదీ ఇదే జిల్లా. శంకర్ గౌడ, చౌడయ్య, మాదే గౌడ (మండ్య), కృష్ణప్ప (కోలార్) లాంటి ప్రముఖ నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు.

కుమారస్వామి

ఇక్కడ 1950 నుంచి 2008 వరకు కాంగ్రెస్, జనతాదళ్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. 2008 తర్వాత బీజేపీ పుంజుకోవడం ప్రారంభించింది. గత పదేళ్లలో ఓల్డ్ మైసూరు ప్రాంతంలో ఆ పార్టీ అనేక నియోజకవర్గాల్లో విజయం సాధించడం ద్వారా క్రమంగా ఎదుగుతోంది. ప్రస్తుతం రానున్న ఎలక్షన్లలో ఇక్కడ కాంగ్రెస్, జేడీ(ఎస్), బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ జరగబోతోంది. ఈ రీజియన్​లో ఒక్కలిగ అనే సామాజిక వర్గం ప్రజలు అధికంగా ఉండటం వల్ల వారిని ఆకర్షించేందుకు 3 పార్టీలూ అనేక వ్యూహాలు రచిస్తున్నాయి.

దేవెగౌడ

ఆయా పార్టీల వ్యూహాలు:
ఓల్డ్ మైసూరు రీజియన్​లో గెలుపొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. పాత మైసూరులో భాగమైన మండ్య, మైసూరు, చామరాజనగర్, హాసన్ సహా జిల్లాల్లో అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం ప్రధాని మోదీని ఎన్నికల ప్రచారానికి రప్పించాలని చూస్తోంది. ఇక్కడి సంప్రదాయ ఓట్లను నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. మిగిలిన జేడీఎస్ కూడా ఇక్కడ పంచరత్న రథయాత్ర నిర్వహించడం ద్వారా భారీ స్థాయిలో ఓట్లు గెలుచుకోవాలని ఆశిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో పార్టీల చ‌రిత్ర ఇదీ:
ఓల్డ్ మైసూరులో 2013లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జేడీఎస్ 28, కాంగ్రెస్ 27 స్థానాల్లో గెలుపొంద‌గా.. బీజేపీ కేవలం 8 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. 2018లో జేడీఎస్ 31, కాంగ్రెస్ 19, బీజేపీ 10 సీట్లు గెలుచుకున్నాయి. చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్ధరామయ్య స్వయంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో (చన్నపట్టణ, రామనగర) కుమారస్వామి రెండింటిలోనూ విజయం సాధించారు.

సిద్ధరామయ్య

వేధిస్తున్న స‌మ‌స్య‌లు:
రాజ‌కీయంగా మంచి చ‌రిత్ర ఉన్నప్ప‌టికీ ఈ ప్రాంతాన్ని నేటికీ కొన్ని స‌మ‌స్య‌లు ప‌ట్టిపీడిస్తున్నాయి. కోలారు జిల్లాలో తాగునీటి సమస్య ఉంది. బెంగళూరు రూరల్ జిల్లాలో అనేక పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నప్పటికీ స్థానిక యువతకు సరైన ఉపాధి లేదు. రామనగర జిల్లాలో పట్టు, పండ్లను విస్తారంగా పండిస్తున్నప్పటికీ సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల స‌రైన ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. హెచ్‌.డి.కోటే ప్రాంత గిరిజన ప్ర‌జ‌లు మౌలిక వ‌స‌తుల లేమితో బాధపడుతున్నారు. వీరు త‌మ డిమాండ్లు నెరవేర్చాలని నేటికీ నిర‌స‌న‌లు చేస్తూనే ఉన్నారు.

ప్ర‌ముఖుల పోటీ ఇక్క‌డి నుంచే :
క‌ర్ణాక‌లో ప్రముఖులు ఈ ప్రాంతం నుంచే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత‌, మాజీ సీఎం, సిద్ధరామయ్య మైసూరు నుంచే పోటీలో ఉన్నారు. ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా హౌసింగ్‌ మంత్రి, లింగాయత్‌ నేత వి.సోమన్న నిల‌బ‌డ‌నున్నారు. ఇక కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతుండ‌గా.. ఆయనపై రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం కుమార‌స్వామి చన్నపట్న నుంచి నిల‌బ‌డితే.. ఆయనపై బీజేపీ నేత సీపీ యోగేశ్వర్ పోటీ చేస్తున్నారు. దీంతో మైసూరు ప్రాంతం దేశం దృష్టిని ఆక‌ర్షించే అవ‌కాశ‌ముంది.

మొత్తం మీద పాత మైసూరు.. కర్ణాటక రాజకీయాల్లో పవర్‌హౌస్‌గా ఉంది. ఇప్పటికే మూడు పార్టీలు జోరుగా ప్రచారాలు చేస్తూ, వ్యూహాలు పన్నుతూ ఈ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో చూసిన ఈ ప్రాంత ప్రజా నాయకుల గురించి, రాజకీయ చరిత్రను గురించి ఈటీవీ భారత్‌తో చెబుతూ కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details