నోటా.. దాదాపు ఈ పేరు వినని ఓటరుండరు. ఓటు వేసేందుకు బ్యాలెట్ బాక్సులకు బదులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లను వాడటం మొదలు పెట్టారు. తర్వాతి కాలంలో నోటా బటన్‌ను తీసుకొచ్చారు. నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్ అని అర్థం. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఈ అవకాశం కల్పించింది. ఈ నోటా ఓట్లు 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించాయి. ఈ ఓట్లే చాలా మంది అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించాయి. ఆ రాష్ట్ర ఓటర్లు నోటాకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ.. అది కొన్ని ఆసక్తికరమైన లెక్కలు, చర్చలకు తెరలేపింది. అయితే ఈ సారి వాటి సంఖ్య పెరిగే అవకాశముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు దాదాపు 3,22,381 మంది ఓటర్లు.. నోటాకు ఓటేశారు. అంటే మొత్తం మొత్తం పోలైన ఓట్లలో నోటా శాతం 0.9 శాతంగా నమోదైంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ నోటాకు దాదాపు 2.57 లక్షల మంది ఓటర్లు నోటాకు జైకొట్టారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో నోటాకు అంత ప్రాధాన్యం లేకపోయినా.. ఇక్కడి ఓటర్లు నోటాను ఇప్పుడిప్పుడే సీరియస్‌గా తీసుకుంటున్నారనేది రాజకీయ నిపుణుల మాట.
2018 ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో నోటా నాలుగో స్థానంలో నిలిచింది. ఒక్కో నియోజకవర్గంలో సగటున 10-15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వాటన్నిటినీ కాదని.. నోటా నాలుగో స్థానంలో నిలిచింది. 14 నియోజకవర్గాల్లో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. కొన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే నోటాకే ఎక్కవ శాతం ఓట్లు రావడం విశేషం.
జాతీయ పార్టీ అయిన బీఎస్పీకి గత ఎన్నికల్లో మొత్తం 1,08,592 ఓట్లు వచ్చాయి. సీపీఎంకు 81,191, ఎన్సీపీకి 10,465 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర పార్టీ జేడీయూకి 46,635 ఓట్లు వచ్చాయి. ఇక మిగిలిన రాజకీయ పార్టీలుగా నమోదైన వాటిలో.. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీకి 74,229, స్వరాజ్ ఇండియా పార్టీకి 79,400, భారతీయ ప్రజా పార్టీకి 83,071 ఓట్లు పోలయ్యాయి. అయితే.. ఈ పార్టీలన్నింటి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. నోటాకు మొత్తం 3,22,381 ఓట్లు పడ్డాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నోటా గెలుపోటములతో గేమ్ ఆడింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా ఆ పార్టీ కేవలం 9 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఇందులో నోటా పాత్ర ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించాయి. ఆ 7 నియోజకవర్గాల్లో నోటా ఓట్లే ఎక్కువ ఉన్నాయి.
కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆ ఎన్నికల్లో బాదామి నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి శ్రీరాములుపై కేవలం 1,696 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో 2007 నోటా ఓట్లు నమోదయ్యాయి. గడగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 1,868 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు. ఇక్కడ కూడా దాదాపు 2000 నోటాకు ఓట్లు వచ్చాయి. హీరేకెరూరులో 555, కుందగొలలో 634, మస్కిలో 213 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. హిరేకెరూరులో 972, కుందగొలలో 1,032, మస్కిలో 2,049 నోటా ఓట్లు పోలయ్యాయి.
యల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ 1,483 ఓట్ల తేడాతో విజయం సాధిస్తే.. ఇక్కడ 1,421 నోటా ఓట్లు వచ్చాయి. అథనిలో 2,331, బళ్లారిలో 2,679, యమకనమరదిలో 2,850, విజయనగర్ లో 2,775 ఓట్ల స్వల్ప తేడాతో అభ్యర్థులు గెలుపొందారు. ఈ నియోజకవర్గాల్లో గెలుపు-ఓటముల మార్జిన్ కంటే నోటా ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. అవి ఫలితాలపై తక్కువ ప్రభావం చూపాయి. మరి ఈసారి జరిగే ఎన్నికల్లో నోటా ఓట్లు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో తెలియాలంటే మే 13 వరకు ఆగాల్సిందే!