Karnataka Election Results 2023 Congress : కర్ణాటక రాజకీయ చరిత్రలో ఆనవాయితీగా వస్తున్న మార్పు సంప్రదాయమే గెలిచింది. స్థానిక అంశాలకు ప్రాధాన్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ప్రచార సమయంలో పలు జాతీయ అంశాలను లేవనెత్తి అధికారాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది. వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న కమల దళం ఆశలకు గండి కొట్టింది. మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 66 అసెంబ్లీ స్థానాలను గెలుపొందగా.. జేడీఎస్ 19 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరుకు కారణాలేంటి?
మొత్తం సీట్లు | 224 |
కాంగ్రెస్ | 135 |
బీజేపీ | 66 |
జేడీఎస్ | 19 |
ఇతరులు | 4 |
బీజేపీ ఉచ్చుకు దూరం!
Congress Won Reasons : కన్నడ నాట మరోసారి అధికారం చేపట్టాలని శతవిధాలా ప్రయత్నించిన బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. కమల దళం ఉచ్చులో పడకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని హస్తం పార్టీ.. అధికారాన్ని కైవసం చేసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి వంటి జాతీయ అంశాలను లేవనెత్తి కర్ణాటక ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ముందే పసిగట్టింది కాంగ్రెస్. ఆ వివాదాస్పద విషయాల్ని పెద్దగా పట్టించుకోకుండా.. స్థానిక సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించింది. కాంగ్రెస్ హామీల్లో ఒకటైన బజరంగ్దళ్, పీఎఫ్ఐ నిషేధంపై వ్యతిరేకంగా నరేంద్ర మోదీ వంటి అగ్రనేతలు ప్రచారం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది!
"40 శాతం కమీషన్ ప్రభుత్వంతో కన్నడ ప్రజలు విసిగిపోయారని ముందే గ్రహించాం. కాంట్రాక్టర్ల సంఘం చెప్పిన విషయాల్ని హైలైట్ చేశాం. ప్రచారం ముగిసే సమయానికి బొమ్మై సర్కార్ అవినీతిని రిపోర్ట్ కార్డు రూపంలో బయటపెట్టాం. వివిధ రకాల పనులు, నియామకాల కోసం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వసూళ్లను ప్రముఖంగా ప్రస్తావించాం.కన్నడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని.. వారికి కచ్చితంగా ఉపశమనం అవసరమని గ్రహించాం. అందుకే ఐదు ఉచిత హామీలను కురిపించాం. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రచారం కేవలం కాంగ్రెస్‌పై దూషణలు తప్ప ఏం లేవు. రెండు పార్టీల ప్రచారాలను ప్రజలు బాగా గమనించారు" అని కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్.. కొద్ది రోజుల క్రితమే ఈటీవీ భారత్‌తో తెలిపారు.
"పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక.. రాష్ట్రవ్యాప్తంగా చేసిన ప్రసంగాల్లో బొమ్మై సర్కార్ అవినీతి, ఐదు ఉచిత హామీలను పదేపదే ప్రస్తావించారు. సోషల్ మీడియా బృందాలు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా రూపొందించిన యానిమేషన్ వీడియో క్లిప్‌లు, చార్టుల ద్వారా మా మ్యానిఫెస్టోను ప్రచారం చేశాయి. మా పార్టీ అగ్రనేతలు చైనా, అదానీ, కశ్మీర్ అంశాలను లేవనెత్తలేదు. అది మాకు ఉపయోగకరం" అని కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు ప్రకాష్ రాఠోడ్ చెప్పారు. దాదాపు 70 మంది ఏఐసీసీ పరిశీలకులు నియోజకవర్గాల వారీగా ఓటర్లకు ఐదు హామీలను వివరించేందుకు ఇంటింటికి వెళ్లినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు.. ఈటీవీ భారత్‌తో తెలిపాయి.
హామీలు అందించిన విజయం!
Karnataka Congress Manifesto : కర్ణాటకలో కాంగ్రెస్‌ను హామీలు కూడా అధికారాన్ని అప్పజెప్పాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలకు చాలా రోజుల ముందే ఉచిత కరెంటు, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి వంటి ఐదు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే 'గృహజ్యోతి' కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకముందే హామీ ఇచ్చారు.
మహిళా ఓటర్లకు ప్రత్యేక హామీలు!
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు 'గృహలక్ష్మి' పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల 2వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 'అన్న భాగ్య యోజన' పేరుతో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు నెల రూ.3 వేలు ఇస్తామని ప్రకటించింది. మహిళలను ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రోజే అమలుపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆ తర్వాత మ్యానిఫెస్టో విడుదల సమయంలోనూ అనేక హామీలు కురిపించింది. మత్స్యకారులకు ఏటా పన్ను రహిత 500 లీటర్ల డీజిల్ పంపిణీ చేస్తామని ప్రకటించింది. లీన్ పీరియడ్‌లో రూ.6000 అలవెన్స్ ఇస్తామని చెప్పింది. వీటితోపాటు మరిన్ని హామీలు ఇచ్చింది.