కర్ణాటకలో అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకనే కాబట్టి.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తమకు తిరుగులేని విజయం కట్టబెట్టిన గుజరాత్ ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. గుజరాత్ మోడల్‌తో కర్ణాటక ప్రజలను గెలవాలని భావిస్తోంది. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూస్తే బీజేపీ వ్యూహం అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఏంటా గుజరాత్ మోడల్? కర్ణాటక ఎన్నికల్లో అది ఎంత వరకు ప్రభావం చూపుతుంది? అన్న విషయాలను పరిశీలిద్దాం.
అభ్యర్థుల ఎంపికలో భాగంగా 189 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి సహా ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది. బీజేపీ బలంగా ఉన్న దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోనూ సమూల మార్పులు చేసింది. ఉడుపిలో ఐదుగురు, దక్షిణ కన్నడలో ఇద్దరు సిట్టింగులకు హ్యాండ్ ఇచ్చింది. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. కొందరు సీనియర్ నేతలను సైతం పక్కన బెట్టింది. రెండో జాబితాలో ప్రకటించే అభ్యర్థుల విషయంలోనూ బీజేపీ ఇదే ఫార్ములాను పాటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో 16 చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కొందరిపై వేటు తప్పదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
గుజరాత్ ఎన్నికల సమయంలోనూ అధికార బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. స్థానిక నేతలపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునేందుకు అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. కొత్త ముఖాలను తెరపైకి తెచ్చింది. 'మార్పు వ్యూహం' ఆ ఎన్నికల్లో ఫలించింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా సాధించని తిరుగులేని మెజార్టీతో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోనూ ఇదే పంథాను అనుసరిస్తోంది బీజేపీ. టికెట్లు నిరాకరించిన వారిలో చాలా మందిపై స్థానికంగా వ్యతిరేకత ఉందని బీజేపీ భావిస్తోంది. సుదీర్ఘకాలంగా ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. అభివృద్ధి విషయంలో ఆ ప్రాంతాలు వెనకబడి ఉన్నాయన్న వాదనలను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవారికి అవకాశం ఇస్తే.. యువతరాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని బీజేపీ చెబుతోంది.
జంపింగ్ జపాంగ్‌లకు జాక్‌పాట్
వలస పక్షులకు ప్రాధాన్యం ఇవ్వడం టికెట్ల కేటాయింపులో మరో ఆసక్తికరమైన అంశం. 2019లో ఆపరేషన్ లోటస్ సందర్భంగా పదవులకు రాజీనామా చేసి.. బీజేపీలో చేరినవారిలో దాదాపు అందరికీ టికెట్లు కేటాయించింది బీజేపీ. రమేశ్ జార్ఖిహోళి, మహేశ్ కుమతల్లి, శ్రీమంత్ పాటిల్, ప్రతాప్ గౌడ పాటిల్, ముందగోడు హెబ్బర్, బీసీ పాటిల్, కే సుధాకర్, భైరాతి బసవరాజ, ఎస్టీ సోమశేఖర్, మునిరత్న, గోపాలయ్య, ఎంటీబీ నాగరాజ్, నారాయణ గౌడకు టికెట్లు ఇచ్చింది.